సొంత నియోజకవర్గంలోనే జగన్ పరిస్థితి ఇదీ... ఇక రాష్ట్రంలో...: టిడిపి ఎమ్మెల్యే

By Arun Kumar PFirst Published Dec 11, 2019, 6:06 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాయలసీమలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిపై అసెంబ్లీలో చేసిన కామెంట్స్ పై టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పందించారు.  

విజయవాడ:  కృష్ణానదికి పెద్దఎత్తున వరద వచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఏకంగా 798టీఎంసీల కృష్ణాజలాలు వృథాగా సముద్రం పాలవ్వడానికి జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. 

బుధవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. వరద నీటితో రాయలసీమలోని జలాశయాలు, రిజర్వాయర్లు నింపడానికి అవకాశమున్నప్పటికీ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయలేదన్నారు. కానీ ఇప్పుడేమో అసెంబ్లీలో ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తోందని నిమ్మల మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో కృష్ణాజలాల వినియోగంపై తెలుగుదేశం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం జారుకుందన్నారు. 

చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కరవుసీమని సస్యశ్యామలం చేయడానికి, 25లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి అనేకప్రాజెక్టులు చేపట్టిందన్నారు. గండికోట రిజర్వాయర్‌లో 22.85టీఎంసీలు నిల్వచేసే సామర్థ్యమున్నప్పటికీ కేవలం 12టీఎంసీలు మాత్రమే నిల్వచేసినట్లు స్వయంగా రాష్ట్రమంత్రి చెప్పడం ఈ ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతోందన్నారు. 

గండికోట నిర్వాసితులకు చంద్రబాబు 6.5 లక్షలే ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇచ్చారని గతంలో జగన్ ఆరోపించారు. కానీ తాను అధికారంలోకి వస్తే రూ.10లక్షలిస్తానని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. ఈ ఏడాది గండికోటలో 20టీఎంసీలు నిల్వ చేస్తానని గతంలో జమ్మలమడుగు సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పారని గుర్తుచేశారు. కానీ అలా చేయకుండా మాటతప్పాడని అన్నారు.

read more చంద్రబాబు సభలోనే వుండాలని మనస్పూర్తిగా కోరుకున్నా...కానీ: వైఎస్ జగన్

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గండికోట రిజర్వాయర్‌కి రూ.700కోట్లు ఖర్చుచేసిందని తెలిపారు. అలా తాము 12టీఎంసీలు నిల్వచేసేలా చేస్తే జగన్‌ సర్కారు ఆర్‌ అండ్‌ ఆర్‌కి రూ.1000కోట్లు విడుదల చేయలేక నీటిని సముద్రంపాలు చేసిందన్నారు.  

ఇక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 10టీఎంసీలైతే కేవలం 6.8టీఎంసీల నిల్వతోనే జగన్‌ ప్రభుత్వం సరిపెట్టిందని రామానాయుడు తెలిపారు. కేవలం రూ.50కోట్ల నిధులిచ్చిఉంటే చిత్రావతి రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీటినిల్వ సాధ్యమయ్యేదన్నారు. 

గోరకల్లు రిజర్వాయర్‌ సామర్థ్యం 12టీఎంసీలైతే కేవలం 6.7టీఎంసీల నీరు మాత్రమే దానిలో ఉంచారన్నారు. 17టీఎంసీలు నిల్వచేసే బ్రహ్మంసాగర్‌లో 6.5టీఎంసీలు మాత్రమే నిల్వ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా అనంతపురంలో 1300 చెరువులంటే  వైసీపీ  ప్రభుత్వం కేవలం 54చెరువుల్ని మాత్రమే నింపిందన్నారు. 

read more అత్యాచారానికి పాల్పడితే మరణిశిక్షే...ఏపి కేబినెట్ సంచలన నిర్ణయం

అదేజిల్లాలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడి ప్రభుత్వం 2016లో 112చెరువులు, 2017లో 118చెరువులు, 2018లో 107 చెరువులు నింపి జిల్లావాసులకు సాగు, తాగునీటి సమస్య లేకుండా చేసిందని రామానాయుడు పేర్కొన్నారు. వర్షాలుపడి, వరదలు వచ్చినా కూడా వైసీపీ ప్రభుత్వం కేవలం 54చెరువులతో సరిపెట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వ చేతగానితనం, అసమర్థత వల్లే కృష్ణాజలాలు వృథాగా సముద్రం పాలయ్యాయని రామానాయుడు  ఆరోపించారు. 

 
 

click me!