మా బాబర్ ఉన్నా వేస్ట్.. నువ్వు వచ్చి ఆసియా కప్ ఆడు కోహ్లీ.. ప్లీజ్.. విరాట్‌ను వేడుకుంటున్న పాక్ ఫ్యాన్స్

By Srinivas MFirst Published Dec 13, 2022, 11:50 AM IST
Highlights

Virat Kohli:  టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.  ప్రత్యేకించి భారత్ తో  పాటు శత్రుదేశం పాకిస్తాన్ లో కూడా  కోహ్లీకి వీరాభిమానులున్నారు. పాకిస్తాన్ తో ప్రతీ మ్యాచ్ లో రాణించినా  వాళ్లు కోహ్లీని ఆరాధిస్తారు. 

ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినా విరాట్ కోహ్లీ  పాకిస్తాన్ మీద దుమ్మురేపాడు. దాయాదితో మ్యాచ్ అంటేనే పూనకం వచ్చినోడిలా ఊగిపోతాడు.  దానికి సజీవ సాక్ష్యం ఇటీవల టీ20 ప్రపంచకప్ లో  మెల్‌బోర్న్ వేదికగా భారత్ - పాక్ మ్యాచ్ జరుగగా ఆ పోరులో కోహ్లీ వీరోచిత పోరాటం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ మీద  ఇంతగా చెలరేగినా కోహ్లీ అంటే  ఆ దేశపు  క్రికెట్ అభిమానులకు ఇష్టమే. తమ సారథి బాబర్ ఆజమ్ కంటే  కోహ్లీకి ఫాలోయింగ్  ఎక్కువగా ఉందంటున్నారు అక్కడి అభిమానులు. తాజాగా ముల్తాన్ టెస్టులో   కోహ్లీ ఫ్యాన్స్  బ్యానర్లతో ఇదే విషయాన్ని   స్పష్టం చేశారు. 

ముల్తాన్ వేదికగా ముగిసిన ఇంగ్లాండ్ - పాకిస్తాన్ రెండో టెస్టులో   పలువురు పాక్ ఫ్యాన్స్ కోహ్లీ ఫోటో ఉన్న బ్యానర్లు,  ఫ్లకార్డులు ప్రదర్శించారు. వచ్చే ఏడాది  పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్  లో టీమిండియా తమ దేశానికి రావాలని, కోహ్లీ పాక్ లో ఆడాలని  కోరుకుంటున్నారు. 

ఈ మేరకు పలువురు ఫ్యాన్స్.. ‘హాయ్ కింగ్ కోహ్లీ,  పాకిస్తాన్ కు వచ్చి ఆసియా కప్ ఆడు ప్లీజ్.. మేము మా కింగ్ బాబర్ ఆజమ్ కంటే నిన్నే ఎక్కువ  అభిమానిస్తున్నాం..’  అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.  పాకిస్తాన్ లో కోహ్లీ ఫ్యాన్స్ ఇలా బ్యానర్లు ప్రదర్శించడం ఇదేం కొత్త కాదు. గతంలో ఆస్ట్రేలియా  జట్టు తమ దేశానికి వచ్చినప్పుడు కూడా రావల్పిండి, కరాచీలో  కోహ్లీ అభిమానులు  అతడి పోస్టర్ తో రచ్చ చేశారు. పాకిస్తాన్ కు వచ్చి ఆడాలని వేడుకున్నారు. 

 

Virat Kohli fans in Pakistan - The craze is huge. pic.twitter.com/THW0veDL7L

— Johns. (@CricCrazyJohns)

అయితే భారత్ - పాక్ మధ్య సంబంధాలు  దెబ్బతినడంతో  2013 నుంచి ఇరు దేశాలు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం మానేశాయి. కేవలం ఐసీసీ, ఆసియా కప్ లలో మాత్రమే పోరాడుతున్నాయి.  కాగా, 2022 టీ20 ప్రపంచకప్ కు కొద్దిరోజుల ముందు  బీసీసీఐ సెక్రటరీ  జై షా చేసిన వ్యాఖ్యలు  ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య మంటపెట్టాయి.  వచ్చే ఏడాది ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తే తాము పాక్ కు వెళ్లమని, తటస్థ వేదికపై అయితే  ఆడతామని  షా అన్నాడు. దానికి  పాకిస్తాన్ కూడా  ధీటుగానే సమాధానమిచ్చింది.   ఒకవేళ భారత్ పాక్ కు రాకుంటే తాము కూడా వన్డే ప్రపంచకప్ కు  ఇండియాకు రాబోమని పాక్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో అసలు ఆసియా కప్ కు భారత్  పాక్ కు వెళ్తుందా..? లేదా టోర్నీ వేదికను మారుస్తారా..? అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి.

click me!