''చంద్రబాబు డైరెక్షన్ లోనే పిల్లసేన లాంగ్ మార్చ్...పవన్ కు రెమ్యునరేషన్...''

By Arun Kumar PFirst Published Nov 2, 2019, 8:06 PM IST
Highlights

ఇసుక కొరత పేరుతో జనసేన విశాఖలో చేపడుతున్న లాంగ్ మార్చ్ పై వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఫైర్ అయ్యారు. ఈ తతంగమంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతోందని ఆరోపించారు. 

అమరావతి: టిడిపి పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్‌ఆర్‌‌సిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. ఇసుకకు సంబంధించి ఈ రాష్ట్రంలో తాత్కాలిక ఇబ్బంది వుంది అనేది అందరికీ తెలిసిందేనని...కానీ దానికి కారణాలు ఏమిటీ అనేది ప్రతిపక్ష పార్టీలకి అర్ధం కాకపోవడం బాధాకరమన్నారు.

కృత్రిమంగా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వమే ఇసుక కొరతను సృష్టించదనే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డాయి. ఈ రోజు రాష్ట్రంలోని నదులు ఏ రకంగా ప్రవహిస్తున్నాయో ప్రజలకు తెలుసన్నారు.  పొంగిప్రవహిస్తున్న నదుల నుంచి ఇసుకను తవ్వి తీయడం సాద్యం కాదని ప్రజలకు తెలుసన్నారు.

ఒక్కసీటు గెలిచిన చిన్నపిల్ల సేనకు, ఇరవై మూడు సీట్లు గెలిచిన ఇంకుడు గుంతల దేశంకు ఈ విషయం తెలియడం లేదా? అని ప్రశ్నించారు. ఇసుక కోసం అంటూ పవన్‌ లాంగ్ మార్చ్ కు పిలుపునివ్వడం విడ్డూరంగా వుందన్నారు.  పవన్‌ కళ్యాణ్ సినిమాల్లో నటించేప్పుడు అనేక బ్యానర్లు, ప్రోడక్షన్‌ లలో పనిచేశారని కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత నారా వారి ప్రోడక్షన్‌ లోనే ఆయన ప్యాకేజీలు నడుస్తున్నాయని సెటైర్లు విసిరారు.

read more  లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు రెడీ...కావాలనే దుష్ప్రచారం..: నాదెండ్ల

పవన్ సినిమాలు ఎందుకు మానేశారో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదని....ఆయన కాల్ షీట్ ల కోసం పెద్దపెద్ద ప్రోడ్యూసర్లు తిరుగుతున్నా పట్టించకోలేదన్నారు.  అయితే చంద్రబాబు ఇచ్చే రెమ్యునరేషన్‌  కంటే ఇవేవీ ఎక్కువ కాదు కాబట్టే సినిమాలను వదులుకున్నాడని అని అర్ధం అవుతోందన్నారు. పవర్ స్టార్‌ నుంచి పవన్ ప్యాకేజీ స్టార్‌ గా మారిపోయారన ఎద్దేవా చేశారు. 

ఇసుకను జాతీయ సమస్యగా చిత్రీకరించి, రాజకీయంగా లబ్దిపొందాలని చూడటం బాధాకరమని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో జగన్‌ ముఖ్యమంత్రి అయితే తన పేరు పవన్‌ కళ్యాణ్‌ కాదు అని బహిరంగంగా చెప్పారని... ఆయన కొత్తపేరేమిటో చెప్పాలని అన్నారు. పేరును నారా పవన్‌ కళ్యాణ్‌ అని మార్చుకుంటారా?అని ప్రశ్నించారు.

విశాఖలో లాంగ్ మార్చ్ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో  అర్థం కావడంలేదన్నారు. రేపు జరిగే లాంగ్ మార్చ్ జనసేనకు లాస్ట్ మార్చ్ అవుతుందన్నారు. ఎన్నికల్లో పరాజయం చెందిన తరువాత గాజువాక ప్రజలకు కనీసం ఏ ఒక్కరోజు అయినా కృతజ్ఞతలు తెలిపారా? జనసేన ఎందుకు ఓడిందనే సమీక్షా సమావేశం ఏనాడైనా విశాఖలో పెట్టారా? ఈ సమావేశం పెట్టి వుంటే... మీ పార్టీ పరిస్థితి ఏమిటో తెలిసేదని అన్నారు.

read more మీడియా ఆంక్షలపై ప్రకటనల ఎఫెక్ట్: రామచంద్రమూర్తి, అమర్‌లపై వర్ల రామయ్య ఫైర్

 విశాఖ జిల్లాకు చెందిన కీలకనేత బాలరాజు గారు జనసేనను వదులుతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయని.. సైన్యం జారిపోతున్నా పట్టించుకోకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబేనని అన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని  అన్నారు.

 దేశంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని వర్గాలకు వైఎస్‌ఆర్ సిపి ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు.  ఒక్క ఎపిలోనే కాకుండా పక్కరాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.  మీరు ఉద్దానం... ఉద్దానం అని తిరిగి ఏం ఉద్దరించారు...? అటువంటి ఉద్దానంకు సిఎం అయిన యాబై రోజుల్లోనే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారని అన్నారు.
 
కేవలం రాజకీయ లబ్దికోసమే మీరు లాంగ్ మార్చ్ అంటున్నారని... గత అయిదేళ్లలో ఇసుక దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు టిడిపి నుంచి లాంగ్ మార్చ్ లో పాల్గొంటునడం  విడ్డూరంగా వుందన్నారు. ఇసుక మాఫియా డాన్ అచ్చెన్నాయుడు, డ్రగ్‌ మాఫియా డాన్‌ అయ్యన్నపాత్రుడు, లిక్కర్ మాఫియా డాన్‌ లను పక్కన పెట్టుకుని లాంగ్ మార్చ్ చేస్తారా?  మహనీయుల పేర్లు చెబుతారు... గొప్ప పుస్తకాలు చదివానంటారు...- మీరు చేసే పనులకు వీటికి ఏమైనా పొంతన వుందా అని పవన్‌ కళ్యాణ్‌ ను అమర్ నాథ్ ప్రశ్నించారు.


 

click me!