ఇవీ ఈ మధ్య ప్రజాగాయకుడు గద్దర్ నోటి నుంచి వెలువడిన అణిముత్యాలు
undefined
1. ఎవరినీ తిట్టను
2. పార్టీ పెట్టను
౩. ప్రజలను చైతన్యం చేస్తా
గద్దరన్నా. మీరు చెప్తున్న మూడో విషయం నిజం కాదని మీరే చెప్పిన 1, 2 అంశాల్లో స్పష్టం అవుతున్నది.
పోనీ, నేనే తప్పు అనుకుందాం. మీరు చేసే చైతన్యం చేయండి. అయితే కొన్ని షరతులు :
- మీరే పది వేల మంది సైనికులను పంపించిన, మీరు ఇప్పటికీ గర్వకారణంగా చెప్పుకుంటున్న విప్లవకారుల పార్టీ సభ్యులైన స్మృతి, సాగర్ లను యెన్ కౌంటర్ చేసిన కేసీఆర్ ను తుక్కు రేగ్గొట్టే విమర్శలతో మొదలు పెట్టండి. 'రాజ్యం, పాలకులు' అని పడికట్టు మాటలలో కాదు, 'కేసీఆర్' అని స్పష్టంగా అనండి.
- కేసీఆర్ భూదాహానికి బలౌతున్న మల్లన్నసాగర్ ప్రజల మధ్యలోకి వెళ్ళండి. సంవత్సరానికి చేరవస్తున్న వేములఘాట్ ప్రజల దీక్షా శిబిరంలో కూర్చుని మీ సొంతజిల్లా (అన్నట్టు మీ సొంత నియోజకవర్గం కూడా అదే - దుబ్బాక) ప్రజా ప్రతినిధులు, మల్లన్నసాగర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రూపకర్తలు అయిన కేసీఆర్, హరీష్ రావుల పై తిరగబడమని తెలంగాణ ప్రజలకు పిలుపు యివ్వండి.
- కేసీఆర్ ఎన్నికలకు ముందు కుర్చీ వేసుకుని కూచుని ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను ఆపుతా అని హామీ యిచ్చి, ఇపుడు 18 ఓపెన్ కాస్ట్ లు తెరవడం ద్వారా తెలంగాణను బొందలగడ్డ చేయబూనడాన్ని ఖండించండి. 628 రోజులకు చేరిన ఎర్రగుంటపల్లి ఓపెన్ కాస్ట్ బాధితుల శిబిరంలో కూర్చోండి.
- దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి పై మాట్లాడండి.
- బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేసేలా ప్రభుత్వ స్కూళ్ళ నుండి ఉస్మానియా యూనివర్శిటీ వరకు నిధులు యివ్వకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా గుళ్ళూ గోపురాలూ పట్టుకు తిరుగుతున్న కేసీఆర్ నూ, ఆయనకు వంతపాడుతున్న గవర్నర్ నూ నిలదీయండి.
- మీడియా, కాగ్ సహా పలు ప్రజా సంఘాలు నిలదీస్తున్న ప్రజారోగ్య నిర్లక్ష్య విధానాలపై గళం ఎత్తండి. విద్య-వైద్యం-ఉపాధి-సంక్షేమం-వికాసం ఇవన్నీ గాలికి ఒదిలేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాని ప్రజల పక్షాన ప్రశించండి. లేదా చైతన్యం చేయండి.
- ఉద్యమ ద్రోహులకు పదవులిస్తున్న, ఉద్యమకారులను అణచివేస్తున్న కేసీఆర్ ను ఎదిరించండి.
- రాం.రాం.రాం (రామోజీ, రామేశ్వర్ రావు, రామానుజ జీయర్) లకు తెలంగాణ ఆస్తుల్నీ, కలల్నీ దోచిపెడుతున్న తెలంగాణ కనివిని ఎరుగని ద్రోహి కేసీఆర్ ను రోడ్డుకు ఈడ్వండి.
- మార్క్స్, అంబేడ్కర్, ఫూలే, బుద్ధుడు - వీరు ఎవరూ కేసీఆర్ మార్గానికి ఆమోదం తెలుపరని గమనించండి.
మీ కంటే ముందే ఎపుడో మేలుకున్న (మీరు ఇప్పటికీ మేలుకోలేదనే నా అభిప్రాయం. ఎందుకంటే 'నిద్ర నటన' మీకు ఇష్టంగా, ప్రయోజనకరంగా ఉన్నది) ప్రజలను చైతన్యం చేసేదేమీ లేదు మీరు.
వేములఘాట్, ఎర్రగుంటపల్లి ప్రజల దగ్గర కావాల్సినంత చైతన్యం మీరు అప్పు తీసుకోవచ్చు, మనసుంటే!
*
చదువరులకు విజ్ఞప్తి:
'నేను పార్టీ పెట్టను. ఎవరికీ వ్యతిరేకం కాను. ప్రజల్ని చైతన్యపరుస్తా'...
గద్దర్ సహా ఎవరూ ఈ వాగుడు వాగినా నమ్మనక్కరలేదు. ప్రజలెప్పుడో మనకంటే ఎన్నో కాంతిసంవత్సరాలు దాటిపోయారు చైతన్యంలో. ఎవరికీ వ్యతిరేకం కానివారితో ఎవరికీ ప్రయోజనం లేదు.
మనమే ఏమీ అర్థంకాని మాటలు మాట్లాడుకుంటూ, ఎపుడో చేసిన 'త్యాగాల'కు శాశ్వత ప్రీమియం పేమెంట్ కోరుతూ ఉన్నాం సమాజం నుంచి. ఇది, పోలింగ్ రోజు మాత్రమే 500 తీసుకోవడంకన్నా నీచాతినీచం!
జై భీమ్!