సకల 'సన్నాసులారా' ఏకం కండి!

First Published Feb 21, 2017, 3:05 AM IST
Highlights

రేపు అంటే  ఫిబ్రవరి 22,2017 తెలంగాణ కు సంబంధించినంత వరకు, అదేదో సినిమాలో మహేష్ బాబు 'బొంబాయిని ..చ్చ పోయించినట్టు' ఇక్కడ తెరాస ప్రభుత్వం పాలిటి మహేష్ బాబులా తయారయ్యాడు కోదండరాం.

 

ఆయన కంటే, ఆయన ఎంచుకున్న విషయం అలాంటిది. 'మాకు చేతులు ఖాళీగా ఉన్నాయి. పని యిస్తారా, మీ పని పట్టమంటారా?' అన్న నినాదం కేసీఆర్ కు నిదుర పట్టనివ్వటం లేదు. 

 

బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ కోసం అనుమతి కోరితే పోలీసులు నానా సాకులూ చెపుతున్నారు. నగరం బయట కీసరలోనో, అబ్దుల్లాపూర్ మెట్ లోనో, శంషాబాద్ లోనో మరెక్కడో పెట్టుకోండి అంటున్నారు. ఇపుడు విషయం కోర్టులో ఉంది. బహుశా ఏ క్షణమైనా అనుమతి రావచ్చు.

 

ప్రభుత్వానికీ పోలీసులకీ కంటిమీద కునుకు రానివ్వని ఈ ర్యాలీని అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజా సంఘాలూ... కోదండరాంను వ్యతిరేకించే వ్యక్తులూ, సంస్థలూ కూడా ర్యాలీకి మద్దతు ప్రకటించక తప్పని పరిస్థితులు ఉన్నాయిపుడు. 

 

కోర్టు ఇపుడు అనుమతి ఇవ్వకపోతే ప్రభుత్వమే నగుబాటు పాలవుతుంది. ఇది తథ్యం.

 

ఇంతకీ, ఈ ఉద్యోగాల విషయం ఏమంటే -

 

తెలంగాణలో నేడు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అని జేఏసీ లెక్క చెపుతున్నది. ఇది నిజమేనా లేక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినట్లు కేవలం లక్షా డెబ్భై వేలేనా అన్నది ప్రభుత్వం తలచుకుంటే విడమరచి చెప్పడం చిటికెలో పని. కేసీఆర్ చినజీయర్ తో పిచ్చాపాటీ (అంటే, రాజకీయాలు) మాట్లాడే సమయంలో అతి చిన్ని భాగపు సమయం అన్నట్టు!

 

కానీ హృదయం ఉండాలి కదా? 

 

Telangana Global Technologists Association అనే సంస్థ వారు 'తెలంగాణలో విద్య, ఉద్యోగావకాశాలు : నిర్లక్ష్యమా, అలక్ష్యమా?' అనే సదస్సు నిర్వహించారు. 

 

అది నిర్లక్ష్యమూ, అలక్ష్యమూ కాదు. కుట్ర అన్నారు కొందరు. ఇవేవీ కాదు 'క్లారిటీ' అని ఈ వ్యాస రచయిత ఉద్దేశం.

 

'విద్య లేక వివేకం లేదు, వివేకం లేక వివేచన లేదు, వివేచన లేక వికాసం లేదు, వికాసం లేక ప్రగతి లేదు' అన్నారు ఫూలే. 'బోధించు, సమీకరించు, పోరాడు' అన్నారు అంబేడ్కర్. 'Education is the key to unlock the golden door of freedom' అన్నారు జార్జ్ వాషింగ్టన్. 

 

70 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు ఇవ్వన్నీ తెలుసు. చదువుకునే అవకాశాలు ఉంటే ఆలోచన వస్తుంది. అవకాశాలు అడుగుతారు. అందుకనే, స్కూళ్ళను మూసేస్తున్నారు. టీచర్లను నియమించడం లేదు. యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ లు లేకుండా చేస్తున్నారు. స్కాలర్లకు గైడ్స్ లేకుండా చూస్తున్నారు. వారిని ఆత్మహత్యలకు పురికొల్పుతున్నారు. యువత ఉద్యోగిత పెంచేందుకు ఉద్దేశించిన కేంద్రప్రభుత్వ స్కిల్ డెవలప్ మెంట్ నిధులు కవిత జాగృతికి, వెంకయ్య నాయుడు స్వర్ణభారత్ ట్రస్ట్ కు మళ్లిస్తున్నారు. 'మనవాళ్ళకే ఉద్యోగాలు అంటే పరిశ్రమలు రావు' అంటున్నారు కేటీఆర్. కాంట్రాక్టులు చేయడానికి మనవాళ్ళకు స్కిల్ లేదు అంటున్నారు. 

 

కల్వకుంట్ల కుటుంబం ఉద్దేశాలు స్పష్టం. విద్య, ఉద్యోగాలు, నిరసనలు ఇక తెలంగాణలో కుదరవు. తెలంగాణ స్ఫూర్తి, చైతన్యం, పోరాటం ఇవన్నిటినీ అణచిపెట్టాలి. తెలంగాణ ఇపుడు కేవలం పాలకుల దయాదాక్షిణ్యాల మీద బతికే, గుళ్ళూ గోపురాల చుట్టూ తిరిగే, సంక్షేమ పథకాల కోసం అర్రులు చాచే, పాలక కుటుంబానికి దాసోహం చేసే చేవచాచ్చిన జాతిని తయారు చేయడమే వారి లక్ష్యం. 

 

ప్రభుత్వం మాత్రం పోలీసు రిక్రూట్ మెంట్లు తప్ప మరేమీ చేయడం లేదు. ఉద్యమ సమయంలో ఘంటా చక్రపాణి (నేటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్) చెప్పిన మాటలు నేటికీ అక్షర సత్యం:

 

"... చదువు కుంటుపడింది. ప్రభుత్వ ఖర్చును తగ్గించే పేరుతో ప్రైవేటు విద్యను ప్రోత్సహించే పేరుతో ఉన్నత విద్యావకాశాలను తెలంగాణ పిల్లలకు అందకుండా చేసి హైదరాబాద్‌ను కార్పోరేట్ విద్యా విపణిగా మార్చేశారు. కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ టీ) తప్ప మిగతాది ఏదీ చదువు కాదనే స్థితి ప్రభుత్వమే కల్పించింది. ఉద్యోగాల మీద అధికారిక నిషేధం సాగింది. ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించిన వందలాది పరిశ్రమలను మూసివేయడంతో లక్షలాది ఉపాధి కోల్పయారు. ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు లేక, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు రాక నిరుద్యోగుల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. ఈ దశలో సంఘటితమై నిరసన తెలపడానికి, పోరాడటానికి కూడా అవకాశాలు లేకుండా ప్రభుత్వం అశాంతిని అణచివేసే అధికారం పోలీసులకు అప్పగించింది...."

 

కానీ, కేసీఆర్ స్వయంగా హేళన చేసిన 'సన్నాసులు' (ఒకప్పటి తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు) అందరూ ఇపుడు ఏకం అవుతున్నారు. తెలంగాణ ప్రజలూ అందుకోసమే ఎదురు చూస్తున్నారు. 

 

అందుకు నాంది పలుకుతున్నది రేపు 'నిరుద్యోగ ర్యాలీ' తో. 

 

 

click me!