నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందింది నిజం.. భారత దేశంలో విలీనం అయింది వాస్తవం.. మరి ఈ నిజం, వాస్తవం అంగీకరించేందుకు ఎందుకు భయం?
సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా ఎందుకీ నీలి నీడలు?.. సమైక్య రాష్ట్రంలో ఇదే తంతు.. స్వరాష్ట్రంలోనూ అదే విధానమా?
హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ భాగం కావడం అబద్దమా?.. ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన పోరాటం తప్పా?.. రాజకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందార్ల అరాచకాలు నిజం కాదా?
తెలంగాణ గడ్డ భారత దేశంలో విలీనం కావడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా?.. తరతరాల నిజాము బూజు వదలడం మీకు నచ్చలేదా?.. నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మరాఠ్వాడా, హైదరబాద్ కర్ణాటక ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విలీన ఉత్సవాలు జరుగుతుంటే, ప్రధాన భూభాగమైన తెలంగాణలో ఎందుకు జరగవు?..
undefined
సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపకపోవడాన్ని తప్పు పట్టింది తెరాస.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు కేసీఆర్.. మరి మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత, ఆయనే అధికారంలో ఉన్నాక సెప్టెంబర్ 17 వేడుకలను ఎందుకు నిర్వహించడం లేదు?
హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహిస్తే ముస్లింలు బాధ పడతారని ఓ మూర్ఖపు వాదన వినిపిస్తున్నారు. రాచరిక పాలన పీడ విరుగడైతే వారెందుకు బాధ పడతారు?.. అసఫ్ జాహీ వంశ పాలనకు వారెలా ప్రతినిధులు అవుతారు?..
నిజాం పాలన అంతం కావాలని అక్షరాయుధాలు ఎక్కుపెట్టి రజాకార్ల చేతిలో హతమైన షోయబుల్లా ఖాన్ ఎవరు? విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి దాష్టీకానికి బలైన షేక్ బందగీ, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ముక్దుం మొయినుద్దీన్ ఎవరు?.. వీరు ముస్లింలు కాదా?..
సెప్టెంబర్ 17ను ఎందుకు మతంతో ముడిపెడుతున్నారు?.. జాతీయ జన జీవన స్రవంతి నుండి ముస్లింలను ఎందుకు దూరం చేస్తున్నారు?.. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో, హైదరాబాద్ విముక్తి పోరాటంతో ముస్లింలకు కూడా భాగస్వామ్యం ఉంది.. వారి పేరు చెప్పుకొని కొన్ని శక్తులు హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకించడం అర్థం లేదని పని..
భారత దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం రావడం ఎంత నిజమో, సెప్టెంబర్ 17, 1948న భారత దేశంలో హైదరాబాద్ విలీనం కావడమూ అంతే వాస్తవం.. సంకుచిత విధానాలు, రాజకీయాలు, వితండవాదాలు, కుహనా లౌకిక వాదాన్ని కట్టిపెట్టి సెప్టెంబర్ 17 ఉత్సవాలను అధికారికంగా ఘనంగా జరుపుకుందాం..