దేవరగట్టు కర్రల సమరం ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

By Siva KodatiFirst Published Oct 3, 2019, 9:03 PM IST
Highlights

కర్నూలు జిల్లా దేవరగట్టు లో మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో  కర్రల సమరాన్ని నివారించడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ అధికారులను ఆదేశించారు

కర్నూలు జిల్లా దేవరగట్టు లో మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో  కర్రల సమరాన్ని నివారించడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో బన్నీ ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 5 నుండి 9 వరకు దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో దాదాపు లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవరగట్టు ఆలయ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం, లైటింగ్, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్లు, విద్యుత్ సరఫరాలను ఏర్పాటు చేయాలని వీరపాండియన్ సూచించారు.

కర్రల సమరంలో గాయపడిన భక్తులకు వెంటనే వైద్య చికిత్సలు అందించేందుకు 20 పడకల ఆసుపత్రి, వైద్య బృందాలు, అంబులెన్సులు ఏర్పాటు చేసుకోవాలని అడిషనల్ డిఎంహెచ్ఓ ను ఆయన ఆదేశించారు.

దేవరగట్టు ఆలయానికి పది కిలోమీటర్ల పరిధిలో  మద్యం షాపులు మూసివేయడంతో పాటు అక్రమ నాటుసారా స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహించాలని కలెక్టర్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పి ఫకీరప్ప మాట్లాడుతూ కర్రల సమరంలో పాల్గొనే ప్రధాన వ్యక్తులను గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆలూరు, హాలహర్వి, ఆస్పరి ,చిప్పగిరి చుట్టుపక్కల గ్రామాలలో కర్రల సమర అనాగరిక చర్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు.

అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్,  చెక్పోస్టులు పటిష్టం చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. దేవరగట్టు ఆలయ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీక్షిస్తామని కలెక్టర్‌కు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ జయరామిరెడ్డి, విధ్యుత్ ఎస్ ఈ భార్గవరాముడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ, పంచాయతీ రాజ్ ఇంజనీర్లు, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

click me!