ఒంటరితనం వంశపారంపర్యమా ?

 |  First Published Jan 2, 2017, 4:46 AM IST

 

ఒక మనిషి ఏకాకి గా కనిపిస్తే ఆ మనిషి ఒంటరి తనాన్ని (Loneliness) కోరుకుని వుండటమో, లేక సాంఘిక ఏకాంతవాసాన్ని(Social Isolation) అనుభవిస్తుండడమో, జరిగి వుండవచ్చు అని ఊహించవచ్చు. ఈ రెండు స్థితు లు ఒకటేనా? 

Latest Videos

undefined

 

ఒంటరితనాన్ని “మనచుట్టూ వున్న వారితో, సామాజిక మరియు  భావావేశ పూరిత సంబంధాలను తెంచుకుని  సంబంధ రహితంగా వుండిపోవడం” గా నిర్వచించ వచ్చు. అంటే మన చుట్టూ ఎంతో మంది మనుష్యులున్నా   వారందరితోటీ ఏలాంటి సంభాషణలూ, సంబంధాలూ లేకుండా వుండటం ఒంటరితనమౌతుంది. ఇది వ్యక్తిగతమైన ఒక మానసిక స్థితి.       

 

సాంఘిక ఏకాంత వాసాన్ని “ఒక మనిషి సంఘం తో పరిమిత సంబంధ బాంధవ్యాలు కలిగి వుండే ఒక వస్తు స్థితి” గా నిర్వచించ వచ్చు. ఇంట్లొ తలుపులేసుకుని ఒంటరిగా వుండిపోవటం, పరిచయస్తులకూ, స్నేహితులకూ, కుటుంబ వ్యక్తులకూ  దూరంగా వుండటం, ఇతరుల తో కలిసే అవకాశాలు కలిగినప్పుడు తప్పించుకుని తిరగడం ఈ స్థితి లక్షణాలు.

 

ఏకాంతవాసం మనుష్యుల్ని తప్పించుకు తిరగడాన్ని, వారికి దూరంగా వుండటాన్ని,  పరిమిత సంబంధాల్ని మాత్రమే పెట్టుకోవడాన్ని సూచిస్తే, ఒంటరితనం మన చుట్టూ వున్న వారి పట్ల ముభావంగా వుండటాన్ని సూచిస్తుంది.

 

ఒంటరి తనం ఇతరులకు తమలో ఆసక్తి లేదని వారు తమని దగ్గరికి తీయరని భావించేలా చేసి వారి చుట్టూ వున్నబంధాల పై వ్యతిరేకతను సృష్టిస్తుంది. ఫలితంగా ఒంటరిగా వున్న వాళ్లు ఎదుటి వారి ఆహ్వానాలను ఏదో ఒక సాకు పెట్టి తిరస్కరించి వారికి దూరమై, ఒంటరితనాన్నీ,  ఏకాంత జీవితమే మంచిదన్న అభిప్రాయాన్నీ  పెంచుకుంటారు.

 

అంతే కాదు, ఒంటరి తనం మనుష్యుల లో వికృతమైన ఆలోచనలను కలిగిస్తుంది. నిరాశా నిస్పృహల్ని పెంచుతుంది. ఒంటరిగా వున్న మనుష్యులు చాలా మటుకు ఎదుటి వారి స్నేహాల్నీ బంధుత్వాలనీ శత్రుభావం తో అంచనా వేసి వారిపట్ల ఏవగింపు కలిగి వుంటారు. దీనివల్ల వారు ఎవరికీ దగ్గర కాలేరు. అందరికీ దూరమై అన్నోన్యత ను కల్గించే అవకాశాలను పోగొట్టుకుంటారు. మరింత కృంగిపోతారు.    ఇటువంటి ప్రవర్తన వారు సంఘం నుండి దూరమై పోయి మరింత కృంగిపోయేలా చేస్తుంది.

 

ఇటువంటి ప్రవర్తనను ప్రోత్సహించే అంశాలు వంశ పారంపర్యంగా సంక్రమించ వచ్చని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. మనుష్యులు ఒంటరిగా వుండాలని కోరుకోవడానికీ, ఏకాంత జీవనం పట్ల ఆసక్తి చూపడానికీ, వ్యాకులతకీ, జన్యు పరంగా పరస్పర సంబంధాలున్నాయని వీరు అభిప్రాయ పడుతున్నారు       

 

ఒంటరితనాన్ని ప్రేరేపించే ప్రత్యేకమైన జన్యువు ఒకటుందని గుర్తించకపోయినా, ఒంటరితనం వైపు ఆసక్తిని పెంచే ప్రక్రియలో జన్యు ప్రభావమైతే వుందని అభిప్రాయపడుతున్నారు.  ఒంటరితనం అనేక జన్యు సముదాయాల ప్రతి చర్య గా ఆవిర్భవించొచ్చు.

 

ఇంతవరకు విషాదకరమే. కానీ శుభవార్త ఏమిటంటే  వంశపారంపర్యంగా సంక్రమించినా మరే విధంగా మనల్ని ఆక్రమించినా ఒంటరితనపు కోరల్లోంచి బయటపడే శక్తి మనకుంది. సలహా సమావేశాలూ, తగిన పుస్తకాలు చదవడం మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం, మనుష్యులతో కలవటాన్ని ఎక్కువచేయడం ద్వారా ఇది సాధ్య మవుతుంది.

 

ఇతరుల పట్ల మనకున్న వ్యతిరేక భావాల్ని తగ్గించుకోవాలి. మనమనుకున్న దానికంటే ఎదుటివారు మనపై ఎక్కువ శ్రధ్ధే చూపుతున్నారన్న భావం పెంచు కోవాలి. ఇలా చేయడం కష్టమే కావచ్చు కానీ అసాధ్యమైతే కాదు.  భావావేశం ప్రకారం ఎంత ప్రమాదకరంగా కనిపించినా, మానసికంగా మనల్ని కట్టిపడేసిన నాలుగ్గొడలమధ్యనుంచి బయటపడి, మనుష్యుల్ని కలవడం వారితో మాటా  మాటా కలిపి సంబంధాల్ని పెంచుకోవడం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా మనుష్యుల పట్ల మన వ్యతిరేకతా, శత్రుత్వ భావం అదుపులో వుండేటట్లు పర్యవేక్షించుకుంటూ వుండాలి.    

 

మనిషి సంఘజీవి. సంఘమంటే నలుగురు మనుష్యులు. దుఃఖం  నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది, సంతోషం నలుగురితో పంచుకుంటే పెరుగుతుంది అన్నారు. ఆ నలుగుర్ని వదిలేసి ఒంటరిగా వుండి జీవితం లోని ఆనందాన్ని పోగొట్టుకోవడం దేనికి?  మనుష్యుల మధ్య గోడలు కట్టటానికి బదులుగా వారధులు కట్టి ఒంటరితనానికి స్వస్తిపలకడం మంచిది.

 

ఒంటరి తనమూ, అవాంఛిత భావన కంటే భయంకరమైన పేదరికం లేదు అన్నారు పెద్దలు.

 

                 

click me!