తరుణ్ విజయ్‌కు దిమ్మతిరిగే జవాబు ఇదిగో!

 |  First Published Apr 10, 2017, 10:48 AM IST

 

సంఘ్ పరివార్‌కు చెందిన మాజీ ఎంపీ తరుణ్ విజయ్ దక్షిణాదివారిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తేనెతుట్టెను కదిపినట్లయిన సంగతి తెలిసిందే. ఉత్తర-దక్షిణ ప్రాంతవాసుల మధ్య చిరకాలంగా లోలోపల ఉన్న ఒక 'వైషమ్యాన్ని' ను తరుణ్ విజయ్ మళ్ళీ రాజేశారనే చెప్పాలి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో ఈ అంశంపై తీవ్రచర్చ జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే సంఘ్ పరివార్ మద్దతుదారులు, మిగతావారిమధ్య పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి.

Latest Videos

undefined

 

అసలు తరుణ్ విజయ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం - గత నెలలో ఢిల్లీ నొయిడా ప్రాంతంలో నైజీరియన్ విద్యార్థులపై స్థానికులు రెండు మూడు సార్లు దాడిచేసి చితకబాదారు. నైజీరియన్లు నరమాంసం తింటున్నారని స్థానికుల ఆరోపణ. మాదకద్రవ్యాలు తీసుకుంటూ నరమాంసం తినే ఈ నైజీరియన్లను దేశంనుంచి బహిష్కరించాలని డిమాండ్. ఈ ఘటనలపై అల్ జజీరా న్యూస్ ఛానల్‌లో జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో తరుణ్ విజయ్ పాల్గొన్నారు. ప్యానెల్‌లోని మరొక సభ్యుడికి సమాధానమిస్తూ, “మేము నల్లగా ఉన్న కృష్ణుడిని పూజిస్తాము. మా గాంధీజీ కూడా దక్షిణాఫ్రికాలో జాతి వివక్షను ఎదుర్కొన్నారు. వివక్షను చూపేవాళ్ళమైతే మేం దక్షిణాదివాళ్ళతో ఎందుకు కలిసిఉంటాము? మా దక్షిణాదిన ఉన్న తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రలలో నల్లవాళ్ళే ఉంటారు” అని తరుణ్ అన్నారు.

 

తరుణ్ విజయ్ దక్షిణాదివారి రంగును ప్రస్తావించటం ఇక్కడ వివాదానికి దారితీసింది. ఆయన మాటలలో ఉత్తరాది అహంకారం ధ్వనిస్తోందన్నది ఆరోపణ. దక్షిణాదివారిపట్ల ఎలాంటి తేలికభావం లేదని చెప్పాలనుకుంటే, దేశనిర్మాణంలో వారి పాత్ర, దక్షిణాది వారు నిర్వహించిన ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి ఉన్నతపదవులగురించి చెప్పిఉంటే సమస్య తలెత్తేది కాదు. దక్షిణాదివారి నలుపు రంగును ప్రస్తావించి దానిని వారి ఐడెంటిటీగా చెప్పటమే సమస్యకు కారణం. ఆయనకు నిజంగా లోలోపల దక్షిణాదివారిపట్ల గౌరవమర్యాదలు ఉంటే వారి ఉన్నత లక్షణాలు, ఉన్నతమైన విజయాలు చెప్పిఉండేవాడని, తేలికభావం ఉండబట్టే నల్లరంగు ప్రస్తావించాడని విమర్శకుల వాదన. ఎవరి గురించైనా గొప్పగా చెప్పాలనుకుంటే వారిలోని గొప్పలక్షణాలు, వారు సాధించిన విజయాలను గురించి కోట్ చేస్తారన్న వాదన సమంజసమేనని చెప్పాలి.

 

ఉత్తరాదివారికి దక్షిణాదివారంటే తేలికభావం ఉన్న సంగతి ఎవ్వరూ కాదనలేరు. ముఖ్యంగా ఢిల్లీవంటి నగరాలలో ఉండే దక్షిణాదివారికి, ఉండివచ్చిన వారికి ఈ భావన అనభవైకవేద్యమే. ఈ నాలుగు రాష్ట్రాలలోని ఎవరినైనా మద్రాసీ అనే వారు పిలుస్తారు. రాజకీయాలలో, సినిమారంగంలో, క్రీడలలో కూడా ఉత్తరాదివారి ఆధిపత్యం కొనసాగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అసలు ఉత్తరాదివారు దక్షిణాదివారికన్నా ఏవిధంగా మెరుగైనావారా అని చూస్తే ఉత్తర దక్షిణ భారతావని వాసుల జీవన ప్రమాణాల గణాంకాలు పరిశీలనలోకి వచ్చాయి. ఈ గణాంకాలను చూస్తే ఉత్తరాదివారికి దిమ్మతిరిగేలా ఉన్నాయని చెప్పాలి.

 

  1. అక్షరాస్యత శాతాలు దేశం మొత్తంలో 74 అయితే కేరళలో 93.91, తమిళనాడు 80.1, బీహార్ 61, మధ్యప్రదేశ్ 66, ఉత్తరప్రదేశ్ 67గా ఉన్నాయి.

  2. వరకట్న హత్యలలో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అగ్రస్థానంలో ఉన్నాయి.

  3. బాల్యవివాహాలు ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ, కేరళ-తమిళనాడులలో బాగా తక్కువ. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మధ్యలో ఉన్నాయి.

  4. బాలకార్మికులు సగానికిపైగా బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఉన్నారు. 20 శాతం యూపీలోనే ఉండటం విశేషం.

  5. శిశు మరణాలు అత్యల్పంగా కేరళలో 12(ప్రతి 1,000 జననాలకు), అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 59, ఉత్తరప్రదేశ్‌లో 57గా ఉన్నాయి.

  6. గర్భిణి తల్లులమృతి సంఖ్య ప్రతి లక్షమందికీ కేరళలో 61, తమిళనాడులో 79, ఆంధ్రప్రదేశ్‌లో 92గా ఉండగా, యూపీ-285, రాజస్థాన్-244, మధ్యప్రదేశ్‌-230గా ఉన్నాయి.

  7. గర్భధారణ శాతం దేశం మొత్తానికీ 2.2 ఉంటే, సిక్కిమ్‌లో 1.2, అండమాన్ నికోబార్‌లో 1.5, కేరళలో 1.6, తెలంగాణలో 1.7, ఆంధ్రప్రదేశ్-తమిళనాడులలో 1.8గా ఉంది. ఇవన్నీ సగటుకన్నా చాలా తక్కువ. రాజస్థాన్(2.4), యూపీ(2.7), బీహార్‌(3.4)లలో సగటుకన్నా ఎక్కువగా ఉంది(బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను ‘బీమారు’ రాష్ట్రాలని పిలుస్తారన్నది తెలిసిందే).

 

అయితే తరుణ్ విజయ్ గొప్ప సమైక్యవాది అని చెబుతూ సంఘ్ పరివార్ మద్దతుదారులు ఒక వాదన తీసుకొచ్చారు. ఆయనకు తమిళం అంటే ఎంతో ప్రేమ అని తమిళ భాషకు తాను దత్తపుత్రుడినని చెప్పుకుంటారని పేర్కొంటున్నారు. తమిళులు ఎంతో అత్యున్నతంగా పరిగణించే తిరుక్కురళ్ గ్రంథాన్ని ఈయన ఎంతో ప్రేమిస్తారని, తమిళ భాషకు జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో పోరాడారని చెబుతున్నారు.. హరిద్వార్‌లో గంగానది ఒడ్డున తిరుక్కురళ్ రచయిత తిరువళ్ళువార్ విగ్రహాన్ని స్థాపింపజేశారని వాదిస్తున్నారు.


ఏది ఏమైనా తరుణ్ విజయ్ వ్యాఖ్యలు ఉత్తరాదివారిలో అంతరాంతరాలలో దక్షిణాదిపట్ల ఉన్న తేలికభావాన్ని మరోసారి గుర్తుచేశాయి. అయితే ఆభిజాత్యాన్ని పక్కనపెట్టి వాస్తవాలను గమనిస్తే జీవన ప్రమాణాలలో వారు ఎంత వెనకబడిఉన్నారో తేటతెల్లంగా తెలుస్తోంది. వారికి ఈ విషయం అర్థమవ్వాలని కోరుకుందాం.

(With inputs from Dr  Mythili Abbaraju)

click me!