నీలో ఆ దమ్ముంది.. పేస్ కావాల్సినంత ఉంది.. కానీ దానిమీద దృష్టి పెట్టు : ఉమ్రాన్‌కు షమీ కీలక సూచనలు

By Srinivas MFirst Published Jan 22, 2023, 3:47 PM IST
Highlights

INDvsNZ: టీమిండియా యువ సంచలనం  ఉమ్రాన్ మాలిక్  భారత జట్టులో  తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి యత్నిస్తున్నాడు. ధారాళంగా పరుగులిస్తున్నా ఉమ్రాన్ పేస్ కు వికెట్లు దాసోహమవుతున్నాయి. 

భారత్ - న్యూజిలాండ్ నడుమ రాయ్‌పూర్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ పతనానికి బాటలు వేసి ఆ జట్టు స్కోరు బోర్డుపై పరుగులు చేరకుండానే వికెట్ల పతనాన్ని మొదలుపెట్టిన   వెటరన్ పేసర్ మహ్మద్ షమీ..  ఈ మ్యాచ్ లో మూడు వికెట్లతో చెలరేగాడు. ఈ ప్రదర్శనతో మ్యాచ్ లో అతడికే  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే మ్యాచ్ అనంతరం  షమీని.. ఉమ్రాన్ మాలిక్ ఇంటర్వ్యూ చేశాడు. బీసీసీఐ టీవీ కోసం వీళ్ల సరదా సంభాషణ సాగింది. 

ఇంటర్వ్యూలో భాగంగా ఉమ్రాన్.. షమీని  ఒత్తిడిని ఎలా ఎదుర్కుంటావని అడిగాడు.   ఇదే క్రమంలో  షమీ కూడా ఉమ్రాన్ కు కీలక సూచనలు చేశాడు. ఆ ఇంటర్వ్యూ సారాంశమిదే.. 

ఉమ్రాన్ : హాయ్ వ్యూయర్స్. నేను ఉమ్రాన్ మాలిక్. నాతో పాటు నా ఫేవరేట్ బౌలర్ మహ్మద్ షమీ ఉన్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. వికెట్లు పడ్డా లేకున్నా మీలో ఒత్తిడి కనిపించదు.  ఆ సీక్రెట్ ఏదో నాకు కూడా చెప్పండి. 

షమీ :  ఇది  పరిమిత ఓవర్ల క్రికెట్.   బ్యాటర్లు అంతా హిట్టింగ్ కే ప్రాధాన్యమిస్తారు.  మనను మనం  బలంగా నమ్మాలి.  మన స్కిల్ మీద మనకు నమ్మకముండాలి. అనవసరంగా టెన్షన్ తీసుకోకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి.  వికెట్లు వాటంతట అవే వస్తాయి.. నేను నీకు ఒక అడ్వైజ్ ఇద్దానుకుంటున్నా.  

 

From bowling pace & staying calm to sharing an invaluable advice 👌 👌

Raipur Special: interviews his 'favourite bowler' after win the 2⃣nd ODI 👍 👍 - By

Full interview 🎥 🔽https://t.co/lALEGLjeZb pic.twitter.com/hy57SAtBf6

— BCCI (@BCCI)

ఆ తర్వాత షమీ ఉమ్రాన్ కు కీలక సలహా ఇచ్చాడు. ‘నీలో చాలా టాలెంట్ ఉంది. భవిష్యత్ కూడా బాగుంటుంది.  నీ పేస్  ను ఎదుర్కోవడం అంత ఆషామాషీ అయితే కాదు. కానీ కొంచెం లైన్ అండ్ లెంగ్త్ మీద దృష్టి పెట్టు. దానిమీద నువ్వు నియంత్రణ సాధించగలిగితే తర్వాత దునియాను దున్నేయచ్చు..’ అని సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ టీవీ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది.  

కాగా రెండో వన్డేలో  తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కివీస్  34.3 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది.  గ్లెన్ ఫిలిప్స్ (36) టాప్ స్కోరర్. ఫిలిప్స్ తో పాటు మరో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. భారత బౌలర్లలో షమీకి 3 వికెట్లు దక్కగా, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ కు తలా రెండు వికెట్లు పడ్డాయి.  సిరాజ్, శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్ తీసి కివీస్ నడ్డి విరిచారు. తర్వాత భారత్.. 20.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.  రోహిత్ శర్మ (51), శుభ్‌మన్ గిల్  (40 నాటౌట్) లు రాణించారు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఈనెల 24న ఇండోర్ లో జరుగుతుంది.

click me!