.
.... ఆలయాలు - మసీదులూ అయిపోయాయి.. ఇక సినిమాల వంతు వచ్చింది.. అదీ "జాతీయ గీతాలాపన" అంశంలో.
.
ఘనతవహించిన మన సుప్రీం కోర్ట్ వారు ఈరోజు ఒక విచిత్రమైన తీర్పు చెప్పారు.. అదేమంటే, ""దేశంలో ఉన్న సినిమా హాళ్లన్నిటిలోనూ సినిమా ప్రదర్శనకు ముందు జనగణమన "జాతీయ గీతాన్ని" వినిపించాలనీ - అలా గీతాలాపన జరుగుతున్నంతసేపూ తెరమీద మువ్వన్నెల జాతీయ జెండా కనిపించాలనీ - ప్రేక్షకులందరూ నిశ్శబ్దంగా నిలబడి జాతీయగీతం పట్లా, జాతీయ పతాకం పట్లా గౌరవాన్ని ప్రదర్శించాలనీ ఆదేశించింది"".
undefined
ఒకవేళ ఎవరైనా నిలబడని పక్షంలో అది జాతీయగీతాన్ని అవమానించనట్లే భావించి, వారిపై చర్యలు తీసుకోవాలనీ" భలే గొప్ప తీర్పునిచ్చింది.
ఇలా చేయడం వల్ల ప్రజల్లో "దేశభక్తి - జాతీయభావన" అన్నవి అలవడతాయని కోర్టువారు తేల్చేశారు. అంతేకాదు, ఈ దేశంలో ప్రజలు మన జాతీయగీతం పట్ల గౌరవం ప్రదర్శించడం - దేశభక్తిని కలిగి ఉండడం పట్ల నిబద్ధులై ఉండాల్సిన సమయం ఆసన్నమయ్యింది అని కూడా నొక్కి వక్కాణించారు. సినిమా హాళ్లలో జాతీయగీతం వినిపిస్తున్నంతసేపూ ఆ హాళ్ళ యొక్క తలుపులన్నీ మూసివేయాలట.
ఎందుకంటే జాతీయగీతాలాపన జరుగుతున్నప్పుడు అందరూ కదలక మెదలక ఉండాలి. అలా లేని పక్షంలో దాన్ని జాతీయ గీతానికి జరిగిన అవమానంగా భావిస్తారు. ఈ ఆదేశాలను మరో పది రోజుల్లోగా అమలుపరచాలని ఆదేశించారు.
ఇంతకీ, ఈ విచిత్రమైన ఆదేశాలు ఎందుకిచ్చారో తెలుసా ?? భోపాల్ లో ఏదో ఒక ఎన్‌జిఓ ను నడుపుకొంటున్న ఎవరో "శ్యామ్ నారాయణ్" అనే ఒక వ్యక్తి "టివి షో లలోనూ, సినిమాలలోనూ జాతీయ గీతాన్ని ఇష్టానుసారం వాడుకొంటున్నారు దీన్ని నివారించాలి" అంటూ పిటిషన్ వేస్తే, దానికి మన ఘనతవహించిన సర్వోన్నత న్యాయస్థానం వాళ్ళు ఇచ్చిన తీర్పు ఇది.
అసలు పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలకూ - కోర్టువారు ఇచ్చిన తీర్పుకూ ఏమైనా సంబంధం ఉందా ?? బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టడం అంటే ఇదే మరి. ఏమన్నా అంటే "కోర్టు ధిక్కారం" అంటూ కిరికిరి పెడతారు కానీ, అసలు ఇలాంటి అసంబద్ధమైన తీర్పుల వల్ల సమాజంలో "దేశభక్తినీ - జాతీయ భావననూ" తేగలిగితే, ఇక కోర్టు ఆదేశాలతోనే దేశాన్ని బాగుచేసేయొచ్చుగా..! సమాజాన్ని కోర్టు తీర్పులతోనే మార్చివేసి గొప్ప సంస్కారవంతమైన దేశాన్ని తయారుచేసుకోవచ్చుగా.
వాస్తవంగా అయితే, 1960ల తరువాత కూడా సినిమా హాళ్లలో ఈ జాతీయగీతం వినిపించడం జరిగేది. అయితే, ప్రజలు మధ్యలోనే వెళ్ళిపోవడం అన్నది ఆపగలిగేదిగా లేకపోవడం, కాలానుగుణంగా జరిగిన మార్పులతో అదికాస్తా కనుమరుగయ్యింది. ఇప్పటికీ ఇలా జాతీయగీతాన్ని వినిపిస్తున్న సినిమా హాళ్ళు కూడా అక్కడక్కడా ఉన్నాయి. 2003 లో అనుకొంటా, మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని తపనిసరి చేసింది.
.
>> దీనిపై చిన్న విశ్లేషణ చేసుకొంటే, ఆమధ్య "జేఎన్‌యూ - హెచ్‌సియూ" ల్లో కన్నయ్య - రోహిత్ వేముల అంశాలపై వివాదం రేగిన నేపథ్యంలో, అప్పటి కేంద్ర మానవ వనరుల మంత్రిగా ఉన్న "శ్రీమతి స్మృతి ఇరానీ" గారు, ఉన్నపళంగా ఒక నిబంధన పెట్టారు. ""దేశంలో ఉన్న ప్రతి కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆకాశమంత ఎత్తున్న జాతీయ జెండాను ఎగురవేయాలని ఆదేశించారు"" - అదేమయ్యిందో ఆవిడకే తెలియాలి. అలా ఆదేశించి, జెండాలు ఏర్పాటు చేసినంత మాత్రాన జాతీయ భావనా - దేశభక్తీ పుట్టుకొస్తాయా ?
ఇకపోతే, అసలు ఈ "నిర్బంధ జాతీయ గీతాలాపన" తప్పనిసరి చేయాల్సి వస్తే, అందరికంటే ముందు ఈ దేశంలోని అన్నీ ""కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో"" పెట్టాలి. అన్నీ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో పెట్టాలి. సినిమా హాళ్లలోనే ఎందుకు ? ఆమధ్య బిజేపి వాళ్ళు ""భారత్ లో ఉండాలంటే భారత్ మాతాకీ జై అనాల్సిందే"" అంటూ నానా హడావిడి చేసినట్లుగానే ఉంది నేటి ఈ తీర్పు. అసలు ఈ నిర్ణయం ఒక అసంబద్ధమైనది. కోర్టులకున్న విలువను కూడా లేకుండా చేసే ఆదేశం ఇది.
ఇప్పటికే, "కృష్ణాష్టమి" సందర్భంగా జరిపే "ఉట్టి కొట్టడం" అనే కార్యక్రమంపైనా - తమిళనాడులో జరిగే "జెల్లికట్టు" పైనా కోర్టువారు విధించిన నిబంధనలను బహిరంగంగానే విమర్శించారు. కోర్టులను ఛాలెంజ్ చేసి మరీ ఆ ఆదేశాలను దేశవ్యాప్తంగా ధిక్కరించినా సరే ఈ కోర్టులు ఏమీ చేయలేని పరిస్తితి దాపురించింది. ఎందుకంటే, కోర్టులు ఎక్కడ తలదూర్చాలో అక్కడ దూరిస్తే వాళ్ళకే మంచిది. అలాగే, మతపరమైన అంశాల్లోకూడా ఈమధ్యన ఈ కోర్టులు ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది కూడా మంచిది కాదు.
.
.... ఒక్కటి మాత్రం నిజం ""అధికారంతోనూ - నిర్బంధంతోనూ దేశభక్తినీ - క్రమశిక్షణనూ పెంపొందించలేము"" అన్న సత్యాన్ని పాలకులూ - కోర్టువారూ తెలుసుకొంటే అందరికీ మంచిది.
జై హింద్.