మన తెలుగు చేగువేరా పవన్ కళ్యాణ్ తాను అమితంగా ప్రేమించే అన్న బాటవైపుగానే అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు… రాజకీయాలకుసంబంధించి. కేసీఆర్ పాలన బాగుందని, చంద్రబాబు పాలన బాగుందని చెప్పటంద్వారా పవన్ తెలుగు రాష్ట్రాలప్రజలకు… కనీసం తన పార్టీ కార్యకర్తలకైనా ఏమి సందేశం ఇస్తున్నారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరువురు చంద్రుల పాలన బాగుంటే జనసేన అవసరం ఏమిటన్న విమర్శ బలంగా వినబడుతోంది. పవన్ కు తాను నడుపుతున్నది రాజకీయపార్టీనా, స్వచ్ఛందసేవాసంస్థ(ఎన్జీవో)నా అనేది స్పష్టత లేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోక్ సత్తా అనే స్వచ్ఛందసంస్థను పెట్టిన జయప్రకాష్ నారాయణ, దానిని రాజకీయపార్టీగా మార్చి విఫలమైతే, 'జనసేన' అనే పార్టీని పెట్టిన పవన్ దానిని స్వచ్ఛందసంస్థగా మారుస్తారా అన్న అనుమానం కలుగుతోంది.
కేసీఆర్ పాలన బాగుందని, ఆయన ప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్ అద్భుతమని పొగడటం ద్వారా పవన్ తన అపరిపక్వత(Immaturity)ను మరోసారి బయటపెట్టుకున్నాడు. ప్రభుత్వాలు రూపొందించే పథకాలు ఏవైనా ఒక మంచి, ఉన్నతలక్ష్యంతో, ఉద్దేశ్యంతోనే రూపొందుతాయి. వాటి అంతిమలక్ష్యం ఎంతవరకు నెరవేరుతోంది, లబ్దిదారులకు ఎంతవరకు ఉపయోగపడుతోంది అన్నదే అసలు సమస్య. తెలంగాణలో నిరంతరవిద్యుత్ అనే పథకం ఇటీవలే మొదలుపెట్టారు. దానిలో మంచి-చెడులు, లాభనష్టాలు, లోతుపాతులు అప్పుడే తెలియవు. దానిని అధ్యయనం చేయకుండానే పైపైన చూసి అద్భుతమని ప్రశంసించటం తొందరపాటు. నిరంతర విద్యుత్ వలన భూగర్భజలాలు అడుగంటే ప్రమాదముందని, నాణ్యమైన విద్యుత్ 9 గంటలు ఇచ్చినా చాలని వివిధ వాదనలు వినబడుతున్నాయి. మరోవైపు ఈ పథకం కేంద్రప్రభుత్వ 'ఉదయ్' వంటి విద్యుత్ విధానాలవలనే సాధ్యమయిందని బీజేపీ ఒకపక్కన, పెద్దఎత్తున విద్యుత్ ను ఇతర రాష్ట్రాలనుంచి కొనుగోలు చేయటంవల్లనే సాధ్యమయిందని, ఈ కొనుగోలులో పెద్ద కుంభకోణాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్-కోదండరామ్ మరోపక్కన విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాలన్నిటినీ అధ్యయనం చేయకుండా పవన్ ఒక నిర్ణయానికొచ్చేయటం(Jumping to conclusions) అసమంజసం. మరోవైపు ఈ ప్రకటనద్వారా తెలంగాణలోని అతని పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను, అభిమానులను పవన్ అయోమయంలోకి నెట్టినట్లయింది. పవన్ కూడా తెలంగాణలో ఒక మంచి ప్రత్నామ్యాయం అవుతాడేమోనని ఎదురుచూసేవారికి ఇది ఒక షాకేనని చెప్పాలి.
undefined
ఇదేకాదు… చంద్రబాబును కలిసిన ప్రతిసారీకూడా పవన్ ఇలాగే మాట్లాడుతున్నారు. బాబుతో భేటీ తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అనుభవజ్ఞుడని, పరిపాలన బాగానే ఉందని సానుకూలధోరణిలో చెప్పుకొస్తున్నారు. ఇటీవల విశాఖ, రాజమండ్రి, ఒంగోలు ప్రాంతాలలో జరిపిన నాలుగురోజుల పర్యటనలోకూడా తెలుగుదేశం ప్రభుత్వ పాలన బాగానే ఉందన్నట్లుగా చెప్పారు. ఆ పర్యటనలో జగన్ ను విమర్శించిన స్థాయిలోకూడా చంద్రబాబును విమర్శించకుండా నీళ్ళు నములుతున్నారన్నది పవన్ పై బలంగా వినబడుతున్న ఆరోపణ.
పవన్ ఇలా చంద్రబాబును, కేసీఆర్ ను ప్రశంసించటం వెనక ఒక థియరీ వినిపిస్తోంది. పవన్ ఈ ముఖ్యమంత్రులను కలిసినప్పుడు అక్కడ లభించిన మర్యాదలకు, రాజోపచారాలకు పొంగిపోయి, ఆ మైకంలో - బయటకొచ్చిన తర్వాత వారిపై ప్రశంసలు కురిపిస్తున్నాడని కొందరి వాదన. పవన్ లోని ఈ బలహీనతను గుర్తించే చంద్రబాబు ఆ మధ్య, అమరావతిలో భూసేకరణ తదితర అంశాలపై పవన్ ను ఒప్పించటానికి ఛార్టర్డ్ ఫ్లయిట్ లో ఆయనను అమరావతి పిలిపించి, ఆయనకు పలురకాల వంటకాలతో ప్రత్యేకమైన విందు ఏర్పాటుచేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇటీవల కేసీఆర్ తో భేటీ అయినప్పుడుకూడా పవన్ కు రాచమర్యాదలు జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ అత్యంత ప్రముఖులతో భేటీ అయ్యే ఛాంబర్ లోకి పవన్ ను తీసుకెళ్ళటం ఆయనకు ప్రత్యేక విందు ఏర్పాటుచేయటం జరిగాయి. దీనిపై టీఆర్ఎస్ పార్టీలోనివారే కొందరు బహిరంగంగా విమర్శలుకూడా గుప్పించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకుకూడా కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకటంలేదుగానీ పవన్ ను మాత్రం ప్రత్యేక ఛాంబర్ కు తీసుకెళ్ళి మర్యాదలు చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి మర్యాదలు అందుకోవటంతోటే పవన్ పొంగిపోయి బయటకొచ్చి సానుకూలంగా మాట్లాడారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన.
పవన్ ప్యాకేజిలు తీసుకుని లోపాయికారీ అవగాహన కుదుర్చుకుంటున్నారని రోజావంటి ప్రత్యర్థులు కొందరు నిందారోపణలు చేసినప్పటికీ ఆయన నిజాయితీని, నిబద్ధతను ఎవరూ శంకించే పరిస్థితి లేదు. అయితే ఇలా ముఖస్తుతికి, మర్యాదలకు పొంగిపోయి బయటకొచ్చి ప్రశంసలు కురిపించటంతో పలచనవుతున్నాడు. మరోవైపు - తాను మాట్లాడే మాటలు మీడియాలో ఎలా ప్రొజెక్ట్ అవుతాయో తెలియకపోవటంకూడా పవన్ లోని మరో బలమైన లోపం.
2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి అధికారం దక్కటంలో ఒక కీలక, నిర్ణయాత్మక పాత్ర పోషించి, స్వయంగా తాను పెద్దసంఖ్యలో యువతతోకూడిన ఒక రాజకీయపార్టీకి సారధ్యం వహిస్తున్న వ్యక్తికి మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియకపోవటం విచారకరం. రోజురోజుకూ రాజకీయ అవగాహన పెంచుకుంటూ పరిణతితో మాట్లాడాల్సిందిపోయి, తన మనస్సులో ఏమనిపిస్తోందో దానిని చెప్పేయటం, ముఖ్యమంత్రి పదవి నిర్వహించేటంత సామర్థ్యం తనకు లేదనటం, కేసీఆర్ దగ్గర కొన్నివిషయాలు తెలుసుకోవాలని వచ్చానని చెప్పటం ఆయన అమాయకత్వాన్ని సూచిస్తున్నాయి. ఇటీవలి ఆయన ఏపీ పర్యటనలో కూడా ఇలాగే జరిగింది. విశాఖ, రాజమండ్రి, విజయవాడలలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశాలను లైవ్ టెలికాస్ట్ చేసుకోవటానికి మీడియాను అనుమతించారు. కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రజారాజ్యంనాటి సంగతులను ప్రస్తావిస్తే - పవన్ ప్రజారాజ్యంనాటి కక్షలు తీర్చుకోవటానికే జనసేన పెట్టాడన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. కార్యకర్తలతో జరిగే ఆంతరింగిక సమావేశాలకు మీడియాను అనుమతించగూడదనికూడా జనసేన నాయకులకు తెలియదని దీనినిబట్టి అర్థమవుతోంది. మరోవైపు ఇలాంటి తప్పులు జరిగినా వాటిపై చర్చించే వ్యవస్థగానీ, సరిదిద్దే నిర్దేశకులుగానీ జనసేనలో లేవని చెబుతున్నారు.
తాను మాట్లాడే మాటలు మీడియాలోకి ఎలా వెళ్తాయో తెలిసిన విజన్ ఉండటం ఒక రాజకీయనాయకుడికి ప్రాధమిక అర్హత. కాబట్టి పవన్ మొదట మీడియాపై అవగాహన పెంచుకోవాలి. ప్రత్యర్థిపార్టీ కత్తి మహేష్ అనే వ్యక్తితో మీడియాలో పవన్ పై, జనసేనపై బురదజల్లిస్తూ ప్రాపగాండా చేయిస్తున్నాకూడా పార్టీ నాయకత్వం కిమ్మనకుండా ఉంటోందని జనసేనలోనివారే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజారాజ్యం సమయంలో టిక్కెట్లు అమ్ముకున్నారని నాడు ప్రత్యర్థులు పదేపదే చేసిన ఆరోపణలను తిప్పికొట్టకపోవటంవలన అవి ప్రజల్లోకి ఎలాగైతే బలంగా వెళ్ళిపోయాయో ఇప్పుడు 'కత్తి'వలనకూడా అలాగే జరిగే అవకాశముందని జనసేనలోని కొందరు ఆలోచనాపరులు వాపోతున్నారు. ఇదిలాఉంటే సంస్థాగత నిర్మాణం ఒక రూపు దాల్చలేదు. గ్రామస్థాయినుంచి పార్టీ యంత్రాంగాన్ని, మౌలికవసతులను ఏర్పరుచుకోలేని పరిస్థితి. ప్రజాదరణను ఓట్లుగా మలుచుకోగలిగే సామర్థ్యం ఉన్నట్లుగా కనిపించటం లేదు. ద్వితీయశ్రేణి నాయకత్వం అన్న ఊసే కానరాదు. అన్నీ తానై ఒన్ మ్యేన్ ఆర్మీలాగా పవన్ పార్టీని నడుపుతున్నారు.
గుజరాత్ లో పట్టుమని పాతికేళ్ళ వయసున్న హార్థిక్(పై పోటో), అల్పేష్, జిగ్నేష్ వంటి కుర్రాళ్ళు రాష్ట్రరాజకీయాలను ఊపేస్తుంటే పవన్ ఇంకా సంశయాత్మక ధోరణితో వ్యవహరించటం హాస్యాస్పదం. నిలకడలేమి(ఆరంభంలో ఉన్న ఉత్సాహాన్ని తుదకంటా కొనసాగించలేకపోవటం), సంశయాత్మక వైఖరి వంటి లోపాలను తొలగించుకోవటంతోబాటు, పౌర్ణమికో-అమావాస్యకో అన్నట్లు కాకుండా పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా రాజకీయం చేస్తే పవన్ మనగలుగుతాడు. లేకపోతే అన్నలాగా అయిపోతాడనటంలో ఎలాంటి సందేహంలేదు. అయితే అలా జరిగితేమాత్రం అతనిని నమ్ముకుని జనసేనకోసం నిరంతరం తపన పడుతున్న కొన్ని వందల, వేల అమాయక యువతకు అది ఆశనిపాతమే. కనీసం ఈ విషయాన్నయినా పవన్ ప్రతిక్షణమూ గుర్తుంచుకోవాలి.
ఏది ఏమైనా పవనుడు శల్యుడు కాకుండా ఉంటే బాగుంటుంది. ఈ శల్యుడి వృత్తాంతం చాలామందికి తెలియకపోవచ్చు. మహాభారతంలో పాండవులకు శల్యుడు అనే మేనమామ ఉంటాడు. ఆయన మద్రదేశానికి రాజు. భారతయుద్ధంలో పాండవుల తరపున పోరాడటానికి ససైన్యంగా తరలివస్తుండగా దుర్యోధనుడు దారిమధ్యలో కలిసి అద్భుతమైన రాజోపచారాలు చేసి బుట్టలో వేసుకుంటాడు. దీనితో శల్యుడు కౌరవ పక్షంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి పవన్ శల్యుడిలా మిగిలిపోకుండా అర్జునుడిలా ధృడచిత్తంతో స్వధర్మాన్ని ఆచరిస్తాడని ఆశిద్దాం.
(*రచయిత శ్రవణ్ బాబు సీనియర్ జర్నలిస్టు, ఫోన్ నెం.9948293346)