అల్లు అరవింద్ చేతిలో మలయాళం బిగ్ మూవీ

By Prashanth MFirst Published Nov 7, 2019, 7:34 AM IST
Highlights

పూర్వకాలంలో సంప్రదాయా బద్ధంగా వచ్చిన మామాంగం ఉత్సవాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. హిస్టారికల్ కథ కావడంతో తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు.  ఇక టీజర్ లో పలు యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటుంన్నాయి.

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ సినిమాలు మాత్రమే కాకుండా ..స్వాతి కిరణం, యాత్ర లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. తాజాగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియడ్‌ డ్రామా మమాంగం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను క్రితం వారం రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మమ్ముట్టి కేరళ సాంప్రదాయ యుద్ధవీరుడిగా కనిపించాడు. మమాంగం అనే పండుగ సందర్భంగా జరిగే వివాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. 17వ శతాబ్దం నాటి కథతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

అందుతున్న సమాచారం మేరకు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని రిలీజ్ చేయటానికి హక్కులను తీసుకున్నట్లు సమాచారం. దాంతో తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ భారీగా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మన్యం పులి సినిమాలా ఈ సినిమా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.  మమ్ముట్టి మాట్లాడుతూ ‘‘భారతదేశ సంస్కృతి విశిష్టమైనది. దేశ ప్రజల్ని భాషలు విభజించినా... భాష వల్ల ఒకరి చరిత్ర మరొకరికి తెలియకుండా పోకూడదు. కేరళ చరిత్ర అంటే దేశ చరిత్ర కూడా. సినిమా ద్వారా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఏకం చేసి, మనకు సంబంధించిన కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నా’’ అన్నారు.

డైరెక్టర్  ఎం. పద్మకుమార్   మాట్లాడుతూ - "1695వ సంవత్సరంలో జరిగిన ఒక నిజమైన కథతో, ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి విజువల్స్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. జమోరిన్‌ని చంపిన చావేర్స్ కథే ఈ సినిమా. మ‌మ్ముట్టి ఈ సినిమాలో ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో కనిపిస్తారు. ఒక 12 ఏళ్ల అబ్బాయి.. చరిత్రలోని ఒక పాత్రను పోషిస్తూ ఇండియన్ స్క్రీన్ లో ఎప్పుడూ చూడనటువంటి యాక్షన్ సన్నివేశాల్లో నటించాడు" అన్నారు.

ఈ మూవీ తొలి షెడ్యూల్‌ సంజీవ్‌ పిళ్ళై దర్శకత్వం వహించగా తరువాతి షెడ్యూల్‌ నుంచి ఎం పద్మకుమార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ప్రాచీ తెహ్లన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, ఉన్ని ముకుందన్‌, మోహన్‌ శర్మ, ప్రాచీ దేశాయ్‌, మాళవికా మీనన్‌ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మాటలు: కిరణ్‌, సంగీతం: ఎం. జయచంద్రన్‌, నేపథ్య సంగీతం: సంచిత్‌ బల్హారా, అంకిత్‌ బల్హారా.

click me!