అంతరిక్షంలోకి వెళ్లాలి,చంద్రుడిని చేరాలి..ఇవన్నీ ఒకనాటి మానవుల కల్పనలు.శాస్త్ర సాంకేతికరంగాల్లో పురోగమించి వాటిని సాకారం చేసుకున్నారు.ఇక వీటి ద్వారా ఇప్పుడు కళల్లో కూడా కొన్ని కల్పనలు(కళలూ కల్పనల ఆధారమేగా అనేవారూ లేకపోలేదు).ఉదాహరణకు సినిమాలు తీసుకుంటే.....ఎప్పుడో అంతరించిన డైనోసార్లు ఇలా ఉండేవి,వాటి జన్యువు దొరికితే మళ్లీ ప్రాణం పోయచ్చు అని ఒకరు,ఎప్పుడో మునిగిన టైటానిక్ మునకను ప్రత్యక్షంగా మరొకరు చూపితే,అందాల పండోరా గ్రహం అంటూ మరొకరు చూపించారు.ఈ సినిమాల్లో కల్పిత కథలను అప్పట్లో ట్రిక్ ఫోటోగ్రఫి అనేవాళ్లం...కంప్యూటర్ల రాక...గ్రాఫిక్స్ అంటూ నిజంలా భ్రమింపజేసే కల్పనలు మొదలయ్యాయి.
undefined
సినిమాలను,ఈ వింతలను కల్పనలుగా చూసి వదిలేస్తాం కానీ మన దేశీ సినిమాలు మాత్రం మూఢత్వాన్ని పెంచిపోషిస్తున్నాయి..అసలే ముక్కోటిదేవతలు. ఓ మూడు దశాబ్దాల కింద లేని మూఢనమ్మకాలు,వింతవింత పూజాపునస్కారాలు సమాజంలోకి వచ్చి చేరుతున్నాయి.
అసలు భూమి పుట్టాక ఏ కాలమైనా ప్రాకృతిక సత్యాలు ఒక్కటే...నాగరికత పరిణామం లో వేర్వేరు కాలాల్లో మారింది మానవులాచరించే ధర్మం,నీతి కి సంబంధించిన నైతిక విలువలే....ఒకనాడు చెల్లినవి మరొకనాడు తప్పయ్యాయి...ఇవి వారు నమ్మే పురాణేతిహాసాల్లోకి జొరబడ్డాయి...లేని దైవత్వాలు ఆపాదించారు...
రామాయణ,భారతాలను ఇతిహాసాలంటాము...రామాయణ ప్రధాన పాత్రలే కాదు వానరులంతా దైవాంశ సంభూతులే...ఇక భారతంలో కృష్ణుడు,పాండవులు...బైబిల్ లోని జీసస్....ప్రాకృతిక సత్యాలు ఒక్కటైనప్పుడు ఆ దైవాంశ సంభూతులు ఇప్పుడు లేరే?
ఇదంతా చెప్పడానికి కారణం మనం ఎన్ని సార్లు చదివినా కొత్తకోణంలో చూసే మహాభారతం..."భారతం లో ఉన్నది ఇంకెక్కడైనా ఉంటుంది-భారతంలో లేనిది ఎక్కడా ఉండ"దన్న నానుడి ఉంది....మరి లక్ష పైచిలుకు శ్లోకాల గ్రంధం..
నిజానికి వ్యాసుడు "జయమ్" పేరుతో భారత ఇతిహాసానికి కావ్యరూపమిచ్చిది 8800 శ్లొకాలతో...
ఆ తర్వాత ఆయన శిష్యుడు వైశంపాయనుడు 24,000 శ్లోకాలుగా విస్తరించి సర్పయాగం చేస్తున్న జనమేజయుడికి వినిపించాడు...అది భారతం అయింది...
ఆ తర్వాత నైమిశారణ్యంలో శౌనకాది మునులకు సౌతి(ఉగ్రశ్రవుడు) మరింత విస్తరించి చెప్పగా అది మహాభారతం అయింది....
వేల ఏళ్లగా పండితపామరులను ఆకట్టుకుంటూనే ఉన్న ఈ ఇతిహాసంలో ఎన్నో ప్రక్షిప్తాలు...
ఒక్కో ప్రధాన పాత్ర ఆధారంగా మళ్లీ ఎన్నో పుస్తకాలు...
1883-94 మధ్య స్కాండినేవియన్ సాహిత్యవేత్త సోరెన్ సోరెన్‌సన్ మహాభారతం నుండి మూల కథను వేరుచేసే ప్రయత్నం లో 27,000 శ్లోకాలను 7-8 వేలకు తగ్గించే ప్రయత్నంలో మరణించాడట.ఆ తర్వాత 80 ఏళ్లకు ప్రొఫెసర్ కేశవరామ్.కే.శాస్త్రి మహాభారతం నుండి జయమ్‌ను వేరు చేయగా 1977 లో గుజరాత్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారు 8801 శ్లోకాల "జయసంహిత" ను ప్రచురించారు.
పాండురాజు మరణం తర్వాత కుంతీదేవి కుమారులతో హస్తినకు రావడంతో కథ మొదలవుతుంది.మహాభారత యుద్ధం ముగిసి అశ్వమేధయాగం చేసిన పాండవులు హస్తిన చేరడంతో కథ ముగుస్తుంది.
ఇక మహాభారతంలోని వరాలు,శాపాలు,దైవాంశలు,మహిమలూ లేకుండా ప్రఖ్యాత కన్నడ రచయిత భైరప్ప "పర్వ" నవలను అందించారు...సాహిత్య అకాడమీ వారి తెలుగు అనువాదం దొరుకుతుంది....
ఇక ఇదే కోవలో నాయుని కృష్ణమూర్తి గారు ఇప్పుడు ‘జయమ్’ ను మనకు అందించారు....
ఈ పుస్తకం విశేషాలు....
ప్రతీపుడనే మహారాజు పెద్దకొడుక్కు చర్మరోగం ఉన్నందున రాజ్యార్హత కోల్పోతాడు,రెండవ కొడుకు శంతనుడు రాజవుతాడు..గంగాతీరంలో తల్లిదండ్రులెవరో తెలియకుండా స్వేచ్చగా పెరిగిన గంగ ను పెళ్లాడుతాడు...ఆవిడకందరూ మృతశిశువులే జన్మిస్తుంటే సగటు మనిషిలా ఆవిడతో సహా అందరినీ గంగలో వేస్తానంటాడు...తన స్వేచ్చ,ఆత్మగౌరవానికి భంగం కలిగించాడని ఈ సారి బతికిన శిశువుతో ఇల్లొదిలిపోతుంది.ఆ తర్వాత ఆ బాలుడే భీష్ముడిగా ప్రసిద్ధి పొందటం ఉంటుంది.
ఆ తర్వాత సవతిసోదరుడు విచిత్రవీర్యుడు మరణించగా సవతితల్లి కి పెళ్లికి ముందే పుట్టిన వ్యాసుడితో నాటి సమాజంలో ఆమోదయోగ్యమైన దేవరన్యాయం(మరిదితో పిల్లలు కలగడం)తో సమాగమం ఏర్పాటు చేస్తారు.
ఇక పాండురాజు కథలో అతనొక నపుంసకుడు...కుంతి,మాద్రిలను పెళ్లాడుతాడు...నాటి సమాజంలో సంతానం కలగడానికి ఆరు మార్గాలుండేవి.ఎవరినైనా నియోగించి పుట్టించ వచ్చు..ఆ మార్గాన్ననుసరించి దేవభూముల్లో సంచరించే వారితో సంతానం పొందుతారు...మనం విన్న కుంతి-దూర్వాసుడి మంత్రం ఉండవు...కుంతి పెళ్లికి ముందే ప్రణయం నడిపి తల్లి అయిఉంటుంది.
ఇక దృతరాష్ట్ర,గాంధారిలకు నలుగురు సంతతి..సోదరుడికి ఐదుగురున్నారని మిగిలిన 96 మందిని దత్తత తీసుకుంటారు..ఆ తర్వాత దుస్సల పుడుతుంది.
మనం చదివిన,విన్న కుండలో ద్రోణుడు పుట్టాడన్న కథ,ఏకలవ్యుడి కథ ఉండదు.ఖాండవదహనం లో నాగులనే జతి ప్రజలు అక్కడి నుంచి పారిపోయారనే ఉంటుంది తప్ప నాగాస్త్రం కావడం,కర్ణుడిని చేరడం ఉండవు...అసలు కర్ణుడి కవచకుండలాల ప్రస్తక్తే ఉండదు.ద్రౌపది వస్త్రాపహరణంలో కృష్ణుడు,చీరలివ్వడం ఉండదు.పెనుగాలికి దుమ్ము కళ్లలో పడితే కళ్లు మూసుకున్నారని ఉంది.
ఇక అరణ్యవాసంలో అక్షయపాత్ర కథ,కౌరవుల ఘోషయాత్ర,గంధర్వులచే పరాభవం కథలుండవు.ఇక కృష్ణరాయభారంలో విశ్వరూప సందర్శనం ఉండదు.స్సత్యకి,కృతవర్మల తోడుగా బయటికి వస్తాడు.
యుద్ధంలో వింతవింత అస్త్రశస్త్రాల ప్రయోగాలుండవు...భగవద్గీత అసలే ఉండదు...అప్పుడప్పుడూ యుద్ధాన్ని చూసి వస్తున్న సంజయుడు యుద్ధ ఘట్టాలను దృతరాష్ట్రుడికి వివరిస్తుంటాదు.భీష్ముడి అంపశయ్య,అశ్వథామా హతః కథలు,పద్మవ్యూహం,అభిమన్య,ఘటోత్కచ వధలూ ప్రత్యేకంగా కనిపించవు.కర్ణుడి శాపాలు,రధం కృంగడం ఉండవు.
యుద్ధానంతరం హస్తినలోకి అడుగుపెడుతున్న ధర్మరాజును చూసి వృద్దులు,స్త్రీలు,యుద్ధంలో చావగా మిగిలిన సేవకులు "జయమ్‌జయమ్" అంటూ స్వాగతిస్తారు..ధర్మరాజు పెదవులూ ఆ పదానికి అర్ధం వెదుకుకుతూ "జయమ్" అంటూ గొణిగాయని నవల ముగుస్తుంది....
ఇంత నరమేధం జరిగాక ఇదెక్కడి జయమ్ అనుకున్నారని కాబోలు పుస్తక ముఖచిత్రం పైన జయమ్ అన్న అక్షరాల పక్కన ప్రశ్నార్ధకం ఉంటుంది..కంకాళాల మధ్య నడిచి వెళుతున్న పాండవులు,ద్రౌపది ఉన్న ఈ ముఖచిత్రాన్ని అందించిన చిత్రకారుడు బాపు మెచ్చిన యువచిత్రకారుడు అన్వర్.
ఇక పుస్తకంలో ఎక్కడా తప్పుల్లేవంటారా?పేజీ 43 లో గాంధారితో పాటు తమ్ముడు శకుని హస్తిన చేరుతాడు...పేజీ 180 లో జూదం ఆడేప్పుడు ఎవరు ముందు పాచికలెయ్యాలన్న సంశయం వచ్చినప్పుడు వయసులో చిన్నవాణ్ని నేను అని ధర్మరాజుతో శకుని అనటం పంటికింది రాయిలా అనిపిస్తుంది.
మహిమలు,శాపాలు,వరాలు అన్నీ వదలి ఒకనాటి మనుషుల,దాయాదుల మత్సరాల కథ చదవాలనుకుంటే తప్పక చదవండి.పర్వ నవలలో సుదీర్ఘ చర్చలు,ధీరగంభీర పదాలు కనిపిస్తాయి కానీ ఈ పుస్తకం చాలా సరళమైన భాషలో రాసారు.పాఠశాల విద్యార్థులకూ అర్ధమయ్యేంత సరళంగా ఉంది.
హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో విశాలాంధ్ర లో పుస్తకం దొరుకుతుంది.