ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. స్థానికంగా జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి వర్గీయులు భాహాభాహీకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
చీరాల: ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ''వైఎస్సార్ నవశకం'' కార్యక్రమంలో భాగంగా స్థానిక టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం, వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు భాహాభాహీకి దిగారు. దీంతో ఒక్కసారిగా నియోజకర్గ కేంద్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
నియోజకర్గ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ఆమంచి కృష్ఱమోహన్ కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో వారివెంట వచ్చిన అనుచరులు, కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయం కిక్కిరిసిపోయింది.
అయితే హటాత్తుగా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కరణం బలరాం ప్రసంగాన్ని ఆమంచి వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఈ ఉద్రిక్తతకు కారణమయ్యింది.
read more సీఎం జగన్ మాటలనే మంత్రి అనిల్ తప్పుబడుతున్నాడు...: దేవినేని ఉమ
ఆమంచి వర్గీయులు బలరాం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టిడిపి శ్రేణులు కూడా ఆమంచికి, వైసిపి కి వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. ఈ విషయం తెలిసి ఇరువర్గాల నాయకులు మున్సిపల్ కార్యాలయానికి పెద్దఎత్తున చేరుకుంటుండటంతో వాతావరణం చేయిదాటేలా కనిపించింది.
అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అక్కడినుండి చెదరగొట్టారు. పరిస్థితి మరింత చేయిదాటకుండా వుండేందుకు ప్రత్యేకంగా మరింత బలగాలను మొహరించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యప్తంగా వైసిపి గాలి వీయగా చీరాలలో మాత్రం టిడిపి హవా కొనసాగింది. వైసిపి అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై టీడీపీ అభ్యర్థి కరణం బలరాం 17,801 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడదామకున్నా అది సాధ్యపడలేదు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఓటమి పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు.
ఎన్నికలకు ముందే వైయస్ జగన్ కేబినేట్ లో మంత్రి పదవి కూడా ఖాయమంటూ ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి తరుణంలో ఆయన ఆశలను ఆవిరి చేస్తూ ఓటర్లు తీర్పునిచ్చారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాంకు పట్టం కట్టారు.