
ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా అందుకు తగ్గట్లుగానే ఆడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతూ ఇప్పటివరకు అసలు ఓటమన్నదే ఎరుగకకుండా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తోంది. అయితే ఓవరాల్ గా జట్టు ప్రదర్శన విషయంలో ఎలాంటి సమస్యలు లేకున్నా...కొందరు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన విషయంలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ళు తరచూ విఫలమవడంతో టీమిండియా తక్కువ పరుగులకే పరిమితమవ్వాల్సి వస్తోంది. గత రెండు మ్యాచుల్లోనూ బ్యాటింగ్ వైఫల్యంతో తక్కువ స్కోరుకే పరిమితమైనా బౌలర్లు టీమిండియాను గట్టెక్కించారు. దీంతో బ్యాట్ మెన్స్ ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ పై సచిన్, మంజ్రేకర్ వంటి క్రికెట్ దిగ్గజాలే కాదు అభిమానులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా మొదటి నుండి టీమిండియాకు సమస్యగా మారిన నాలుగో స్థానంలో విజయ్ శంకర్ బ్యాటింగ్ దిగి విఫలమవుతూ వస్తున్నాడు. శిఖర్ ధవన్ గాయం కారణంగా ప్రపంచ కప్ కు దూరమవడంతో విజయ్ కి తుది జట్టులో చోటు దక్కింది. కానీ ఇలా అందివచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. పాక్ మ్యాచ్ లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన ఇతడు కేవలం 15 పరుగుల మాత్రమే చేశాడు. ఆ తర్వాత అఫ్గాన్ పై 29 పరుగులు, విండీస్‌పై 14 పరుగులు చేసి నిరాశపరిచాడు.
ఇలా వరుస మ్యాచుల్లో విఫలమవుతున్న విజయ్ శంకర్ ను అభిమానులు సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. '' విజయ్ శంకర్ ని కోహ్లీ, బుమ్రాలతో పోల్చవచ్చు. కానీ ఒక్కటే తేడా. అతడు బ్యాటింగ్ బుమ్రాలా, బౌలింగ్ కోహ్లీలా చేస్తున్నాడు'' అంటూ ఓ అభిమాని సెటైర్ విసిరాడు. మరో అభిమాని '' ఈ త్రీ డైమెన్షన్ ప్లేయర్ ఆటతీరును రాయుడు త్రీడి కళ్లద్దాలతో చూస్తున్నాడు.'' అంటూ ఎద్దేవా చేశాడు. మరికొందరయితే విజయ్ ని వెంటనే భారత జట్టునుండి తొలగించి రిషబ్ పంత్ కు అవకాశమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.