ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖలో కరోనా వైరస్ కలవరం మొదలయ్యింది. ఓ పోలీస్ కానిస్టేబుల్ కొడుకులో ఈ వైరస్ లక్షణాలు బయటపడటమే ఈ కలవరానికి కారణమయ్యింది.
కర్నూలు: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలోనూ మెల్లగా విజృంభిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోకి ఈ వైరస్ ప్రవేశించింది. ఇలా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు బయటపడ్డాయి. తాజాగా ఏపిలోని కర్నూల్ జిల్లాకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తనయుడు ఈ కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని వెంటనే అతన్ని ఐసోలేషన్ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే అతడు విదేశాల నుండి వచ్చినట్లు సమాచారం.
అయితే అతడి విదేశాల నుండి వచ్చినప్పటి నుండి కుటుంబంతో కలిసి వున్నాడు. ఇప్పుడు అతడికి లక్షణాలు బయటపడటంతో కుటుంబ సభ్యులకు కూడా ఈ వైరస్ సోకివుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కానిస్టేబుల్ విధులు నిర్వర్తించే జిల్లా పోలీస్ కార్యాలయంలో కలకలం మొదలయ్యింది. సదరు కానిస్టేబుల్ తో సన్నిహితంగా వుండే సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
undefined
ఏపీలో కలకలం... ఏలూరులో మరో కరోనా అనుమానిత కేసు
కొవిడ్ -19(కరోనా) వైరస్ నిరోధక చర్యలపై ఏపి వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 బాధితుడు(పాజిటివ్) కోలుకుంటున్నాడని...14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్ ను పరీక్షించి డిస్చార్జ్ చేస్తామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దన్నారు. అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మాస్కులు , శానిటైజర్ల కొరత రాకుండా చూస్తున్నామన్నారు.కొవిడ్-19 వైరస్ నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంపై నిరంతరం సమీక్షిస్తున్నామని... ఎవ్వరూ ఆందోళన పడొద్దన్నారు. కొవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని జవహర్ రెడ్డి సూచించారు.
ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని... వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని సూచించారు. కొవిడ్ -19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 840 మంది ప్రయాణికుల్ని గుర్తించామని...560 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 250 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు. మరో 30 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారని వెల్లడించారు.
విజృంభిస్తున్న కరోనా మహమ్మారి... చంద్రబాబుకు పరీక్షలు
92 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 75 మందికి నెగటివ్ వచ్చిందని...16 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కొవిడ్-19 ప్రభావిత దేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. బయటికి వెళ్లకపోవడమే కాదు కుటుంబ సభ్యులు, ఇతరులతో కూడా కలవకూడదన్నారు. అవసరమైతే 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలని జవహర్ రెడ్డి సూచించారు.
విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలో కొవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కొవిడ్-19ను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అంటు వ్యాధుల చట్టం-1897ను నోటిఫై చేశామన్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులకు మరిన్ని అధికారాలు లభించాయని జవహర్ రెడ్డి వెల్లడించారు.