మనం తినే విధానమే తప్పు! డాక్టర్‌లూ అనుసరిస్తున్న కొత్తపద్ధతి ఇదే!

 |  First Published Jan 20, 2018, 12:09 PM IST

పొద్దున్నే లేస్తే మనం తినే ఇడ్లీ, దోశ, పూరి, బ్రెడ్ లతో మొదలుపెట్టి భోజనంలో తినే అన్నం, చపాతి, ఇక సాయంత్రంపూట స్నాక్స్ గా తినే సమోసాలు, బజ్జీలు, బర్గర్, పిజ్జాలవరకు అన్నింటిలో ఎక్కువగా ఉండే ఏకైక పదార్థం ఏమిటో తెలుసా? కార్బోహాడ్రేట్స్(పిండిపదార్థాలు). ఇది మనం తీసుకునే ఆహారంలో 70 నుంచి 80 శాతం ఉంటోంది. ఇదే మన కొంప ముంచుతోందని, షుగర్, బీపీ, ఒబేసిటీ, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులకు కారణమవుతోందని తాజా అధ్యయనాలలో తేలింది. దీనితోపాటు - సంప్రదాయ వంటనూనెలు, నెయ్యి, వెన్న వంటి ఫ్యాట్స్(కొవ్వు పదార్థాలు)తో కొలెస్టరాల్ పెరుగుతుందని ఇంతవరకూ నమ్ముతూ వస్తున్న సిద్ధాంతం కూడా పూర్తిగా తప్పని తెలియవచ్చింది.

Latest Videos

undefined

ఫ్యాట్స్ తినటం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుందన్నది అపోహమాత్రమేనని, వాటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని అంటున్నారు. ఈ తాజా అధ్యయనాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఒక కొత్త ప్రత్యామ్నాయ ఆహార విధానం(డైట్ ఛేంజ్ ప్రోగ్రామ్) ఇప్పుడు ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలలో హల్ చల్ చేస్తోంది. దీనిని ఆచరించటంవలనసాధారణ వ్యక్తులకు ఆరోగ్యం ఎన్నోరెట్లు మెరుగవుతుండగా, షుగర్, బీపీ, ఒబేసిటీ, మోకాళ్ళ నొప్పులు,పీసీఓడీ వంటి దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులతో బాధపడేవారికి వాటినుంచి విముక్తి కలుగుతోంది. అవును… మీరు చదివింది కరెక్టే. ఇది అక్షరాలా నిజం. 3 నెలలపాటు ఒక నిర్ణీత పద్ధతిలో ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించి, కొవ్వుపదార్థాలను పెంచటమే ఈ కొత్త ప్రోగ్రామ్ లో అనుసరించే మూలసూత్రం. కొందరు వైద్యులు కూడా ఈ ప్రోగ్రామ్ ను ఆచరించి సత్ఫలితాలు పొందామని బహిరంగంగా చెబుతున్నారు. మీడియా కన్ను సరిగా పడకపోవటంతో పెద్దగా బయటకురాని ఈ ప్రోగ్రామ్ ఇప్పుడిప్పుడే మెల్లగా ఊపందుకుంటోంది. ఏపీలోని ఇతర ప్రాంతాలకు, తెలంగాణకు కూడా ​విస్తరిస్తోన్న ఈ కొత్త ఆహారవిధానంపై ప్రత్యేక కథనం​.

సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్(మాంసకృత్తులు), ఫ్యాట్స్ ఉంటాయి. బియ్యం, గోధుమలు వంటి ఆహారధాన్యాలలో, మినుములు, కందులు వంటి పప్పుదినుసులు, వీటన్నింటితో చేసే వంటకాలలో, పళ్ళలో, పంచదారలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.

చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు వంటి మాంసాహారాలలో, కూరగాయలు, ఆకుకూరల్లో, డ్రై ఫ్రూట్స్, పనీర్, పెరుగులో ప్రొటీన్ ఉంటుంది. వంటనూనెలు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలలో ఫ్యాట్స్ ఉంటాయి. భూమిపై మానవజీవితం ఆవిర్భవించిననాటినుంచి మొదటి 25 లక్షల సంవత్సరాలపాటు మనిషి కార్బోహైడ్రేట్స్ తినలేదు… హంటర్ గేదరర్(వేటతోనే జీవనం)గా ఉన్నాడు… మాంసకృత్తులు(యానిమల్ ఫ్యాట్) అధికంగా తిన్నాడు. నిత్యం సంచరిస్తుండటం, శారీరక శ్రమఉండటంతో నాడు మనుషులకు ఒబేసిటీ వంటి జీవనశైలి వ్యాధులు లేవు. అయితే  గత పదివేల సంవత్సరాలనుంచి ఆ పరిస్థితి మారిపోయింది. నాగరికత పెరగటంతో మనిషి ఆహారధాన్యాలు పండించటం నేర్చుకున్నాడు. అప్పటినుంచి మనిషి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ పెరిగాయి. మరోవైపు 1857లో వచ్చిన పారిశ్రామిక విప్లవం తర్వాత ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. యంత్రాల రాకతో అనేక సౌకర్యాలు ఏర్పడ్డాయి… రోజువారీ జీవితంలో శారీరక శ్రమ తగ్గింది. ఇదిలా ఉంటే 70 ఏళ్ళనాడు ఆవిష్కారమైన ఏన్సల్ కీస్(Ancel keys) థియరీ జీవనశైలి వ్యాధులకు ముఖ్య కారణంగా మారింది.

 

కొవ్వు పదార్థాల వలన కొలెస్ట్రాల్ పెరుగుతుందని, శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని, తద్వారా గుండెజబ్బులు వస్తాయన్నది ఆ థియరీలోని వాదన. దీనితో నూనెను తక్కువగా వాడటం, నెయ్యిని తగ్గించటం ప్రారంభమైంది. ఆహారంలో రిఫైండ్ ఫుడ్స్(బాగా పాలిష్ చేసిన బియ్యం, గోధుమలు), రిఫైండ్ ఆయిల్స్, రిఫైండ్ షుగర్ వాడకం పెరిగింది. అయితే, 2007 నుంచి 2010 వరకు జరిగిన అనేక పరిశోధనల్లో కార్బోహైడ్రేట్స్ చేస్తున్న చెరుపు తెలియవచ్చింది. ఇవి ఆహారంలో పెరిగితే ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి దాని ప్రభావంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది… ముఖ్యంగా పొట్ట, పిరుదులు ప్రాంతంలో. ఇదే అనారోగ్యానికి కారణమవుతోంది.  ఈ తాజా పరిశోధనల సారాన్ని క్రోడీకరించి గ్యారీ టాబ్స్ అనే సైంటిఫిక్ జర్నలిస్ట్ 2010 సంవత్సరంలో 'వై వుయ్ గెట్ ఫ్యాట్’, 'బ్యాడ్ క్యాలరీస్ అండ్ గుడ్ క్యాలరీస్'అనే రెండు పుస్తకాలు రాశారు. ఈ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, సైంటిస్టులతోసహా అనేకమందిని ప్రభావితం చేస్తున్నాయి.

ఇక కొత్త ఆహారవిధానం విషయానికొస్తే - కార్బోహైడ్రేట్స్ తో నడుస్తున్న మన శరీర మెటబాలిజంను ఫ్యాట్స్ తో నడిచే మెటబాలిజంగా మార్చటమే దీనిలోని కీలకం. ఒక్కమాటలో చెప్పాలంటే పెట్రోలుతో నడిచే కారు ఇంజనును గ్యాస్ కు మార్చటం లాంటిది. శాస్త్రీయంగా చెప్పాలంటే దీనిని 'ఎల్ సీ హెచ్ ఎఫ్’(Low Carbohydrates High Fats) అని పిలుస్తున్నారు. మూడునెలలు ఈ ఆహారవిధానాన్ని అనుసరిస్తే బరువు తగ్గటంతోబాటు బీఎమ్ఐ(Body Mass Index) కూడా గణనీయంగా తగ్గుతోంది.ఈ విధానంద్వారా సాధారణ వ్యక్తులకు ఆరోగ్యం మెరుగవుతుండగా, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక, జీవనశైలి వ్యాధిగ్రస్తులకు ఆ వ్యాధులు నయమవుతున్నాయి. మనం ఇప్పటివరకూ ఆహారంలో తీసుకుంటున్న కార్బోహైడ్రేట్ పరిమాణాన్ని 70-80 శాతం నుంచి 5-10 శాతానికి తగ్గించి, 20 శాతం మాత్రమే తీసుకుంటున్న ఫ్యాట్స్ ను 65-70 శాతానికి పెంచుతారు(ఇలా పెంచే ఫ్యాట్స్ లో ఫుల్లీ శాట్చురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే కొబ్బరినూనె, నెయ్యివంటి వాటిని మాత్రమే వాడాల్సిఉంటుంది). స్వీడన్ దేశం అధికారికంగా ఈ 'ఎల్ సీ హెచ్ ఎఫ్'ఆహారవిధానాన్ని అనుసరిస్తోంది.వాస్తవానికి ఈ విధానానికి మూలపురుషులు ఎరిక్ వెస్ట్ మేన్(Eric Westman), జెఫ్ వోలెక్(Jeff Volek), స్టీఫెన్ ఫినే(Stephen Phinney), జేసన్ ఫంగ్(Jason Fung) అనే విదేశీ వైద్యులని చెప్పాలి. ఇప్పుడు ఏపీలో కూడా విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలలో అనేకమంది ఈ విధానాన్ని ఆచరించి ఫలితాలు పొందుతున్నారు. ఏపీలో ఈ విధానానికి ఆద్యుడుగా డాక్టర్ పి.వి.సత్యనారాయణరావును చెప్పుకోవాలి. విశాఖపట్నానికి చెందిన ఈ వైద్యుడు వాస్తవానికి కార్డియో థొరాసిక్ సర్జన్. 16,000 గుండె ఆపరేషన్లు చేసిఉన్నారు. అయితే తనకు వచ్చిన షుగర్ వ్యాధిని, అధికబరువును తగ్గించుకునేందుకుగానూ తనమీదే ప్రయోగాలు చేసుకుని అది విజయవంతం కావటంతో, ఆ అనుభవంతో ఈ డైట్ ఛేంజ్ ప్రోగ్రామ్ ను రూపొందించారు. రెండేళ్ళనుంచి ఈ ప్రోగ్రామ్ తో రోగులకు సేవలు అందిస్తున్నారు.  తన ప్రోగ్రామ్ ద్వారా మూడే మూడు నెలల్లో గణనీయమైన ఫలితాలు సాధిస్తున్నట్లు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గించినా, అసలు తీసుకోకపోయినా జరిగే నష్టమేమీ ఉండదని ఈయన ఏషియానెట్ తో మాట్లాడుతూ వివరించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా అనేకమంది రోగులలో షుగర్ ను నార్మల్ కు తీసుకొచ్చామని తెలిపారు. పి.వి.సత్యనారాయణరావు టీవీ9 ఛానల్ లో రెండుసార్లు తన ప్రోగ్రామ్ ను వివరించటం తప్పితే పెద్దగా బయట విస్తృతంగా ప్రచారం చేసుకోవటంలేదు. తాను పనిచేస్తున్న విశాఖపట్నం కేర్ ఆసుపత్రినుంచే ఈ సేవలను అందిస్తున్నారు.

ఇక ఈ కొత్త ఆహారవిధానాన్ని ప్రచారం చేస్తున్న రెండో వ్యక్తి విజయవాడవాసి, ప్రింటింగ్ వ్యాపారి అయిన రామకృష్ణారావు. ఈయన వైద్యరంగానికి సంబంధించినవారు కాదు. 126 కిలోలున్న తన అధిక బరువును తగ్గించుకోవటానికి ప్రయోగాలు చేసుకుంటూ సత్ఫలితాలు పొంది విజయవంతం కావటంతో ఈ విధానాన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. పోయిన సంవత్సరంనుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ నాగార్జున హాస్పిటల్(విజయవాడ) వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులలోనే శిబిరాలు పెట్టి ఈ ప్రోగ్రామ్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఆయా ఆసుపత్రులకు చెందిన ప్రధాన వైద్యులు కూడా ఈయన ప్రోగ్రామ్ ను బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ శిబిరాలకు వందల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. అయితే ఎవరివద్దా రామకృష్ణారావు ఒక్కపైసా కూడా తీసుకోకపోవటం ఒక విశేషం. డయాబెటిస్ విషయంలో ప్రపంచంలో ఎవరూ సాధించలేనిదానిని తమ ప్రోగ్రామ్ సాధిస్తోందని, దీనిద్వారా షుగర్ వ్యాధిని తగ్గించుకోవటం మంచినీళ్ళప్రాయమని ఢంకా బజాయించి రామకృష్ణారావు చెబుతున్నారు. తాను ఈ పద్ధతి ద్వారా తెలుగు రాష్ట్రాలనూ, తర్వాత యావత్ భారతదేశాన్ని మార్చేయబోతున్నానని అంటున్నారు. ప్రజలను ఆరోగ్యవంతులను చేయటంద్వారా లక్షలకోట్ల రూపాయలు ఆదా అవుతాయని చెబుతున్నారు.

 

ఈ ప్రోగ్రామ్ వ్యవధి మూడు నెలలు ఉంటుంది. దీనిని ప్రారంభించేముందు ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టేముందు ప్రధాన శరీర భాగాలన్నింటికీ ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ, గుండె వంటి భాగాలకు జబ్బులేమీ లేకపోతేనే దీనిని ప్రారంభించాల్సిఉందని స్పష్టంగా చెబుతున్నారు. ఇక పోతే ఈ ప్రోగ్రామ్ ను అనుసరించటానికి ఈ మూడు నెలలపాటూ ఇన్ పేషెంట్ గా ఆసుపత్రిలో చేరాల్సిన పని ఏమీ ఉండదు. మందులు కొనాల్సిన పనేమీలేదు. వారు చెప్పిన ఆహార పద్ధతిని ఎవరికి వారు తమ తమ ఇళ్ళలో తు.చ. తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. ఇదే అత్యంత ప్రధానమైన అంశం. ప్రోగ్రామ్ ను ఆచరించటం మొదలుపెట్టిన తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. నిరంతరం వైద్యులను సంప్రదిస్తూఉండాలి. ఈ ప్రోగ్రామ్ వివరాలు ఇలా ఉన్నాయి...

కొత్త ఆహార విధానంలోని ముఖ్యాంశాలు

1. ఈ మూడు నెలలూ అన్నం, చపాతీలు, బ్రెడ్, ఇడ్లీ, దోశ, పూరి వంటి కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలను పూర్తిగా దూరంపెట్టాల్సి ఉంటుంది.

2. కొబ్బరినూనె(తలకు రాసుకునేదికాదు-ఎడిబుల్), పామాయిల్(రిఫైండ్ కానిది), వెన్న, నెయ్యి, మీగడ వంటి కొవ్వుపదార్థాలను రోజుకు 70 నుంచి 100 గ్రాముల వరకు తీసుకోవాలి. వాల్ నట్స్, బాదం పప్పులవంటి నట్స్ ను తినాలి.

3. మాంసాహారులు చికెన్, మటన్, చేప, గుడ్లువంటివన్నీ తినొచ్చు… శాకాహారులు కూరగాయలు(కార్బోహైడ్రేట్స్ లేనివి), ఆకుకూరలను తీసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు యధావిధిగా వాడుకోవచ్చు. వండటానికి పైన చెప్పిన ఫ్యాట్స్(కొబ్బరినూనె మొదలైనవి)నే వాడాలి.

4. ఏ విధమైన పళ్ళూ తీసుకోగూడదు. పంచదారను ముట్టరాదు.

5. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ నిషిద్ధం. అయితే కాఫీ, టీలను పాలు, పంచదార లేకుండా తీసుకోవచ్చు... మీగడ, క్రీమ్ తో.

పీవీ సత్యనారాయణ, రామకృష్ణారావుల ప్రోగ్రామ్ లలో తేడాలున్నప్పటికీ, మౌలికంగా పై 5 అంశాలు రెండింటిలో కామన్ గా ఉంటాయి... ఇవి కాకుండా మరికొన్ని అంశాలు కూడా ఉంటాయి. అయితే ప్రోగ్రామ్ కాలవ్యవధి మూడు నెలలు ముగిసిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. ప్రోగ్రామ్ ముగిసిన కొంతకాలం తర్వాత పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందా అని సందేహం తలెత్తుతుంది. దీనిపై స్పందిస్తూ, ప్రోగ్రామ్ తర్వాత ఆహారంలో కార్బోహైడ్రేట్స్(అన్నం, చపాతి, ఇడ్లీ, దోశ వంటివి)ను పునఃప్రారంభించటంపై వైద్యుల సలహాలు తీసుకుని వారి సూచనల మేరకు నడవాలని సత్యనారాయణ చెబుతున్నారు. మరోవైపు మూడు నెలల తర్వాత యథేచ్ఛగా కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలను తినేయొచ్చని, ఏమీ కాదని, పూర్వపు పరిస్థితి వచ్చే సమస్యే లేదని రామకృష్ణ అంటున్నారు.

ఈ ప్రోగ్రామ్ ను ప్రచారం చేస్తున్న వీరిద్దరిదీ పూర్తి భిన్నమైన శైలి అని చెప్పాలి. పీవీ సత్యనారాయణ వైద్యుడు కావటంతో ఈ ప్రోగ్రామ్ లోని ప్రతి చిన్న అంశాన్నికూడా శాస్త్రీయంగా, వైద్య శాస్త్రపరంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు వివరించి చెబుతారు.  ఇటు రామకృష్ణారావుది మరో రకం. ఈ విధానంలోని అంశాలను, దీని వలన కలిగే ప్రయోజనాలను కొట్టొచ్చినట్లుగా, బలంగా నాటుకుపోయేటట్లు వివరిస్తారు. వినేవారికి బలమైన గురి ఏర్పడేటట్లు చెప్పటం ఈయన శైలి. వీరిద్దరూ ఈ ప్రోగ్రామ్ ను వాణిజ్యపరంగా కాకుండా, ఎక్కువమంది ప్రజలు ప్రయోజనం పొందాలనే ఉద్దేశ్యంతోనే ప్రచారం చేయటం విశేషం. అయితే ఈ ప్రోగ్రామ్ కు ఇంతవరకు మీడియాలో పెద్దగా ప్రాచుర్యం రాకపోవటంతో ప్రజలకు పెద్దగా తెలియటంలేదు. త్వరలోనే ఇది పెద్దస్థాయిలో పాపులర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏది ఏమైనా వీరిరువురూ సూచించిన ప్రోగ్రామ్ ద్వారా కొంతమంది సత్ఫలితాలను పొందారనిమాత్రం ఖరాఖండిగా తెలుస్తోంది. కొబ్బరినూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, డ్రై ఫ్రూట్స్ వంటి ఖరీదైన పదార్థాలను తీసుకోవాలి కాబట్టి ఖర్చు ఎక్కువని అనిపిస్తుందిగానీ, ముందునుంచీ వాడే మందుల ఖర్చు లేకపోవటం, గతంలో తినే ఆహారపదార్థాలు క్వాంటిటీపరంగా తగ్గటంవలన ఆదా అయ్యే డబ్బులు, మెరుగయ్యే ఆరోగ్యంతో పోల్చుకుంటే ఓవరాల్ గా ఈ విధానానికి ఖర్చు తక్కువనే చెప్పాలి. పైగా ఈ దీర్ఘకాలిక, జీవనశైలి వ్యాధులు తగ్గి ఆరోగ్యం మెరుగవటంవలన దేశానికి లక్షలకోట్ల జాతీయ ఆదాయం మిగిలిపోతుంది… ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దీనిని ఆచరించాలనుకునేవారు, ప్రోగ్రామ్ పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకోవాలనుకునేవారు వీరిరువురిలో ఎవరినైనా నేరుగా సంప్రదించి, ఆ తర్వాత తమ వ్యక్తిగత వైద్యుడు(ఫ్యామిలీ డాక్టర్)తో చర్చించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఒక వీడియో ఇంటర్వ్యూ  క్రింది లింక్లో చూడొచ్చు. వీరిని కింద ఇచ్చిన నంబర్లలో సంప్రదించవచ్చు.

డాక్టర్ పీవీ సత్యనారాయణ - 9949943437

ఆకాశవాణి ఇంటర్వ్యూ:  

 

వి.రామకృష్ణారావు ఇంటర్వ్యూ - https://www.youtube.com/watch?v=LF0QiC5ALHw&t=1777s

వి.రామకృష్ణారావు           - 9246472677

కొత్త ఆహారవిధానానికి సంబంధించినమరికొన్ని అంశాలు

1. కొబ్బరినూనె(తలకు రాసుకునేది కాదు, ఎడిబుల్) అద్భుతమైన ఆహారపదార్థం. తల్లిపాలలో 60 నుంచి 65 శాతం శాట్చురేటెడ్ ఫ్యాట్స్(గుడ్ కొలెస్టరాల్ ను పెంచుతాయి) ఉంటాయి. ఇవి దాదాపు అదే స్థాయిలో కొబ్బరినూనెలో ఉంటాయి.

2. కొబ్బరినూనె తర్వాత పామాయిల్(రిఫైండ్ కానిది) కూడా వంటకు మంచిది.

3. సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి రిఫైండ్ వంటనూనెలలో పాలీ అన్ శాట్చురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో చెడు కొలెస్టరాల్ పెరుగుతుంది. ఈ రిఫైండ్ ఆయిల్ వలన ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. రిఫైండ్ ఆయిల్ ను రెండోసారి మరగబెడితే అత్యంత ప్రమాదకరం.

4. కోడిగుడ్డులో పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని అది తీసి తినేవాళ్ళం. కానీ అది మంచి కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుందని, దానిని కూడా తినాలని సూచిస్తున్నారు.

5. ఉపవాసం వలన శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. అయితే అన్నం మానేసి టిఫిన్లుగానీ, పళ్ళుగానీ తినటం వలన ఉపయోగం లేదు. కేవలం మంచినీరు, నిమ్మరసం తాగి ఒకటి, రెండు రోజులు ఉపవాసం ఉంటే ఎంతే మంచిది.

6. ఒకప్పుడు అమెరికాలో మాత్రమే దొరికే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ను పెద్ద ఎత్తున తయారయ్యే ఫ్రూట్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ లలో వాడుతుంటారు. ఇప్పుడు ఆ హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఇండియాలో కూడా విరివిగా దొరుకుతోంది. స్వీట్ నెస్ కోసం బేకరీ ఉత్పత్తులలో, స్వీట్స్ తయారీలో కూడా ఇక్కడ వాడుతున్నారు. ఇది, దీనితోబాటు వాడే మైదాపిండికూడా విషంతో సమానమని చెబుతున్నారు.

7. మనిషి కనీసం రోజుకు పదివేల అడుగులు నడవాలి. ఇది నాలుగు కిలోమీటర్లకు సమానం.

 

8. రోజువారీ జీవితంలో మనిషికి వయస్సు, సైజును బట్టి 2,000 నుంచి 2,500 వరకు క్యాలరీలు ఉండే ఆహారం అవసరం ఉంటుంది. నాలుగువేల క్యాలరీలదాకా తీసుకుంటే స్థూలకాయం వస్తుంది.

9. అధికంగా తీసుకునే కార్బోహైడ్రేట్స్ వలన ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ యూరిక్ యాసిడ్ ను పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ను తగ్గిస్తుంది. దీనివలనే డిమెన్షియా, గుండెజబ్బులు, క్యాన్సర్ వస్తాయి.

10. మనిషికి రోజుకు 1 టీస్పూన్ పంచదార సరిపోతుంది. కానీ మనం సగటున 50 టీ స్పూన్ల పంచదారను వివిధ రూపాలలో ఆహారంలో, పానీయాలలో తీసుకుంటున్నాము… తద్వారా చెరుపును చేసే కార్బోహైడ్రేట్ల శాతాన్ని పెంచుకుంటున్నాము.

 

(*రచయిత సీనియర్ జర్నలిస్టు ఫోన్ నెం.9948293346)

click me!