ఇంటింటికి నాన్ వెజ్: మీట్ ఆన్ వీల్స్ వాహనాన్ని ప్రారంభించిన హరీశ్

By Siva KodatiFirst Published Dec 10, 2019, 9:51 PM IST
Highlights

సిద్ధిపేట రైతు బజారులో ఇర్కోడ్ మహిళా సమాఖ్య ఫుడ్స్ ఆధ్వర్యంలో నెలకొల్పిన మీట్ ఆన్ వీల్స్ వాహనాన్ని మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు.

సిద్ధిపేట రైతు బజారులో ఇర్కోడ్ మహిళా సమాఖ్య ఫుడ్స్ ఆధ్వర్యంలో నెలకొల్పిన మీట్ ఆన్ వీల్స్ వాహనాన్ని మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ మాంస పరిశోదన సంస్థ -సెర్ఫ్ సంయుక్త సహకారంతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశం కల్పించేందుకు.... హైదరాబాదులోని సంస్థ ఇర్కోడ్ గ్రామ మహిళలకు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇచ్చిందని వెల్లడించారు.

ఇర్కోడ్ గ్రామ మహిళలకు మాంసం పచ్చళ్లు, మాంసం ఆహార పదార్థాలు క్రయ విక్రయాలు జరిపేందుకు రైతు బజారులో స్టాల్ ఏర్పాటు చేసుకున్నామని హరీశ్ వెల్లడించారు. తొక్కులు అన్నీ చోట్ల ప్రజలకు అందుబాటులో లభించేలా ప్రత్యేక " మీట్ ఆన్ వీల్స్ " వాహనాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు.

ప్రతి రోజు ఉదయం ఈ వాహనం నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలు, పట్టణంలోని అన్నీ కాలనీల్లోకి వెళ్లి తాజా మాంసం, చికెన్, ఇతర మాంసం ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి రోజు సాయంత్రం కోమటి చెరువు, బస్టాండు, జనవాసా రద్దీ ప్రాంతాల్లో ఈ మాంసం ఉత్పత్తులు అమ్మడం జరగుతుందని హరీశ్ స్పష్టం చేశారు.

మన రాష్ట్రంలో నూటికి 90 మంది మాంసం తింటారని, సెర్ఫ్ సహకారంతో మహిళలకు అదనంగా ఆదాయ వనరులు పొందుతారని ఈ అవకాశం కల్పించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మటన్ పచ్చడిని కొనుగోలు చేసి రుచి చూశారు. 

ఇర్కోడ్ మహిళా సమాఖ్య ఫుడ్స్ ధరల పట్టిక : 

- చికెన్ నగేట్స్ - రూ.80
- చికెన్ సమోసా- రూ.80
- చికెన్ పకోడి - రూ.80
- చికెన్ వింగ్స్ - రూ.100
- మటన్ పచ్చడి (230 గ్రా) - రూ.300
- చికెన్ పచ్చడి (230 గ్రా) - రూ.240
- మీట్ బాల్స్ - రూ.80
- ఎన్ రోబుల్ ఎగ్స్ - రూ.30

ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జాతీయ మాంస పరిశోధన సంస్థ డైరెక్టర్ వైద్య నాథన్, సీనియర్ శాస్త్రవేత్త బస్వారెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త రామకృష్ణ, సెర్ఫ్ డైరెక్టర్ అనంతం, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, డీఆర్డీఏ సిబ్బంది, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

click me!