Asia Cup: పాక్‌కు రావడానికి టీమిండియా భయపడుతోంది: జావేద్ మియాందాద్

By Srinivas MFirst Published Feb 6, 2023, 1:44 PM IST
Highlights

Asia Cup 2023 Row: ఈ ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్  వేదిక అంశం మరోసారి చర్చనీయాంశమైంది.  ఇటీవలే  బహ్రెయిన్ వేదికగా ముగిసిన  జై షా - నజమ్ సేథీ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. 

భారత్ - పాకిస్తాన్ ల మధ్య  మళ్లీ క్రికెట్ వార్ ఊపందుకుంది.    పురుషుల క్రికెట్ లో  ఈ రెండు జట్లు ఇప్పుట్లో తలపడే అవకాశాలే లేవు.  అక్టోబర్ లో  వన్డే వరల్డ్ కప్ కు ముందు  ఆసియా కప్ జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ పాకిస్తాన్ లో నిర్వహించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా  తాము పాక్ కు వెళ్లబోమని, తటస్థ వేదిక అయితేనే  ఈ టోర్నీలో ఆడతామని బీసీసీఐ ఇప్పటికే పలుమార్లు తన వైఖరిని స్పష్టం చేసింది.  కానీ పాకిస్తాన్ మాత్రం మొండి పట్టు వీడటం లేదు.  భారత్.. పాక్ కు రాకుంటే తాము వచ్చే వన్డే వరల్డ్ కప్ కోసం తమ జట్టును పంపించబోమని  పట్టుబడుతున్నది. 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత అధ్యక్షుడు  రమీజ్ రాజాతో పాటు ప్రస్తుత చీఫ్ నజమ్ సేథీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కాగా ఇదే అంశంపై  పీసీబీ చీఫ్  నజమ్ సేథీ.. ఇటీవలే బహ్రెయిన్ లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)  సభ్య దేశాలతో కీలక సమావేశం నిర్వహించాడు. 

ఈ మీటింగ్ కు నజమ్ తో పాటు ఏసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శిగా కూడా ఉన్న  జై షా  హాజరయ్యాడు.  ఈ సమావేశంలో కూడా  బీసీసీఐ తన వైఖరిని స్పష్టం చేసింది. అయితే పాక్ మాత్రం మళ్లీ అదే పాత వీడియోనే (ఆసియా కప్ కు రాకుంటే వన్డే వరల్డ్ కప్ ఆడం) రిపీట్ చేస్తున్నది.  

ఈ నేపథ్యంలో  పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జావేద్ మియాందాద్   టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. పాక్ కు రావడానికి భారత్ భయపడుతోందని  మియాందాద్ అన్నాడు.   ఓ కార్యక్రమంలో  మియాందాద్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ లో ఆడేందుకు ఇండియా ఎందుకు రావడం లేదు..? ఒకవేళ వాళ్లు ఓడిపోతే  స్వదేశంలో అభిమానులు వాళ్లను క్షమించరని  టీమిండియాకు తెలుసు. ఆ భయం కొద్దే  భారత్ పాక్ కు రావడం లేదేమో..’అని  తెలిపాడు. 

 

అంతేగాక.. ‘నేను ఈ విషయంలో ఇంతకముందే నా వైఖరి వెల్లడించాను.  పాక్ కు భారత్ రాకుంటే  వాళ్లు నరకం పోతారు. మాకేం నష్టం లేదు.  వాస్తవానికి ఇది  ఐసీసీ పని.  ఐసీసీ తన సభ్య దేశాలను నియంత్రించకుంటే ఇక అది ఉండి ఎందుకు..?  అందరికీ ఒకే రూల్స్  ఉండాలి కదా.   ఇండియా ఒక్కటే క్రికెట్ ను నడపడం లేదు. అది వాళ్ల దేశంలో పవర్ హౌజ్ (శక్తివంతమైన వ్యవస్థ) కావొచ్చు.  ప్రపంచానికి కాదు.   పాకిస్తాన్ కు వచ్చి ఆడండి.. ఎందుకు రారు మీరు..?’అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.  మరి ఈ విషయంలో  బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

click me!