
రెండున్నర నెలల క్రితం ఢిల్లీ నుంచి తన సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్ కు వెళ్తూ మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్.. తన కాలికి సర్జరీ తర్వాత సోషల్ మీడియా ద్వారా తన హెల్త్ ఎలా ఉందనే విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. పంత్ ను కలిశాడు.
పంత్ ను కలిసిన యువీ అతడి ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. అనంతరం ట్విటర్ లో పంత్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. అతడు బుడి బుడి అడుగులు వేస్తున్నాడని, పాజిటివ్ గా ఉంటూ త్వరగా కోలుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు.
ట్విటర్ లో పంత్-యువీలు కలిసున్న ఫోటోను షేర్ చేస్తూ యువరాజ్.. ‘బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ఈ ఛాంపియన్ మళ్లీ ప్రకాశించబోతున్నాడు. మంచి పాజిటివ్ అటిట్యూడ్ తో ఉన్నాడు. నిజంగా చాలా సరదా మనిషి. నీకు మరింత శక్తి కలగాలి..’అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పంత్ హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చినందుకు గాను యువీకి అతడి ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.
కాగా రోడ్డు ప్రమాదంలో గాయడిన తర్వాత కొన్నాళ్లకు పంత్.. చేతికర్ర సాయంతో ఉదయపు ఎండలో నడుస్తున్న వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే. వీడియోకు ‘ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా..ఒక అడుగు మెరుగ్గా..’అని రాసుకొచ్చాడు. రెండ్రోజుల క్రితం కూడా పంత్.. వాటర్ పూల్ లో స్టిక్ సాయంతో నడుచుకుంటూ పెట్టిన ఫోటో వైరల్ గా మారింది. వీడియోను షేర్ చేస్తూ పంత్.. ‘చిన్న విషయాలు, పెద్ద విషయాల మధ్యలో ప్రతీదానికీ కృతజ్ఞతలు..’అని రాసుకొచ్చాడు. కాగా, గాయం నుంచి కోలుకుంటున్న పంత్.. వన్డే వరల్డ్ కప్ వరకైనా పంత్ తిరిగి భారత జట్టులో చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇదిలాఉండగా గాయం కారణంగా ఆరు నెలల పాటు పంత్ క్రికెట్ ఆడేది అనుమానంగానే ఉండటంతో ఐపీఎల్ లో అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త సారథిని ప్రకటించిన విషయం తెలిసిందే. పంత్ స్థానంలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సారథిగా వ్యవహరించనుండగా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉంటాడు. టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఢిల్లీకి 2019 తర్వాత మరోసారి మెంటార్ (డైరెక్టర్ ఆఫ్ క్రికెట్) గా వ్యవహరించనున్నాడు.