రాయలసీమ గుండెచప్పుడు మిత్తకంధాల( పోతిరెడ్డిపాడు) నేడు రెండు తెలుగు రాష్ట్రాల మద్య వివాదంగా మారి అంతే త్వరగా పరిష్కారం అయింది. రెండు తెలుగు రాష్ట్రాల మద్య నీటి పంపకాలలో వివాదం వచ్చినపుడల్లా పోతిరెడ్డిపాడును వాడుకుని చివరకు తమ అసలు కోరిక తీరిన వెంటనే అందరూ సర్దుకుంటారు. నిజానికి చుక్క నీరుకూడా వాడుకోని రాయలసీమ వాసుల మీద పుష్కలంగా నీరు వాడుకుంటున్న వారు కూడా విమర్శలు చేయడం సీమ ప్రజల దుస్దితి.
పోతిరెడ్డిపాడు పూర్వరంగం..... పోతిరెడ్డిపాడు రావడానికి పెద్ద చరిత్రే ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారిగా విడిపోవాలని నాడు సర్కారు జిల్లాల పెద్దల నుంచి ప్రతిపాదన వచ్చింది. అన్ని విదాల అబివృద్ది చెందిన సర్కారు ప్రాంతంతో కలవడానికి ఇష్టపడని సీమను ఒప్పించడానికి శ్రీబాగ్ ఒప్పందం అనే ఒప్పందం చేసుకున్నారు.ఈ ఒప్పందం మేరకు రాయలసీమకు రాజధానితో సహ నీటి కేటాయింపులో అధిక ప్రాదాన్యత ఇవ్వాలి.ఈ అవగాహనకు భిన్నంగా సిద్దేశ్వరం అనే ప్రాజక్టు నిర్మాణాన్ని తుంగలో తొక్కి నాగార్జున సాగర్ నిర్మాణం చేసుకున్నారు. సిద్దేశ్వరం నుంచి 86 కి మీ క్రింద నిర్మించి శ్రీశైలం రాయలసీమకు ఉపయోగపడకుండా చేశారు. దాదాపు ఆనాడే ఒక లక్ష మంది ప్రజలను, (కర్నూలు జిల్లాలో 100 గ్రామాలు కొంత మేరకు మహబూబ్ నగర్) ఖాళీ చేయించి నిర్మించినా శ్రీశైలంలో రాయలసీమకుగాని, నాటి మహబూబ్ నగర్ కు గాని ఒక చుక్క నీరు కూడా అధికారింగా కేటాయించలేదు. సర్కారు జిల్లా పెద్దల కుట్ర, సీమ నేతల పదవి వ్యామోహం రాయలసీమ పాలిట శాపంగా మారింది. తర్వాత కాలంలో రాయలసీమ ఉద్యమ పలితంగా సీమకు నీరు ఇవ్వకుండా ఉండలేని స్దితి వచ్చినపుడు నాటి అంజయ్య నాయకత్వంలోని కాంగ్రస్ ప్రభుత్వంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ ను ఉపయోగించుకుని యస్ ఆర్ బీ సీ కి నీరు ఇవ్వాలన్న ఆలోచనతో పోతిరెడ్డిపాడు నిర్మాణానికి పూనుకున్నారు.
undefined
పూర్వం ఎపుడో ఆంగ్లేయుల కాలంలోనే సిద్దేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మించాఅనే ఆలోచన వచ్చింది. దాని ద్వారా రాయలసీమకు రెండు కాలవల ద్వారా గ్రావిటీతో నీరు ఇవ్వాలన్నదినాటి ప్రతిపాదన. అన్ని అనుమతులు ఉన్నా నేటికి కూడా దాన్ని నిర్మించడానికి పాలకులకు మనసు రావడం లేదు. అదే జరిగి ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రజలు శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆదారపడి ఉండాల్సిన దుర్గతి ఉండేది కాదు. పోతిరెడ్డి పాడు నుంచి 1.5 లక్ష్యల క్యూషెక్కుల నీటిని డ్రా చేసుకునే జీ ఓ ను స్వర్గీయ రామారావు జారీ చేసినారు. 25 సంవత్సరాలు పూర్ది అయినా ఆ జీ ఓ అమలు కావడం లేదు. 2004 లో అధికారంలోకి వచ్చిన వై యస్ అప్పటి వరకు 12 వేల క్యూషెక్కుల ను తీసుకునే విధంగా ఉన్న జీ ఓ ను మార్చి 44 వేల క్యూషెక్కులుకు పెంచి అందుకు తగిన విధంగా గేట్ల వెడల్పు చేసినారు. కాని నాడు నేటి నీటిపారుదల మంత్రి దేవినేని నాయకత్వంలో పోతిరెడ్డిపాడు వెడల్పు ప్రక్రియను అడుగడుగనా అడ్డుకున్నారు. మిలటరీని పెట్టి వెడల్పు ప్రక్రియను చేయాల్సివచ్చింది. కీలకమైన విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు పని చేయాలంటే శ్రీశైలంలో 842 అడుగులలో నీరు ఉండాలి. కాని నిరంతరం అలా నీరు ఉండదు. రెండవది చంద్రబాబు కాలంలో క్రిష్ణా డెల్లా ప్రయోజనాల కోసం బాగా కృష్టి చేశారు. అప్పటివరకు 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఏకంగా 834 కి తగ్గించారు. ఇది రాయలసీమకు మరణశాసనం అయింది. బాబు నిర్ణయంతో రాయలసీమలోని తెలుగు గంగ, హంద్రీ నీవా, గాలేరు నగరి, యస్ ఆర్ బీ సీ లకు నీరు అందని దుస్థతి వచ్చింది. రామారావు గారు జారీ చేసిన జీ ఓ అమలు అయి ఉంటే వరద వచ్చినపుడు భారీగా నీటిని సీమ ప్రాజెక్టులకు తరలించి ఉండవచ్చు.
దాదాపు12 వేల క్యూషెక్కుల నీటిని తోడితే ఒక TMC తో సమానం. అదే 1.5 లక్షల క్యూషెక్యులు తోడితే దాదాపు 12 TMC ల నీరు అవుతుంది. శ్రీశైలంకు భారీగా వరదలు వచ్చినపుడు కనీసం వారం రోజులు నిబంధనలతో సంబంధ లేకుండా నీరు డ్రా చేసుకోవచ్చు 1.5 లక్షల క్యూషెక్కుల నీరు వారం రోజులు తోడితే కనీసం 80- 100 TMC లు నీరు సీమ ప్రాజెక్టులకు అందుతుంది అసాధారణ రోజులలోనైనా సీమకు నీరు దక్కేది. పదవులపై మోజుతో సర్కారు పెద్దలకు పాలేరులు గా మారిన సీమ నేతలు ఆ వైపుగా ఆలోచించడంలేదు. నేడు పోతిరెడ్డిపాడు రాయలసీమ గుండెచప్పుడు. గాలేరు నగరి, తెలుగు గంగ, యస్ ఆర్ బీ సీ లకు నీరు అందాలంటే అందుకు పోతిరెడ్డిపాడే ద్వారం. ఒక్క యస్ ఆర్ బీ సీ కి మాత్రమే 19 TMC ల నీటి హక్కు ఉంది మిగిలిన వాటికి చుక్క నీరు కూడా హక్కుగా లేదు. అప్పుడప్పుడు సీమ ఉద్యమకారులను ఎగతాళి చేస్తూ బాబు మాట్లాడే మాటలు మీకు హక్కులు కావాలా నీరు కావాల అని. కాని నేడు 5 వేల క్యూషెక్కులు నీటిని పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేసినారో లేదో అపుడే తెలంగాణ నుంచి అభ్యంతరం రావడం ఆ వెనువెంటనే రివర్ బోర్డు సమావేశం కావడం క్రిందకు నీటి కేటాయింపు చక చక జరిగిపోయినాయి. కారణం పోతిరెడ్డిపాడు నుంచి నీరు తోడుకునే హక్కు లేదు కాబట్టి. ఇపుడు నిందించాల్సింది రాయలసీమ నేతలు మరియు ఏపి ప్రభుత్వాన్నా లేదా తెలంగాణ ప్రభుత్వాన్నా.
సీమ, తెలంగాణ వైరం క్రిష్ణాడెల్టాపాలిట వరం.... గతంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుంది అన్న పేరుతో వై యస్ జగన్ కర్నూలు కేంద్రంగా ఆందోళన చేసినపుడు సీమ ఉద్యమం తప్పుపట్టింది. కారణం పైన ఉన్న తెలంగాణ, రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు అధికారిక కేటాయింపులు లేవు. అది పాలకులు చేసిన దుర్మార్గం. పరస్పరం రెండు ప్రాంతాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటే రాయలసీమ, తెలంగాణలోని ప్రాజెక్టులకు నీరు అందదు. ఇదే డెల్టాప్రాంతం కోరుకునేది. నేటి వివాదం పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వాలని ఏపి సర్కారు ప్రయత్నాన్ని తెలంగాణ, తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతానికి నీరు ఇవ్వడాన్ని ఏపి సర్కారు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏ ప్రభుత్వం అయినా లోపాలు ఉంటేనే ఫిర్యాదులు చేసుకుంటాయి. క్రిష్ణాడెల్టాకు హక్కుతో కూడిన నీటి కేటాయింపు ఉంది కనుక ఎవరూ ఏమీ చేయలేరు. (తెలంగాణ ప్రభుత్వం ఏపి ప్రభుత్వం పై చిన్న ఫిర్యాదు చేసినా సర్కారు పెద్దలు వెంటనే స్పందిస్తారు. నీటి కేటాయింపుపై తెలంగాణ, సీమ వివాదం జరుగుతుంటే నోరు మెదపలేదు. కారణం పైన ఉన్న తెలంగాణ రాయలసీమలో క్రిష్ణ నీటిని వాడుకోకపోతే అది తమకు లాభం కాబట్టి.) అదే సీమ, తెలంగాణ ప్రాజెక్టులకు సాంకేతికంగా హక్కులేదు కాబట్టి పరస్పరం పిర్యాదులు చేసుకుంటారు. కనుక రాయలసీమ ప్రజలు దీన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చూడకుండా ఏపి ప్రభుత్వం రాయలసీమ పట్ల, సీమ ప్రాజెక్టుల పట్ల అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి
(*రచయిత రాయలసీమ హక్కుల పోరాట నాయకుడు. బాగా పేరున్న నీళ్ల రాజకీయ విశ్లేషకుడు)