అందువల్లే ఇసుక కొరత...: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

By Arun Kumar PFirst Published Oct 22, 2019, 8:09 PM IST
Highlights

రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్షాలు చేపడుతున్న నిరసనలు ప్రజల కోసం కాదని...రాజకీయ  ప్రయోజనాల కోసమే చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 

అమరవతి: ప్రతిపక్షాలు ఇసుక ఇసుక కొరతపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కొంతమేర కొరత వున్న మాట వాస్తమేనని...కానీ దీనివల్ల రాష్ట్రం మొత్తం స్తభించిపోయినట్లు ప్రచారం చేయడం తగదన్నారు. అందరికంటే ప్రజలు చాలా తెలివైనవారని...అందువల్లే గత ఎన్నికల్లో అసత్యాలు ప్రచారం చేసేవారికి తగిన విధంగా గుణపాఠం చెప్పారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలందరికి ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకే నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. కానీ ఎపుడూ లేని విధంగా కృష్ణా, గోదావరి, పెన్నాకు వరదలు వచ్చాయి కాబట్టే ఇసుక తవ్వకాలకు ఆటంకం ఏర్పడిందన్నారు.

అయితే గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేసిందని...జగన్ అధికారంలోకి వచ్చిరాగానే అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయన్నారు. ఇది శుభపరిణామమే అన్నారు.   

ఇసుక దోపిడీ ,అవినీతి పాలన వలనే చంద్రబాబు ఓడిపోయాయిన విషయాన్ని మరిచిపోయినట్లున్నారని  ఎద్దేవా చేశారు. ఆయనలా కాకుండా ప్రజలకు చిత్తశుద్దితో సేవ చేయాలని ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో మొత్తం 10 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉందని... కానీ  కేవలం 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక  మాత్రమే  సంవత్సరానికి రాష్ట్ర అవసరాలకు సరిపోతుందున్నారు. కాబట్టి కాస్త ఆలస్యమైనా అందరికీ ఇసుక లభిస్తుందని భరోసా ఇచ్చారు.

ఇప్పటికే అత్యవసర తవ్వకాలు చేపట్టి 36 వేల మందికి 6 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందించామన్నారు. వరదల తగ్గిన తర్వాత పారదర్శకంగా అందరికి ఇసుక అందిస్తామని హామీ ఇచ్చారు.

కొందరు తమ రాజకీయాల కోసం కావాలని ఇసుక కొరతపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.భవిష్యత్ లో రోజుకి లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక అందించాలని లక్ష్యం పెట్టుకున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను ప్రజలు కూడా అర్థం చేసుకుంటారన్న నమ్మకం వుందని రామచంద్రారెడ్డి అన్నారు.

ఇటీవలే ఇసుక కొరతపై టిడిపి నాయకులు కొల్లు రవీంద్ర దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఇది సాధారణంగా ఏర్పడిన కొరత కాదని సాక్షాత్తు ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరతేనని ఆరోపిస్తూ ఆయన దీక్ష చేపట్టారు. ఆ తర్వాత టిడిపి మహిళ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇసుక కొరతపై నిరాహార దీక్ష చేపట్టారు. ఇలా ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఈ ఇసుక కొరతపై నిరసనలు చేపడుతున్నాయి. 

click me!