జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అధినేత పవన్ కల్యాణ్ పై తిరుగుబాటు చేశారు. ఇటీవల రాపాక పార్టీ మారతారంటూ వార్తలు రాగా దాన్ని నిజంచేసేలా తాజాగా వ్యవహరించారు.
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీపై తిరుగబడ్డారు. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గెలిచిన ఎమ్మెల్యేకు ఓడినవారు షోకాజ్ నోటీసులు ఇవ్వడమేంటని రాపాక ప్రశ్నించారు. పార్టీతరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పట్ల ఇలా వ్యవహరించడం మంచిదికాదని...అది కూడా ఓడిపోయిన వారు చేయడం మరీ విచిత్రంగా వుందని రాపాక మండిపడ్డారు.
''నేను గెలిచిన ఎమ్మెల్యేను...పార్టీలో వున్న మిగతావాళ్లంతా ఓడిపోయిన వారు. వాళ్లు నాకు షోకాజ్ నోటీసులు జారీచేయడం విచిత్రంగా వుంది. పార్టీ మీద ఏదైనా అధికారం అనేది ఉంది అంటే నాకు మాత్రమే ఉంది. జనసేన పార్టీ వల్ల, ఆ కార్యకర్తలు వల్ల నేను గెలవలేదు. నేను ఎవరి భిక్షతోనో ఎమ్మెల్యేను కాలేదు'' అంటూ రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు.
undefined
video: మీడియా స్వేచ్చను కాపాడండి... గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు
''నేను కేవలం నా సొంత శక్తితోనే ఎమ్మెల్యేగా గెలిచాను తప్ప నాకు ఎవరి భిక్షా అవసరం లేదు. అంతగా నన్ను గెలిపించే వాళ్లే అయితే ఆయన ఎందుకు ఓడిపోయారు. అదీ రెండు చోట్లా. ముందు ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి'' అంటూ పవన్ పై విరుచుకుపడ్డారు.
''నన్ను ఆయన సస్పెండ్ చేయడం ఏంటి? ఈ మాట చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. దిశానిర్దేశం లేని పార్టీలో ఉండటం నాకే ఇష్టం లేదు. నేను రాజీనామా చేసి మళ్ళీ గెలిచే శక్తి నాకు ఉంది. కానీ ఆయనకు రాష్ట్రంలో ఎక్కడైనా గెలిచే సత్తా ఉందా అని అడుగుతున్నా. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు, షోకాజ్ నోటీసులు అంటూ చెత్త ప్రకటనలు చెత్త పేపర్లలో విడుదల చేస్తే నేనేం చేయాలో నాకు తెలుసు'' అంటూ రాపాక ఫైర్ అయ్యారు.
డిగ్రీ చదివాను... అయినా నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు: మహిళా మంత్రి ఆవేదన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎమ్మెల్యే రాపాక ఇప్పటికే ఓ ఝలక్ ఇచ్చారు. రైతు సమస్యలపై పవన్ కల్యాణ్ చేపట్టిన దీక్షకు ఆయన డుమ్మా కొట్టారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని సమర్థించి పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్ కు దీక్షకు డుమ్మా కొట్టిన రాపాక దానికి శాసనసభ సమావేశాలను సాకుగా చూపించారు. కాకినాడలో జరుగుతున్న పవన్ కల్యాణ్ దీక్షకు శాసనసభ సమావేశాల కారణంగానే వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆంగ్ల మాధ్యమం విషయంలోనే కాకుండా మరో అంశం విషయంలో కూడా రాపాక వరప్రసాద్ పవన్ కల్యాణ్ తో విభేదించారు. దిశ అత్యాచారం, హత్య ఘటనపై పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఆయన విభేదించారు. దిశ కేసు నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలు అని పవన్ కల్యాణ్ అనడాన్ని ఆయన వ్యతిరేకించారు. దేశం మొత్తం కఠిన శిక్ష వేయాలని కోరితే పవన్ మాత్రం బెత్తం దెబ్బలు చాలు అని అన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం మంచి పనులు చేస్తే సమర్థిస్తానని రాపాక వరప్రసాద్ చెప్పారు. ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో మండిపోయిన రాపాక ఒక్కసారి తిరుగుబాటు చేశారు.