పబ్జీ ఆడకుండా తల్లి ఫోన్ లాక్కుందని.. బాలుడు ఆత్మహత్య

By telugu team  |  First Published Sep 11, 2019, 4:56 PM IST

పబ్‌జీ గేమ్‌కు బానిసైన లోహిత్‌ చదువును నిర్లక్ష్యం చేస్తుండడంతో తల్లి త్రివేణి గత నెల 20న మందలించి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు చీమలమందు నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.


పబ్జీ గేమ్ మరో బాలుడి ప్రాణాలు తీసింది. ఇప్పటికే ఈ గేమ్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా విశాఖలో మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.  పూర్తి వివరాల్లోకి వెళితే... విశాఖపట్నంలోని పెదగంట్యాడ సమీపంలోని చినకోరాడ ప్రాంతంలో నివాసముంటున్న బోయి వెంకటరమణ, త్రివేణి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు బోయి లోహిత్‌ (14) స్థానికంగా ఓ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. పబ్‌జీ గేమ్‌కు బానిసైన లోహిత్‌ చదువును నిర్లక్ష్యం చేస్తుండడంతో తల్లి త్రివేణి గత నెల 20న మందలించి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుంది.

దీంతో మనస్తాపానికి గురైన బాలుడు చీమలమందు నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన షీలానగర్‌లోని ఆస్పత్రి తరలించారు. మూడు రోజలు చికిత్స అనంతరం మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం నగరంలోని మరో  ఆస్పత్రిలో చేర్పించారు. 14 రోజలు చికిత్స అనంతరం బాలుడు పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాలుడు మృతిచెందాడు. దీంతో బాలుడి మేనమామ పులి సూరిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో న్యూపోర్టు సీఐ పైడా అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ అప్పలనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos

click me!