పాత బంగారం: 'బట్టల సత్తి'కి లోపాలు చెప్పి, సలహా ఇచ్చిన అక్కినేని

By AN TeluguFirst Published Oct 23, 2019, 3:40 PM IST
Highlights

అక్కినేని నాగేశ్వరావు గారికి, ఆత్మీయ మిత్రుడు సిగరెట్ అప్పారావు. అప్పారావు గారు నేను వేసిన నాటకం చూసారు. నన్ను అక్కినేని గారి దగ్గరకి తీసుకు వెళ్ళారు. 

 

అప్పటికి ఇంకా బట్టల సత్తిగా మారలేదు మల్లికార్జున రావు. వేషాల ట్రైల్స్ లోనే ఉన్నారు. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావుగారు ఆ ప్రయాణంలో తగిలారు.  అప్పుడు నాగేశ్వరరావుగారు ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా వెలుగుతున్నారు. తనకు సాయం చేయమని వేరే వారి ద్వారా వెళ్లారు మల్లికార్జున రావు. ఆ రోజు ఏం జరిగిందో మల్లికార్జున రావు మాటల్లోనే చూద్దాం.

అక్కినేని నాగేశ్వరావు గారికి, ఆత్మీయ మిత్రుడు సిగరెట్ అప్పారావు. అప్పారావు గారు నేను వేసిన నాటకం చూసారు. నన్ను అక్కినేని గారి దగ్గరకి తీసుకు వెళ్ళారు. ఆయన రెండు నిముషాల్లో ఏదైనా చేసి చూపించమన్నారు. మిత్రులిద్దరూ లోకాభిరామాయణంలో పడ్డారు. ఓ గంటసేపు జరిగింది. రెండు నిముషాల్లో ఏం చేయాలన్నది నాకు అంతుపట్టలేదు. టైమ్ సెన్స్ ప్రక్కన పెట్టేసి నిజం నాటకంలో సార్వభౌమారావు పాత్ర చేసాను. అక్కినేను గారు నన్ను నిశితంగా పరిశీలిస్తున్నారని గ్రహించాను.

(Also Read) పాత బంగారం: 'లవకుశ' గురించి ఆశ్చర్యపరిచే విశేషాలు

వెంటనే కొడుకు పుట్టాల నాటికలో నాలుగయిదు పాత్రలున్న కామెడీ సన్నివేశం చేసాను. ఆయన ఇక చాలు అనే అవకాసం ఇవ్వకుండా లేపాక్షి నాటకంలో శిల్పి వేషం వేసాను. నాగేశ్వరరావు గారు ప్రక్కనే కోటు వేసుకున్న ఓ పెద్ద మనిషి ఉన్నారు. ఆయన ఓహో అనేసారు. ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్స్ అన్నీ పది,పదిహేను పేజీలు ఉంటాయి కదా అన్నారు అక్కినేని. నేను తలూపాను. నేను చేస్తాను అంటూ ఆయన పది నిముషాలసేపు విప్రనారాయణ చిత్రంలోని తన పాత్ర చేసి చూపించారు. ఈ డైలాగులు నాకు ఇంకా గుర్తుండిపోవటానికి కారణం అప్పటి సినిమాల్లోని కథ, మనస్సుకు హత్తుకునే మాటలు. ఇప్పుడు నిన్న నటించిన సినిమాల్లోని డైలాగు చెప్పమన్నా చెప్పలేను. సరే ఆ విషయం అప్రస్తుతం.

నీలో కొన్ని లోపాలు ఉన్నాయి. అవి చెప్తాను. నువ్వు రంగస్దల నటుడివి కాబట్టి భావ ప్రకటన ముఖ్యం. నువ్వు నీ కనుబొమలు మాటి మాటికీ ఎగరేస్తున్నావ్. అది సినిమాకు అనవసరం. సినిమా నటనకు స్టేజీ మీద ఇచ్చేటంత ఎక్సప్రెషన్ అనవసరం. పోతే మరో లోపం మాటి మాటికి పెదవులు తడి చేసుకుంటున్నావ్. అది నీ అలవాటా అన్నారు.  అది అలవాటు కాదు సార్...హైదరాబాద్ వాతావరణం అంటూ నాన్చాను. నా సొంత చిత్రంలో నీకో చిన్న వేషం ఇవ్వటానికి ప్రయత్నిస్తాను అని హామీ ఇచ్చారు అక్కినేని.

ఇక మల్లికార్జున రావు ఆ తర్వాత పెద్ద నటుడుగా ఎదిగారు. వంశీ దర్శకత్వం వహించిన లేడీస్ టైలర్ సినిమాలో బట్టల సత్యం పాత్ర ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆయన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని కాశింకోట గ్రామానికి చెందినవారు.1973 నుంచి సినిమాల్లో నటిస్తున్న మల్లికార్జునరావు 375 సినిమాలకు పైగా చేశారు. హాస్యం నవ్వించాలి తప్ప నవ్వుల పాలు కాకూడదని ఆయన అభిప్రాయం.

తొలి రోజుల్లో ఆయనకు రావు గోపాలరావు చాలా మద్దతు ఇచ్చారు. రావు గోపాలరావు ఇచ్చిన సలహాల గురించి ఆయన ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటుండేవారు. గోపాలరావు గారి అమ్మాయి, పార్వతీపరమేశ్వరులు సినిమాలకు ఆయన సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. తమ్ముడు సినిమాలో నటనకు గాను ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

click me!