భారత రాజకీయాల్లో సిద్దాంతాలకు ఎపుడో కాలం చెల్లిపోయింది. తెల్లారి
లేస్తే కాంగ్రెస్ మీద విరుచుకుపడే ఆర్.ఎస్.ఎస్. బీజేపీ తాజా బీహార్
ఉదంతంతో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే అందరూ చూస్తుండగా భ్రష్టుపట్టించినట్లు
అయింది.
యూపీయే-2 హయాంలో జరిగిన అవినీతి మాటలకు అందనిది. ఎవరైనా, ఎంతైనా
తిట్టొచ్చు కాంగ్రెస్ పార్టీని. తప్పులేదు.
అయితే, ఎన్డీయే నాలుగేళ్లలో మోడీ-అమిత్ షా ల నేతృత్వంలో నైతిక పతనం
మాటలకందనిది. అన్ని విలువలనూ, విశ్వాసాలనూ, వ్యవస్థలనూ
భ్రష్టుపట్టించారు. నేడు, కాంగ్రెస్ పార్టీ కానీ, మరే ఇతర పార్టీని కానీ
అవినీతి విషయంలో విమర్శించే స్థాయి ఎన్డీయేకు ఎలా వస్తుంది?
కాంగ్రెస్ పార్టీపై అవినీతితో పాటు ఎపుడూ ఒక విమర్శ ఉండేది. రాజకీయ కక్షల
కోసం సీబీఐ ని వాడుకుంటుంది అని. ఎన్డీయే రెండాకులు ఎక్కువ చదివింది.
మోడీ అమిత్ ద్వయం సీబీఐ తో పాటు ఈడీనీ, కోర్టులను కూడా వాడుకుంటూ కొత్త
దురన్యాయాలకు తెరతీసింది. శశికళ విషయంలో కావచ్చు, అద్వానీ విషయంలో
కావచ్చు... కోర్టులు ఓవర్ టైం పనిచేశాయి!
అవినీతి అంటే అక్రమార్జన మాత్రమే కాదు. నీతి లేకపోవడం కూడా. ఆ దృష్ట్యా
చూస్తే - ఇపుడే కాదు భవిష్యత్తులో కూడా ఎన్డీయేను దాటిపోయే వారు ఉండరు.
ఇదేనా అఖండభారతం ఆరెస్సెస్ వాదులారా? ఇదేనా జ్ఞానం శీలం ఏకతా సారాంశం?
ఇదేనా ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్?
అవినీతి గురించి చర్చించే హక్కు వారికి లేదు కాబట్టి... మనం కూడా దానిని
నల్లిఫై చేసి అభివృద్ధి సంక్షేమాల విషయానికి వద్దాం.
యూపీయే పాలనలో ఈ దేశ ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసే, జీవన ప్రమాణాలు
పెంచే ఎన్నో చట్టాలకు రూపకల్పన చేసారు. వాటి ఫలితాలు ప్రజలకు అతి గొప్పగా
అందుతూ ఉండబట్టే వాటిని నేటి ఎన్డీయే కొంచెం కూడా కదపలేక పోతున్నది.
ఉదాహరణకు సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, విద్యా హక్కు చట్టం,
ఆహార భద్రతా చట్టం, భూసేకరణ చట్టం, లాంటివి. నిజానికి నేడు ఎన్డీయే ఈ
మాత్రం నిలబడటానికి గత ప్రభుత్వంపు ఆర్ధిక, పారిశ్రామిక పునాదులే కారణం.
ఇప్పటివరకు మూడు సంవత్సరాలలో ఎన్డీయే ప్రభుత్వం గుర్తుంచుకోదగ్గ ఒక్కటంటే
ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేసిందా? అవినీతి అంటే డబ్బు తినటమే
కాదు, అలాంటి వ్యక్తులను రాజకీయ ప్రయోజనాలకు దగ్గరకు చేర్చుకోవటమే పెద్ద
అవినీతి.
ఇలా అందరూ అవినీతిపరులే కాబట్టి, రాబోయే రోజుల్లో అవినీతి చర్చనీయాంశం
కాదు ప్రజలకు. ఇదొక శుభపరిణామం.
ప్రజాలారా - అభివృద్ధి, సంక్షేమం మాత్రమే రేపు మిమ్మల్ని పోలింగ్ బూత్
లకు తరలించే అంశాలు కావాలి. భావోద్వేగాలు కాదు.
శుభం!
(*శ్రీశైల్ రెడ్డి వేములఘాట్,కో కన్వీనర్, ప్రజా తెలంగాణ)