విరాట్ కోహ్లీ తొందరపాటు: వింతగా చేజేతులా...

By telugu teamFirst Published 16, Jun 2019, 9:13 PM
Highlights

వర్షం వెలిసిన తర్వాత విరాట్‌ కోహ్లి, విజయ్‌ శంకర్‌ తిరిగి క్రీజ్‌లోకి వచ్చారు. పాకిస్తాన్ బౌలర్ మొహమ్మద్ అమీర్  48 ఓవర్‌ వేయడం ప్రారంభించాడు. తొలి బంతికి విజయ్‌ శంకర్‌ పరుగులేమీ తీయలేదు, 

మాంచెస్టర్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా పాకిస్తాన్ పై ఆదివారం జరుగుతున్న మ్యాచులో ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వింతగా ప్రవర్తించాడు. బంతి బ్యాట్ కు తగలకుండానే కోహ్లీ మైదానం వీడడం చర్చనీయాంశంగా మారింది. తన తప్పిదంతో చేజేతులా అతను వికెట్ పడగొట్టుకున్నాడు. 

వర్షం వెలిసిన తర్వాత విరాట్‌ కోహ్లి, విజయ్‌ శంకర్‌ తిరిగి క్రీజ్‌లోకి వచ్చారు. పాకిస్తాన్ బౌలర్ మొహమ్మద్ అమీర్  48 ఓవర్‌ వేయడం ప్రారంభించాడు. తొలి బంతికి విజయ్‌ శంకర్‌ పరుగులేమీ తీయలేదు, రెండో బంతికి సింగిల్‌ తీశాడు.దాంతో స్ట్రైకింగ్‌ ఎండ్‌లోకి వచ్చిన కోహ్లి మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. 

కోహ్లీ నాల్గో బంతిని ఎదుర్కొనే క్రమంలో ఆమిర్‌ బౌన్సర్‌ వేశాడు. దాన్ని కోహ్లి హుక్‌ షాట్‌ ఆడబోగా అది కాస్తా మిస్సయి కీపర్‌ సర్ఫరాజ్‌ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై ఔట్‌కు సర్ఫరాజ్‌ బలంగా అప్పీల్‌ చేయలేదు కూడా. అంపైర్‌ నిర్ణయం కూడా ప్రకటించలేదు. ఇంతలోనే కోహ్లి మాత్రం పెవిలియన్‌ దారి తీశాడు. 

ఆ తర్వాత పరిశీలిస్తే అది ఔట్ కాదని టీవీ రిప్లేలో తేలింది. దాంతో కోహ్లికి తాను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది.  అత్యంత కీలకమైన వరల్డ్‌కప్‌లో, అది కూడా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి అలా చేయడం చర్చకు దారి తీసింది. 

కాగా, బ్యాట్‌ హ్యాండిల్‌ బలహీనంగా ఉన్న కారణంగానే కోహ్లి ఔటైనట్లు అనుకున్నాడు. కోహ్లి గ్యాలరీలో కూర్చొన్న తర్వాత బ్యాట్‌ హ్యాండిల్‌ను చెక్‌ చేసుకోవడం కనిపించింది. 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 16, Jun 2019, 9:13 PM