ఆడపిల్లల మాన ప్రాణాలంటే పవన్ కు ఇంత చులకనా...: మంత్రి పుష్ప శ్రీవాణి ఫైర్

By Arun Kumar P  |  First Published Dec 4, 2019, 4:31 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  దిశా హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించకుండా రెండు దెబ్బలు మాత్రమే వేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనడాన్ని ఏపి డిప్యూటి సీఎం పుష్ప శ్రీవాణి తప్పుబట్టారు.   


అమరావతి: రేపిస్టులను కఠినంగా శిక్షించకుండా కేవలం బెత్తంతో రెండు దెబ్బలు కొడితే సరిపోతుందంటూ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆడపిల్లల మాన ప్రాణాలంటే ఆయనకు ఇంత చులకనా అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.  

రేపిస్టుల వ్యవహారంపై పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, ఆగ్రహాన్ని కలిగించేలా వున్నాయన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఓ పార్టీ అధ్యక్షుడైన పవన్ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆడపిల్లల ప్రాణం, మానం అంటే పవన్ కి ఇంత చిన్న చూపా..? అని నిలదీసారు. 

Latest Videos

రేపిస్టులను బెత్తంతో కొట్టి వదిలేయాలన్న పవన్ వ్యాఖ్యానించడాన్ని చూస్తే ఆయనకు మహిళలంటే ఎంత చులకన భావనో స్పష్టమౌతోందని అభిప్రాయపడ్డారు. భారత గడ్డ మీద పుట్టిన ప్రతీ మనిషి, ప్రతీ మహిళా దిశా ఘటన తరువాత ఒక్కటై హత్యాచారం చేసిన వాళ్లకు కఠినమైన శిక్షలు పడాలని నినదిస్తున్నారని చెప్పారు.  

read more  దిశపై అఘాయిత్యం... నిందితులకు కఠిన శిక్ష పడకూడదనే పవన్ ఆలోచన: ఏపి హోంమంత్రి

ఇలా దేశవ్యాప్తంగా నిందుతులను తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం రేప్ చేసిన వారిని బెత్తంతో కొట్టి వదిలేయమంటారా...? ఓ బాధ్యతగల రాజకీయ పార్టీ అధ్యక్షుడు మహిళలంటే ఇంత చులకన భావంతో మాట్లాడటం సహించరాని విషయమని దుయ్యబట్టారు. 

పవన్ వ్యాఖ్యలు మహిళలందరి మనోభావాలను దెబ్బతీశాయని, ఇలాంటి వాళ్లు మన రాజకీయ నాయకులా...? అని మహిళలంతా మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తక్షణమే ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పుష్ప శ్రీవాణి డిమాండ్ చేసారు. 

read more అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి...వెంటనే శిక్షించిన న్యాయస్థానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ఆడపిల్లా దిశలా కిరాతకులకు బలైపోకుండా చర్యలు తీసుకుంటున్నారని  శ్రీవాణి అభిప్రాయపడ్డారు. 

  
 

click me!