ఇది ఒక సామాన్యుడి ప్రశ్న
‘‘కోదండరాం చాలా చిన్నవాడు.. ఆయన గడ్డి బండికింద పోయే కుక్క అసోంటోడు... ఆయన మీటింగ్లు పెడితే 500 మంది కూడా వస్తలేరు.. ఆయన జీవితంలో ఏనాడైనా సర్పంచ్ గా కూడా గెలవని మనిషి’’ ఇవన్నీ ఇటీవల సిఎం కేసిఆర్ కోదండరాం గురించి మాట్లాడిన మాటలు. ఇవే కాకుండా వాడు, వీడు అని దూషించిర్రు. అమరుల యాత్రనా లంగా యాత్రనా అని కించపరిచే మాటలన్నరు. తెలంగాణకు కోదండరాం చేసిందేముంది తొక్క అని ఎతేష్కం చేసిర్రు. సిఎం మాటలు విన్న తర్వాత సగటు తెలంగాణ మనిషికి వచ్చే డౌట్ ఏదంటే..? అర్రే మల్ల అట్లయితే అసోంటి కోదండరాం ను ఎందుకు అరెస్టు చేసిర్రు బై అని. ఇప్పుడు ప్రతి సామాన్యుడి సందేహానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సర్కారు పెద్దల మీద ఉంది.
undefined
6వ విడత అమరుల స్పూర్తి యాత్రను వరంగల్ జిల్లాలో ప్లాన్ చేసుకున్నది తెలంగాణ జెఎసి. దీనికోసం భారీ ఏర్పాట్లే చేసుకున్నది. ఒకరోజు ముందు ఫేస్ బుక్ లో సుమారు రెండు గంటల పాటు జెఎసి ఛైర్మన్ కోదండరాం తాము చేపట్టనున్న యాత్ర ఉద్దేశాలను స్పష్టంగా వివరించారు. ఉద్యోగాల భర్తీ, ప్రజాస్వామ్య పరిరక్షణ, కాంట్రాక్టర్ల కమిషన్ల పనులకు వ్యతిరేకంగా జనాలను చైతన్యం చేయడం కోసం యాత్ర చేపడుతున్నట్లు వివరించారు. మరి యాత్రలో ఏరకమైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తామని కానీ, అలాంటి పనులు చేయాలంటూ జనాలను రెచ్చగొట్టే ఉద్దేశాలు కానీ ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు కోదండరాం. ప్రజా సమస్యలే ప్రస్తావిస్తామన్నారు. పాలనలో ఉద్యమకారులను పక్కనపెట్టి ఉద్యమ ద్రోహులకు పెద్ద పీట వేస్తున్న విషయాలను జనాలకు అర్థమయ్యేలా చెబుతామన్నారు.
మరి సర్కారు చేసిందేమిటంటే?
కోదండరాం వరంగల్ లో కాలు పెట్టక ముందే అరెస్టు చేసి కీసర పోలీసు స్టేషన్ లో పెట్టింది. ఆయన యాత్ర కోసం అనుమతి కోరుతూ పోలీసులకు పెట్టుకున్న దరఖాస్తును బుట్టదాఖలు చేశారు. తుదకు యాత్రకు అనుమతి ఇవ్వాలని చివరి ప్రయత్నంగా కోదండరాం హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కూడా కలిసి రిక్వెస్టు చేసిర్రు. అయినా హోంమంత్రి తన చేతిలో ఏమీ లేదన్నట్లు సమాధానమిచ్చిర్రు. దీంతో కోదండరాం యాత్ర మాత్రం సాగుతుందని ముందుకు కదలగానే మఫ్టీలో వచ్చిన పోలీసులు ఆయనను అరెస్టు చేసిర్రు. దీనికి సర్కారు వారు చెబుతున్న కారణాలు కూడా ఒకసారి చూద్దాం. కోదండరాం ను ముందస్తు (ప్రివెంటీవ్) అరెస్ట్ చేసినట్లు తెలంగాణ పోలీసులు అంటున్నారు. ఈ తరహా అరెస్టులు ఇప్పుడు అవసరమా? ఇలా ముందస్తు అరెస్టు చేయాల్సిన ప్రమాదకర పరిస్థితిలులు ఓరుగల్లులో ఉన్నాయా? అంటే పోలీసుల వద్ద సమాధానం ఉంటుదని అనుకోలేం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పర్యటనలను నివారించి అరెస్టు చేయడం సాధారణంగా మన దేశంలో జరుగుతది. మరి కోదండరాం ఇప్పటి వరకు ఐదు దశల యాత్రలు పూర్తి చేసిర్రు. అందులో తొలి మూడు దశలు ప్రశాంతంగా సాగిపోయినయి. నాలుగో దశలో పాలక పెద్దలు కన్నెర్ర జేశారు. అంతే రచ్చ మొదలైంది. క్షణాల్లో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది. దీంతో నాలుగో దశ నిజామాబాద్ లో తలపెట్టిన జెఎసి యాత్రను పోలీసులు జరగనీయకుండా కోదండరాం ను అరెస్టు చేసి ఇంటికి తీసుకొచ్చేసిర్రు.
ఇక ఐదో దశ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చేపట్టడంతో ఆదిలాబాద్ లో పెద్దగా సర్కారు నుంచి అడ్డంకులేవీ కల్పించలేదు. దీంతో ఐదో దశ యాత్ర సాఫీగానే సాగింది. అయితే ఒకవైపు కొలువుల కొట్లాల సభ తలపెట్టడం, మరోవైపు చైతన్యానికి మారుపేరైన ఓరుగల్లులో 6వ దశ జెఎసి యాత్ర తలపెట్టడంతో సర్కారు అరెస్టుల పర్వానికి తెర లేపినట్లు కనబడుతున్నది. ఇక జెఎసి ప్రతినిధులను అర్థరాత్రి నుంచే అరెస్టు చేసి స్టేషన్లలో బంధించారు. తెల్లారుగట్ల నాలుగు గంటలకు ఓయు జెఎసి నాయకురాలు బాలలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. జనగామలో బాల లక్ష్మి కిరాయికి ఉండే ఇంటికి 4 గొట్టంగ పోలీసులు వెళ్లి కంపోడు గోడ దూకి ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేయాల్సిన అవసరం ఉందా? ఆమెను అరెస్టు చేసే తీరు చూసి ఇంటి ఓనర్ కుటుంబం భయభ్రాంతులకు గురయ్యారట. ఆమెతోపాటు అనేక మందిని తెల్లవారే సరికే పోలీసు స్టేషన్లకు పట్కపోయి పడేశిర్రు.
కోదండరాం ను ఒకవైపు కించపరుస్తూ, దూషిస్తూ, సర్పంచ్ కూడా కాలేని చాలా చిన్నవాడు అంటూనే మరోవైపు కసిగా ఆయనను కదలనీయకుండా అరెస్టుల పర్వం సాగించడం ఆశ్చర్యం కలుగుతోందని నెటిజన్లు అంటున్నారు. కోదండరాం అంటేనే తెలంగాణ సర్కారు గజగజ వనికిపోతుందని, అందుకే ఆయనను అరెస్టు చేసి యాత్ర చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తోంది జెఎసి. ఇక ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతటి దమనకాండ లేదని జెఎసి నేతలు అంటున్నారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం హోరుగా సాగుతున్న రోజుల్లోనే నాటి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ఏనాడూ అడ్డంకులు కల్పించలేదు. అలాగే ఆంధ్రా, తెలంగాణ మధ్య వైషమ్యాలు ఉన్న రోజుల్లో కూడా హైదరాబాద్ లో జగన్ సభ పెట్టనిచ్చారు. ఎపిఎన్ జిఓ ల సభ జరుపుకునేందుకు అనుమతించారు. అయినా ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు కంట్రోల్ చేయగలిగారు.
మరి అంతటి భావోద్వేగాలు ఉన్న సమయంలోనే తెలంగాణ ఉద్యమాన్ని కానీ, సమైక్య ఆందోళనలు కానీ జరిగేలా ఉమ్మడి ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో ఈనాడు ఏమాత్రం భావోద్వేగాలు లేని వేళ, ప్రశాంతమైన వాతావరణం నెలకొన్న తరుణంలో పటిష్టమైన ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ రూపుదిద్దుకున్న తెలంగాణలో చిన్నవాడు కోదండరాం యాత్ర చేస్తే ఇంత కసిగా అరెస్టు చేసిర్రెందుకబ్బా అని ప్రతి సామాన్యుడు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అరెస్టు చేశారంటే ఈ సామాన్యుల మాదిరిగానే కోదండరాం కూడా పాలక పెద్దలను ప్రశ్నిస్తున్నాడు కాబట్టే అరెస్టు చేశారని జనాలు అనుకుంటున్నారు. అరెస్టు చేసినంత మాత్రాన సర్కారు పైచేయి సాధించే అవకాశం ఉందా? లేక సరికొత్త పద్ధతుల్లో జెఎసి ఆందోళన చేపట్టి రాచరికపు సర్కారు మెడలు వంచకపోతదా అని నాలాంటి సామాన్యులంతా ఎదురుచూస్తున్నారు.
రచయిత... అచ్చిన అయిలయ్య, జర్నలిస్టు. హైదరాబాద్.