WPL 2024 DC vs UPW: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయం అందుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన యూపీ వారియర్స్ పై వికెట్ల తేడాతో డిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.
WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ ఎడిషన్ ఎంతో జోష్ గా కొనసాగుతోంది. ఈ సీజన్‌లోని నాల్గవ మ్యాచ్ (ఫిబ్రవరి 26) సోమవారం బెంగళూరులో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో చివరి బంతికి ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన గత సీజన్‌లో రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. కాగా యూపీ వారియస్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఢిల్లీ విజయంతో పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది యూపీ వారియర్స్. కానీ.. పేలవ ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణించింది. ఢిల్లీ జట్టు కేవలం ఒక్క వికెట్ కోల్పోయి.. మరో 33 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్, ఓపెనర్ షెఫాలీ వర్మ అద్బత భాగస్వామ్యం జట్టును విజయతీరాలకు చేర్చింది.
మెగ్ లానింగ్ (సి) 51, షఫాలీ వర్మ 64 పరుగులతో రాణించారు. జట్టుకు 119 పరుగుల భాగస్వామ్యం అందించారు. 51 పరుగులు చేసిన తర్వాత మెగ్ లానింగ్ (సి) సోఫీ ఎక్లెస్టోన్‌కు అవుట్ అయ్యింది. ఈ తరుణంలో జట్టు విజయానికి ఒక పరుగు అవసరమైంది. ఆ తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్జ్ వచ్చి ఫోర్ కొట్టింది. ఇలా ఒకే వికెట్ కోల్పోయిన ఢిల్లీ జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి వచ్చింది.
అంతకుముందు బౌలింగ్‌లో ఢిల్లీ తరఫున రాధా యాదవ్, మర్రిజన్ కాప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. 4 ఓవర్లు వేసిన క్యాప్ 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది. మరోవైపు రాధా యాదవ్ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టింది. వీరిద్దరితో పాటు అరుంధతి రెడ్డి, అనాబెల్ సదర్లాండ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో మారియన్ క్యాప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది.
పాయింట్ల పట్టికలో ఆర్సీబీని ఓడించిన ఢిల్లీ
ఢిల్లీ 33 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది దాని మొదటి విజయం. కానీ, నెట్ రన్ రేట్ చాలా మెరుగుగా ఉంది. ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. మరోవైపు ఈ అద్భుత విజయంతో ఢిల్లీ 2 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. నెట్ రన్ రేట్ (1.222) అత్యుత్తమంగా ఉండటంతో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ మూడో స్థానానికి దిగజారాల్సి వచ్చింది. గుజరాత్ జెయింట్స్,యూపీ వారియర్స్ ఈ రెండు జట్ల ఖాతాలు కూడా తెరవలేదు.