మాజీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తన పరధిని దాటిమరీ ఇతర శాఖల్లో వేలుపెట్టారని మంత్రి ఆళ్ల నాని ఆరోపించారు. ఆయన వైద్యారోగ్య శాఖలో భారీ స్కామ్ కు పాల్పడినట్లు ఆరోపించారు.
అమరావతి: మాజీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తనకు ఏమాత్రం సంబంధంలేని వైద్యారోగ్య శాఖలో భారీ స్కామ్ కు పాల్పడ్డారని మంత్రి ఆళ్లనాని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన సభలో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రజారోగ్యంపై చర్చ జరిగింది. మరీముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యపరికరాల నిర్వహణకు మెడాల్ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడంలో ఆనాటి ఐటీ మంత్రి లోకేష్ పాత్ర ఉందని వైసీపీ నాయకులు ఆరోపించారు. గత ఐదేళ్లలో లోకేష్ రూ.250 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను టిడిపి నాయకులు ఖండించారు. అధికారంలో మీపార్టే వుంది కదా... దమ్ముంటే విచారణ జరుపుకొండని అన్నారు. దీనికి మంత్రి ఆళ్ల నాని సమాధానం చెబుతూ... దమ్మున్న ప్రభుత్వం కాబట్టే విజిలెన్స్ విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
read more మంగళగిరిలో టీడీపీ ఆఫీస్‌కు చిక్కులు: హైకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్
ఇదే అంశంపై నరసరావుపేట వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వ హాయంలో వైద్య రంగంలో సంవత్సరానికి ఒక విభాగంలోనే 50కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఏ టెస్టు చేసినా రూ.235 తీసుకుంది మెడాల్ సంస్థ ఖాతాలో చేరేదని... చిన్న చిన్న సీబీపీ బ్లడ్ టెస్టు, బ్లడ్, షుగర్ టెస్ట్ లాంటివి చేసినా రూ.230 వసూలు చేసారని అన్నారు. ఇవే టెస్టులకు అపోలో ల్యాబ్ లో రూ.50 తీసుకుంటారని అన్నారు.
తిరుపతిలోని ఒక్క రుయా ఆసుపత్రిలోనే ల్యాబ్ టెస్టుల్లో 45 కోట్ల రూపాయిల స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. సీఎం జగన్ దీనిపై విచారణ జరిపించాలని కోరారు. గత ప్రభుత్వ అధినేతల ఆద్వర్యంలో ఎన్ని కోట్లు స్కామ్ జరిగిందో దర్యాప్తు చేసి లెక్క తేల్చాలని సూచించారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పీహెచ్‌సీల్లో, ఏరియా ఆసుపత్రులు, సబ్ సెంటర్సులో ప్రభుత్వమే ఆటోమేటిక్ ఎనలైజర్సుతో ఎక్విప్ మెంట్ కొంటే అంతా కలిపి 120 కోట్లు ఖర్చయిందని తెలిపారు. గత ప్రభుత్వం సంవత్సరానికి 120 కోట్లు ఇచ్చారని... అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టెస్టులు చేయించడానికి ఈ మొత్తం సరిపోతుందని అన్నారు.
read more
అదనంగా అయ్యే ఖర్చు ల్యాబ్ టెక్నీషియన్సు, ఎనలైజర్, లిక్విడ్ ఎక్విప్ మెంట్స్ అవుతుందన్నారు. అది 10 శాతం కూడా ఖర్చుండదని తెలిపారు. దీనికోసం వీళ్లు ఇప్పటికి 600 కోట్లు దోచిపెట్టారని...మెడాల్ సంస్థలో లోకేష్ పాత్ర ఉందని ఆరోపించారు. నారా లోకేషే దీన్ని సబ్ లీజుకి ఇచ్చారని తెలిపారు.
సంవత్సరానికి 50 కోట్లు చొప్పున దోచుకున్నారని...ఐదేళ్లకి గాను 250 కోట్లు ఇందులో దోచుకున్నారని వెల్లడించారు. దీనిపై కూడా నిజాలు తేల్చాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరుతున్నానని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.