‘నల్లమహారాజు’ లెవరు?

 |  First Published Dec 2, 2016, 2:42 AM IST


1

"నల్ల మహారాజు లెవరూ క్యూల్లో కనిపించడంలేదే?" గత కొద్దిరోజులుగా అందరి నోర్లలో నానుతున్న చర్చ.నిజమే!పాత సినిమాలు,కార్టూన్లలో రౌడీపాత్ర అనగానే గళ్ల లుంగి,బనీను,బుగ్గన కాటు,పులిపిరితో ఉన్నట్టు నల్లధనం ఉన్నవాళ్లను గుర్తించే కొండ గుర్తులేమైనా ఉంటాయా? 

Latest Videos

undefined

 

మన చుట్టూ,మనతో సహా అందరం ప్రభుత్వ టాక్స్ విధానాలకు తూట్లు పొడిచి సంపాదించిన వారమే.
నల్ల మహారాజు?

 

బంగారం,వజ్రాలు,కాంట్రాక్టులు వగైరాలంతా ముందుగా గురుతొస్తారు.మొన్నటి పేపర్లలో వచ్చిన ఒక వార్త సారాంశం ఇది. తమిళనాడు లో ఒక కిరాణాకొట్టు యజమాని కిలో బంగారం కొన్నాడని ఆదాయపన్ను శాఖ వారికి ఉప్పందింది.ఇంట్లో సోదాలు చేస్తే 17 కోట్ల నోట్లకట్టలు బయటపడ్డాయి,ఆ ఊర్లో అతనికున్న 70 ఇల్ల సంగతీ తెలిసింది.ఈ సంఘటనతో తెలిసేది నల్ల కుబేరులంటే సూటు బూటు వేసుకుని కార్లలో తిరిగేవారే కాదు మనలా మన చుట్టుపక్కల ఉంటూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టేవాళ్లే.

 

మన దైనందిన జీవితంలో ఏ నాడన్నా మెడికల్ షాప్ వాళ్లు మనకు పక్కా రసీదులు ఇచ్చారా?అంతెందుకు అవి మన రాసిచ్చిన డాక్టర్లు వారి వైద్యశాలల్లో డాక్టర్ల మీద దాడి చేస్తే ఫలానా చట్టం ప్రకారం శిక్షార్హులంటూ రాసుకున్న బోర్డ్ కనిపిస్తుంది కానీ వారెన్నడన్నా వారు తీసుకున్న ఫీజుకు రసీదు ఇచ్చారా?వినియోగదారుల కోర్టులకు వీరి తప్పుడు వైద్యం వల్ల నష్టపోయినా పోకపోవడానికి కారణం ఆ రసీదు లేకపోవడం కాదంటారా?

 

ఇక చూడ్డానికి చిన్నవే అని అనిపించే కొన్ని సెంటర్లలోని చాట్,ఫాస్ట్ ఫుడ్ వారి ఆదాయం కొందరికి లక్షల్లో ఉంటుంది.వీరేనా మటన్ షాపుల్లో లక్షలాది ఆదాయం ఉన్నవాళ్లు ఉన్నారు.

 

ఇక కొన్ని ఊర్లలో బట్టలు అమ్మేవారున్నారు.వీళ్లు బాంబే,సూరత్ ల నుంచి కట్ పీసులు తెచ్చి ఇక్కడ తూకాల లెక్కన అమ్ముతారు.రోజుకు 50 లక్షల వ్యాపారం చేసేవారున్నారు.కనీసం 10% లాభమనుకున్నా రోజుకు 5 లక్షల నికరాదాయముండీ పన్ను కట్టని వారెందరో.ఇక చిన్న నగరాల్లో ఇల్లలో చీరల వ్యాపారం చేస్తూ నెలకు లక్షలు సంపాదిస్తున్నవారుంటే పెద్ద నగరాల్లో డిజైనర్ స్టుడియో లంటూ ఒక్కో చీరనే లక్షలకమ్మేవారున్నారు.వీళ్లలో ఎవరూ పన్ను కట్టరు.


అంతెందుకు,మనం వెటకారంగా చెత్తోడు,పాత ఇనుప సామానోడు అని చీదరించుకుంటూ దాటిపోయే పాత సామాల వ్యాపారుల ఆదాయం కొన్ని కోట్లలో ఉంటుంది.


ఇక గ్రామాల నుంచి పట్టణాల దాకా 50 వేల నుంచి 50 లక్షల చిట్స్ నడిపేవారు కోకొల్లలు.ఎక్కడా సరైన రసీదివ్వరు. ఒక 2 రూపాయల పాకెట్ బుక్ లో నెలనెల మనం కట్టింది రాసిస్తారు.ఒక చిట్ పూర్తయ్యేసరికి వీరు ఆ కమీషన్ గా ఆ చిట్ మొత్తం డబ్బును సంపాదిస్తారు.మరి వీరంతా పన్ను కడుతున్నారా?


మన అదృష్టం బాగుండి వీరు నడిపితే సరే,లేదని అందరినీ ముంచి మాయమైతే ఫిర్యాదు చేసే దిక్కు కూడా ఉండదు.ఇక ఈ చిట్స్ డబ్బు మరింత పోగేసుకుని ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని స్థలం కోసం చూస్తే మన బజట్ లో అది ఊరికి 10 కి.మీ పరిధిలో ఎక్కడా కనబడదు.కారణం ప్రభుత్వానికి పన్నెగ్గొట్టి సంపాదించిన ప్రబుద్ధుల చేతిలోకి ఆ స్థలాలెప్పుడో పోయాయి.

 

సరే ఇలాంటోళ్ల దగ్గర పైసాకు పైసా పొదుపుచేసి కాస్త బంగారం కొందామనుకున్నారే అనుకో.ఒక్కరైనా సరైన రసీదు ఇస్తున్నారా?సరిగా బెత్తెడు కాగితం మీద చీమంత అక్షరాలతో బరువు,కూలి,తరుగు అని రాసి మొహాన కొడతాడు.రేపే అవసరానికో అమ్మబోతేనో,చెడగొడితేనో అప్పుడు బండారం బయటపడి ఘొల్లుమనాల్సిందే.ఒక వస్తువు మీద మనతోనే పన్ను రాబడుతూ రసీదివ్వడానికి ఏడుపు,ప్రభుత్వానికీ నామాలు.


బంగారం వ్యాపారులే కాదు నిత్యావసరాలైన ధాన్యం,కూరగాయల వ్యాపారులనే చూస్తే కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి.నమ్మకం మీద వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను అమ్మితే వారికి ఇచ్చే వ్యాపారులు ఇస్తారు,ముంచేవారు ముంచుతారు.రైతులు లాభపడకున్నా దళారులు మాత్రం కోటీశ్వరులు.ఇక పళ్లు,కూరగాయల రైతుల దీన పరిస్థితి వర్ణనాతీతం.టమోట,ఉల్లి,పండ్లను ఒక్కోసారి మార్కెట్ ధరల్లేక పొలాల్లో వదిలేస్తుంటారు,రోడ్లపక్కన పడేస్తారు,ధాన్యం లా రేట్ వచ్చినప్పుడు అమ్మొచ్చనే ఆశా ఉండదు.అంతా దళారుల చేత్వాటం,దయాదాక్షిణ్యాలే.లెక్కాపత్రం లేకుండా నోటిమాట,చిత్తుకాగితం మీద జరిగే ఈ వ్యాపారాల్లో దళారులు కట్టే పన్ను సున్నా.

 

2

 

మరోవైపు ప్రభుత్వోద్యోగులు.ప్రతీశాఖలో వ్యవస్థీకృత అవినీతి.

 

ఈవన్నీ కాదుగానీ నిన్నామొన్నా రాజధానికి కూతవేటు దూరంలో బయటపడ్డ కల్తీకారం వ్యవహారమే చూడండి.కోట్లాది రూపాయల విషం విచ్చలవిడిగా మార్కెట్లో చలామణి అయ్యింది.దీనితో ప్రజల ప్రాణాలు హరీమనడమే కాక వైద్యానికీ ఖర్చు పెట్టాలి.మళ్లీ ఆ మందులూ కుటీరపరిశ్రమల్లో తయారైన దొంగ మందులే.ఈ మందులు రాసిన డాక్టర్లు ఆ కంపెనీలు స్పాన్సర్ చేస్తున్న విదేశీ యాత్రలు చేస్తుంటే రోగులు వైకుంఠ యాత్ర చేస్తున్నారు.

 


ఈ రకంగా ఎన్నో రంగాల్లో అవినీతి,నల్లధనం సయామీ కవలల్లా ఉండి జనాలను పీల్చిపిప్పి చేస్తున్నాయి.
ఏతావాతా చెప్పేదేమంటే ఈ దేశంలో ప్రభుత్వ ఖజానాకు ఏదో ఒక రూపేణా తూట్లుపొడిచి అక్రమమార్గంలో సంపాదించేవారు 90% ఉంటారనటంలో సందేహం లేదు.

 

3

 

ఇప్పుడు ప్రధాని చేపట్టిన చర్య వల్లా,కార్డ్ సిస్టం వల్లా ఉపయోగం ఉండబోతుందా?

 


నిజానికి ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లోనూ 100% లావాదేవీలు కార్డ్ సిస్టం ద్వారా జరగడంలేదు.మనకూ ఇక్కడ 2000 దాకా నగదు చెల్లింపులు చేసుకునే వెసలుబాటు ఇవ్వొచ్చు.ఇక సామాన్యులకు కష్టం కాదా?దేశంలో ఇందరు నిరక్షరాస్యులు ఉన్నారంటూ శోకిస్తున్న దయార్ధ్రహృదయుల్లారా మీరు కొంటున్న పాలు,పూలు,కూరగాయల వ్యాపారులకు మీదగ్గరున్న చిన్న నోట్లతో చెల్లించవచ్చు.

 

ఇక రైతుకూలీలు,అసంఘటిత రంగాల కార్మికుల గురించి అంటారా?గ్రామాల్లో ఉన్నంత మాత్రాన అమాయుకులెవరూ ఉండరు.గ్రామీణ మహిళలకు నేడు పొదుపులక్ష్మి,డ్వాక్రా మొదలైన సంస్థలద్వార బ్యాంకు లావాదేవీలు బాగా తెలుసు.కాకపోతే గ్రామీణరంగంలో బ్యాంకు సేవలు విస్తరించాలి.ప్రతిగ్రామంలో ఎటిఎం లు నెలకొల్పాలి.ఇక రైతుకూలీల చెల్లింపులూ భూస్వాములు వారానికోసారి చెక్కుల రూపంలో చెల్లించొచ్చు.ఈ చెక్కులు మార్చుకోవడం లో బ్యంకుల దగ్గరున్న వారి ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్లు ఎంత సంపాదిస్తున్నారు,నిజానికి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారా లేదా?వీరంతా ప్రభుత్వమిచ్చే సబ్సిడీలకు అర్హులా కారా తెలుసుకోవచ్చు.

 

చాలామంది ప్రశ్న,ఈ కార్డ్ వినియోగం నిరక్షరాస్యులకు అర్ధమవుతుందా అని?నిజానికి ఓ 30ఏళ్ల క్రితం చదువుకున్న మధ్యతరగతి వారే సిలిండర్లు పేలుతాయనుకునేవారు.ఇప్పుడు గ్రామాల్లో వాడటం లేదా?అవసరం అన్నీ నేర్పిస్తుంది.ఆధార్ కార్డ్ విద్యా,వైద్యం లాంటి ఎన్నింటికీ అవసరం అని తీసుకున్న జనం బ్యాంక్ కార్డులెందుకు తీసుకోరు?ఇవాళ మీరే గ్రామానికి పోయినా సెల్ లేని సామాన్యులు కనిపించరు,తిరునాళ్లలో వింతవస్తువులమ్మే సంచార తెగలవారూ వాడుతున్నారు.

 

ఇదే కాదు,ఇవ్వాళ చీమకుర్తిలో 45,000 మంది కార్మికులు ఖాళీగా ఉన్నారని వార్తలొచ్చాయి.అసలు గ్రానైట్ బ్లాక్ కు రాయల్టీ చెల్లిస్తూ అంతిమంగా వచ్చే ఉత్పత్తికి పన్నును కొనుగోలుదారు దగ్గర వసూలు చేస్తున్నప్పుడు పరిశ్రమలు మూయాల్సిన అగత్యం ఎందుకొచ్చిందో?

 


ఈ పరిశ్రమల్లోని కార్మికులకైనా,భవన నిర్మాణ కార్మికులకైనా కార్డ్ ద్వారా చెల్లింపులున్నప్పుడు యజమానులు నిజంగా కార్మిక చట్టాల కనీస వేతనాలు చచ్చినట్టు చెల్లించాల్సివస్తుంది,ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు వారు భీమా సదుపాయాన్నీ పొందవచ్చు.

 


ఇవేకాదు లక్షల ఫీజులు వసూలు చేసి ముష్టిజీతాలిచ్చే పాఠశాలల్లోనూ పద్దతిగా వేతనాలు చెల్లిస్తారు.యజమానుల దయాదాక్షిణ్యాల మీద అభద్రతతో ఉద్యోగాలు చేసే పరిస్థితుండదు.సరైన వేతనం పిఎఫ్, ఇఎస్ఐ ల చెల్లింపు పోగా మిగిలింది అందుతుంది,ఆ పిఎఫ్, ఇఎస్ఐ  లను అవసరంలో ఉపయోగించుకుంటారు.

 


కాబట్టి అయ్యో సామాన్యులేమవుతారు అనే నంగనాచి కబుర్లు కట్టిపెట్టి మీ నష్టం గురించి బాధపడండి.కష్టాల్లో ఉన్న చుట్టుపక్కలున్న సామాన్యులనెన్నడన్నా పట్టించుకున్నామా? వారిని ఆదుకునే సంఘసంస్కర్తలు కారు 


.
"టర్కీలాంటి దేశంలో ముస్తఫా కెమల్ పాషా ఎన్నో సంస్కరణలు తెచ్చాడు,కొత్త లిపి కనిపెట్టి అక్షరాస్యత శాతం పెంచాడు,ఖలీఫా పద్దతిని కాదుపొమ్మన్నాడు,మదరసాలు మూయించి ఆధునికతవైపు తీసుకుపోయాడు,మనకూ ఉన్నారెందుకు?"అంటూ అవినీతి నాయకులను ఆడిపోసుకునేబదులు ఒక కొత్త మార్పును స్వాగతిద్దాం.

 

 

సరైన హోంవర్క్ చెయ్యకుండా మోడీ తొందరపడ్డాడని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు.గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సదుపాయాలు లేకుండా,పెద్దనోట్ల ముద్రణ జరక్కుండా ఆత్రం గాడు గోత్రమెరుగడన్నట్టు హడావుడి నిర్ణయాలతో ఈ సామాన్యులకు ఈ దుస్థితి దాపురించింది.

 


నల్లధనం వెలికి తీస్తారో లేదో కానీ పన్నుకట్టే వారి శాతం పెరిగినా ఎన్నో అద్భుతాలు సాధించొచ్చు.ఇక నాయకుల చిత్తశుద్దంటారా?అది కొలిచే పరికరాలు లేవు.ఇన్నేళ్లు ఇందరిని నమ్మాం కదా!లేదు 10 లక్షల సూట్ వాలా ఈ చాయ్ వాలా అంటారా?కానివ్వండి గాంధి నిరాడంబరత కు బిర్లాలు బాగా ఖర్చుపెట్టేవారనీ ఉంది.

 


జరిగే పరిణామాలను చూద్దాం....పండితుడిలా మాట్లాడుతూ అనవస విషయాలకు ఏడుస్తున్నావని ఒక పశువుల కాపరి చెప్పాడు...మీకోసం,మీ పిల్లల కోసం ఏడ్చండని ఒక గొర్రెల కాపరి చెప్పాడు.

 


మనం దేనికోసం శోకిస్తున్నామో తెలుసుకుని శోకిద్దాం.

click me!