
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు ఈ మధ్య కాలంలో యూఏఈ గోల్డెన్ వీసాకు అప్లై చేస్తున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి గోల్డెన్ (UAE) వీసా అందుకుంటున్నారు. ఇఫ్పటికే ఉపాసన కొణిదెల, సిలంబరసన్ టిఆర్, కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal), అమలా పాల్, త్రిష, రాయ్ లక్ష్మి వంటి ప్రముఖులు యూఏఈ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వీసాను వీసాను పొందారు. కొద్ది రోజుల కిందనే కాజల్ అగర్వాల్ ఈ గౌరవమైన వీసాను పొందగా.. ఇప్పుడు, నటి ప్రణిత సుభాష్ UAE నుండి గోల్డెన్ వీసా అందుకున్నారు.
ఈ సందర్భంగా తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో వీసా అందుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసింది. గోల్డెన్ వీసా అందడంతో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది ప్రణిత. ‘యూఏఈ నుంచి గోల్డెన్ వీసాను పొందడం గౌరవంగా ఉంది’ అంటూ పేర్కొంది. గోల్డెన్ వీసా ఎటువంటి జాతీయ స్పాన్సర్ లేకుండా UAEలో నివసించడానికి మరియు పని చేయడానికి విదేశీయులను అనుమతిస్తుంది. ఈ వీసా పొందిన వారి వ్యాపారంపై పూర్తి యాజమాన్యాన్ని కూడా అందిస్తుంది.
కాగా, ప్రణిత సుభాష్ గత ఏడాది మే 30న బెంగళూరులో వ్యాపారవేత్త నితిన్ రాజుతో వివాహం చేసుకుంది. ఈ వీసా రావడంతో మున్ముందు అక్కడే నివసించే అవకాశం ఉండనుంది. కన్నడ, తమిళం మరియు తెలుగు చిత్రాలలో నటించిన ప్రణీత సుభాస్ కొద్ది మేర ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకుంది. తెలుగులో బావ, రభస, అత్తారింటికి దారేది, హలో గురు ప్రేమ కోసం వంటి చిత్రాల్లో నటించి తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ప్రణిత ప్రస్తుతం కన్నడ చిత్రం ‘రమణ అవతార’లో నటిస్తోంది.