తెలంగాణ నేతలకు, మీడియాకు షాక్ ఇచ్చాడు

First Published Jan 17, 2018, 7:06 PM IST
Highlights

ఈ యువకుడు తెలంగాణ నిరుద్యోగి. తెలంగాణ రాంగనే ఉద్యోగం వస్తదని.. బతుకు బంగారమైతుందని ఆశపడ్డాడు. కానీ సీన్ రివర్స్ అయింది. తెలంగాణ సర్కారు ఉద్యోగాల విషయంలో తీవ్రమైన జాప్యం చేస్తూ నిరుద్యోగులతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితుల్లో మీడియా తన బాధ్యతను మరచి ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ రాజకీయ నేతలకు, మీడియాకు బహిరంగ లేఖ రాసిండు. ఆ లేఖను యదాతదంగా కింద ప్రచురిస్తున్నాం. చదవండి. తెలంగాణ యువత ఆవేదన ఎలా ఉందో తెలుసుకోండి.

తెలంగాణ రాష్ట్రపు ప్రజాప్రతినిధులు మరియు  ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికీ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు చేసుకుంటున్న విన్నపం..

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు పత్రికలలో మాత్రం తెలంగాణ లో కొలువుల జాతర అని రావటం పరిపాటి అయింది .కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి విరుద్ధముగా వున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉద్యోగాల భర్తీ విషయం లో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్ లైన్  తో తెలంగాణ ఉద్యమం జరిగింది. 2014 నుంచి 2017 ఆఖరి వరకు అన్ని ప్రభుత్వ నియామక సంస్థల ద్వారా దాదాపు 28,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం ప్రకటిచింది. ప్రభుత్వ మేనిఫెస్టో ప్రకారం 1 లక్ష 7 వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి లక్ష కుటుంబాలు సెటిల్ అయ్యేలా చేస్తామని ప్రకటించింది. కానీ 2017 ఆఖరి వరకు  28 000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం బాధాకరం. మిగిలిన 15 నెలల కాలంలో మిగిలిన ఉద్యోగాలు ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుందో మేధావులకు సైతం అంతుబట్టడం లేదు. లక్షలాది నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా రాష్ట్రంలో అత్యున్నతమైనవి ఉద్యోగాలైనా గ్రూప్-1 పోస్టులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ ఇంతవరకు ప్రకటించ లేదు. ఆఖరిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ 2011 సంవత్సరం లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో ఇవ్వబడింది. దాదాపు 7 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వము ఇంతవరకు గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకటించలేదు.

2015 డిసెంబర్ 31 తారీఖున వెలువడిన గ్రూప్-2 ఉద్యోగాలు ఇంతవరకు భర్తీ కాలేదు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. కొత్తగా  గ్రూప్-3, గ్రూప్-4, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ మొదలగు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించ లేదు. సాధారణ డిగ్రీ కలిగిన నిరుద్యోగులు రాష్ట్రం లో లక్షల సంఖ్యలో వున్నారు. వారి కొరకై ప్రభుత్వము  ఇంతవరకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదలచేయలేదు. ప్రకటించిన ఒక్క గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ ఇంతవరకు నోచుకోలేదు. 2 సంవత్సరాలు కావొస్తున్నా గ్రూప్-2 ఉద్యోగాలు ఇంకా భర్తీ కాలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో  అప్పుడు వున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి పూనుకుంటే మన  ఉద్యోగాలు మన  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత భర్తీ చేసుకుందామని చెప్పి ఉద్యోగాలు భర్తీ చేయకుండా అడ్డుకున్న ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎంతోమంది నిరుద్యోగులు తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వస్తే తమ ఉద్యోగాలు తమకు దక్కుతాయని ఏంతో ఆశ పడ్డారు. కానీ వారి ఆశ లన్ని ఆడియాశలు అయ్యాయి.

ఇప్పటికేనా సమయం మించి పోలేదు.. ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగులు ఆశిస్తున్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసినట్లయితే తెలంగాణ రాష్రమ్ కొరకై బలిదానాలు చేసుకున్న నిరుద్యోగులకు సరైన నివాళి అవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఆశిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం లో వున్నా మీడియా వారికి మా విన్నపం ఏమంటే.. మా సమస్యను ప్రభుత్వం వారికీ తెలియచేయాలి. మీడియా వారు కూడా ఎవ్వరి వత్తిడికి తలోగ్గకుండా తెలంగాణ లో వున్న నిరుద్యోగ సమస్యను పత్రికల ద్వారా మరియు టీవీ ల ద్వారా ప్రభుత్వానికి తెలియచేయాలి. ఇప్పుడువున్నా తెలంగాణ ప్రభుత్వ ఆలోచన ఏమిటంటే 2019 ఎన్నికల ముందు భారీగా ఉద్యోగాల నోటిఫికెషన్స్ ప్రకటించి నిరుద్యోగులను ఓట్ల కొరకై ప్రలోభాలకు గురిచేయాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ తెలంగాణ యూత్ చాల తెలివైనవారు. తాజా రాజకీయాల మీద అవహగాహన వున్నవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగులను రాజకీయముగా ఎలా వాడుకున్నారో మన రాష్ట్రం వస్తే  మన కొలువులు మనకు దక్కుతాయి  అని ఎలా ప్రలోభపెట్టారో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు అనుభవించివున్నారు. జిత్తుల మారి ప్రయత్నాలను పసిగట్టలేనంత అమాయకులు కాదు. తస్మాత్ జాగ్రత్త.

 

ఇట్లు

 

జె మధుకర్.

(* రచయిత తెలంగాణ నిరుద్యోగి, గ్రూప్ 2 అభ్యర్థి, జాలుబావుల గ్రామం, దంతాలపల్లి మండలం, మహబూబాబాద్ జిల్లా.)

click me!