WTC Final 2023: కష్టాల్లో టీమిండియా.. ఇప్పటికే సగం మంది ఔట్.. పటిష్ట స్థితిలో ఆసీస్

By Srinivas MFirst Published Jun 8, 2023, 10:43 PM IST
Highlights

WTC Final 2023:  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ కు రెండో రోజూ కష్టాలు తప్పలేదు. తొలి రోజు బౌలింగ్‌లో విఫలమైన  టీమిండియా.. రెండో రోజు బ్యాటింగ్ లో నిరాశపరిచింది. 

అదే నిర్లక్ష్యం.. అదే వైఫల్యం.. అదే చెత్త ప్రదర్శన.. ఫలితంగా టీమిండియాకు కష్టాలు తప్పలేదు. ఐసీసీ టోర్నీలలో వైఫల్య  ప్రదర్శనను కొనసాగిస్తూ.. ఓవల్ లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా తేలిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు  పరుగుల వరద పారించిన ఓవల్ పిచ్ పై  క్రీజులో నిలబడితేనే గొప్ప  అన్న రేంజ్ లో మన వీరుల వైఫల్యం పాగింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్..  121.3 ఓవర్లలో 469 పరుగులు చేసి ఆలౌట్ కాగా భారత జట్టు.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసేసమయానికి 38 ఓవర్లలో 5  వికెట్లు కోల్పోయి 151  పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. 

ప్రపంచ స్థాయి బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ (15), ఛటేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లీ (14) తో పాటు గత ఏడాది కాలంగా నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్ గిల్ (13) కూడా  చెత్త ప్రదర్శనతో వికెట్ పారేసుకున్నాడు. వీరంతా కలిసి  చేసింది 56 పరుగులే. 

వైఫల్యం సాగిందిలా...

బ్యాటింగ్‌కు అనుకూలించిన ఓవల్ పిచ్ పై మన ఆటగాళ్లు  క్రీజులో నిలబడేందుకే తంటాలు పడ్డారు.  రోహిత్‌ను ఆసీస్ సారథి పాట్ కమిన్స్  ఔట్ చేశాడు. కమిన్స్ వేసిన ఆరో ఓవర్లో  చివరి బంతికి   రోహిత్ ఎల్బీగా  ఔట్ అయ్యాడు. మరుసటి ఓవర్ వేసిన స్కాట్ బొలాండ్.. భారత్ కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. శుభ్‌మన్ గిల్ ను అతడు బోల్తొ కొట్టించాడు.  బొలాండ్ వేసిన ఏడో ఓవర్ లో నాలుగో బంతికి గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  ఆదుకుంటాడనుకున్న పుజారా కూడా గ్రీన్ బౌలింగ్‌లో  గిల్ మాదిరిగానే ఔట్ అయ్యాడు.  విరాట్ కోహ్లీని  స్టార్క్ ఔట్ చేశాడు.  

ఆదుకున్న జడేజా - రహానే.. 

71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో భారత్‌ను  రవీంద్ర జడేజా (51 బంతుల్లో 48, 7 ఫోర్లు, 1 సిక్స్) - అజింక్యా రహానే (71 బంతుల్లో 29 నాటౌట్, 4 ఫోర్లు) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆసీస్ పేస్ దాడిని ధీటుగా ఎదుర్కున్నారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు వంద బంతుల్లో 71  పరుగులు జోడించారు.    సాఫీగా సాగుతుందనుకున్న క్రమంలో టీమిండియాకు భారీ కుదుపు. నాథన్ లియాన్ వేసిన  35వ ఓవర్లో జడేజాను ఔట్ చేసి భారత్ కు షాకిచ్చాడు.  జడేజా నిష్క్రమణ తర్వాత వచ్చిన శ్రీకర్ భరత్.. 14 బంతులాడి ఐదు పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. మరి ఈ ఇద్దరూ  రేపు ఉదయం  ఏ మేరకు నిలదొక్కుకుంటారో చూడాలి..

ఇక ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్, బొలాండ్, గ్రీన్, లియాన్ లు తలా ఓ వికెట్ తీశారు. అంతకుముందు ఆసీసీ తొలి ఇన్నింగ్స్ లో 121.3 ఓవర్లలో 469 పరుగులు చేసి ఆలౌట్ అయింది.   ట్రావిస్ హెడ్   (163), స్టీవ్ స్మిత్ (121) సెంచరీలకు తోడు  వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (48) , డేవిడ్ వార్నర్ (43) రాణించారు.భారత బౌలర్లలో సిరాజ్ కు నాలుగు వికెట్లు దక్కగా.. షమీ, శార్దూల్ కు తలా రెండు వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. అశ్విన్ ను తప్పించి నాలుగో పేసర్ రూపంలో జట్టులోకి తీసుకున్న ఉమేశ్ యాదవ్ ఒక్క వికెట్ తీయకపోగా ధారాళంగా పరుగులిచ్చాడు. 

click me!