పార్టీ మారడానికైనా, కూటమి మారడానికైనా అభివృద్ధే ముసుగు!

First Published Jul 27, 2017, 2:29 PM IST
Highlights

 

నియోజకవర్గాల అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి ఫిరాయించామని ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసనసభ్యులు, లోక్ సభ సభ్యులు వంచనకు పాల్పడినట్లే బీహార్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ.కూటమిలోకి 'జంప్' అయ్యానని నితీష్ కుమార్ సహితం పల్లవి పాడుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని పదిలంగా అట్టి పెట్టుకున్నారు. 

కాంగ్రెస్, ఆర్.జె.డి. పార్టీలు భారీ అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతు కూరుక పోయినవని తెలిసే నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు) 2015లో జరిగిన‌ బీహార్ శాసనసభ ఎన్నికల్లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది. తాజాగా లాలూ ప్రసాద్ కుమారుడు, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఇతర‌ కుటుంబ సభ్యులు అవినీతి కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజమే! అవినీతి కేసుల్లో సిబిఐ, ఇడి దర్యాప్తులను ఎదుర్కొంటున్న లాలూ కుటుంబాన్ని రాజకీయంగా మోయడం నితీష్ కుమార్ కు దుర్లభమే. తన పార్టీ కంటే పెద్ద పార్టీ అయిన ఆర్.జె.డి. తో పొసగనప్పుడు అధికారంలో కొనసాగడం కూడా అసాధ్యమే. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం సముచితమే. 

కానీ, అధికార పీఠాన్ని కోల్పోకుండా ఉండడానికి బిజెపితో ముందస్తు పథకాన్ని రచించుకొని, దాని ప్రకారం రాజీనామా 'డ్రామా' ఆడడమే జుగుప్సాకరంగా ఉన్నది. ఒక చేత్తో రాజీనామా కాగితాన్ని గవర్నరుకు ఇచ్చినట్లే ఇచ్చి, మరొక చేత్తో బిజెపి మద్ధతు లేఖ సమర్పించి, కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ‍ం చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. బీహార్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడానికి మోడీ సర్వశక్తులు ఒడ్డి, కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేశారు. లక్షా అరవై వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించి, బీహార్ ప్రజలను తమ వైపుకు తిప్పుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ప్రజల చేత తిరస్కరించబడిన పార్టీతో జట్టు కట్టి అధికార పీఠాన్ని నితీష్ కుమార్ నిలబెట్టుకోవడం ఏ నైతిక విలువలకు అద్దం పడుతుంది? నితీష్ కుమార్ నైతిక విలువలకు విలువనిచ్చే వారే అయితే తిరిగి ప్రజల తీర్పును కోరి ఉండే వారు. 

నేటి రాజకీయాల్లో ప్రజల తీర్పును గౌరవించే సంస్కారం కొరవడింది. నైతిక‌ విలువలకు విలువ లేదు. నిబద్ధతతో కూడిన విధానాలకు కట్టుబాటు లేదు. సిద్ధాంతాలు అంతకంటే లేవు. అధికారమే పరమావధి అన్న నీతే రాజ్యమేలు తున్నది.

అవినీతి వ్యతిరేక పోరాటంలో నితీష్ కుమార్ కలిసి వచ్చినందుకు కొనియాడుతున్నట్లు మోడీ ప్రకటించి అక్కున చేర్చుకొన్నారు. మరొక వైపున, అవినీతి కేసుల్లోను, ఆరోపణలతోను సిబిఐ మరియు ఈడి విచారణలను ఎదుర్కొంటున్న ప్రాంతీయ పార్టీల అధినేతలను తన కనుసైగలతో మద్ధతుదారులుగా మార్చుకొనే కళానైపుణ్యాన్ని కూడా మోడీ ప్రదర్శిస్తున్నట్లు కనబడుతున్నది. 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొత్త మిత్రుల కోసం పథకం ప్రకారం మోడీ పావులు కదుపుతున్నారనడానికి బీహార్ పరిణామాలే ప్రబల నిదర్శనం. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్ధతును కూడగట్టుకొనే పనిలో భాగంగానే కొత్త మిత్రుల వేట కూడా మొదలు పెట్టినట్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బీహార్ రాజకీయ పరిణామాలు ఈ విషయాన్నే రేఖా మాత్రంగా సూచిస్తున్నాయి. 

 

(*టి లక్ష్మీనారాయణ‌ తెలుగ నాట బాగా పేరున్న రాజకీయ విశ్లేషకుడు)

click me!