టీమిండియాని పాకిస్తాన్‌కి పంపండి పీఎం సాబ్... భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరిన షాహిద్ ఆఫ్రిదీ..

By Chinthakindhi RamuFirst Published Mar 21, 2023, 1:26 PM IST
Highlights

ప్రపంచ క్రికెట్‌ని శాసించే శక్తి భారత క్రికెట్ బోర్డుకి ఉంది... చర్చించుకుంటే సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.. ఆసియా కప్ కోసం టీమిండియా, పాకిస్తాన్‌కి వస్తే అంతా మంచే జరుగుతుంది... పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ కామెంట్లు.. 


2012 తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగడం ఆగిపోయాయి. 2008 ఐపీఎల్‌లో పాక్ ప్లేయర్లను ఆడించిన బీసీసీఐ, ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాక్ ప్లేయర్లకు అనుమతి లేకుండా చేసింది. ఆఖరికి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో కూడా పాకిస్తాన్ టీమ్‌ని ఆడకుండా తొలగించారు...

2012-13లో చివరిసారిగా భారత పర్యటనకి వచ్చింది పాకిస్తాన్. ఈ పర్యటనలో రెండు టీ20, మూడు  వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోవడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే దాయాదుల పోరు చూసే అవకాశం దొరుకుతోంది...

ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే  పాక్‌లో జరిగితే తాము ఆడబోమని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహించాల్సిందిగా బీసీసీఐ పట్టుబడుతోంది. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య తీవ్రమైన వాడివేడి చర్చ జరుగుతోంది..

ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టోర్నీలో పాల్గొంటున్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ, భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులను తిరిగి ప్రారంభించాల్సిందిగా కోరాడు...

‘మోదీ సాబ్‌ని ఇండియా- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచులు జరిగేలా చూడాలని కోరుతున్నా.. మనం ఒకరితో స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నా, వాళ్లు మనతో మాట్లాడకపోతే ఏం చేస్తాం... ఏమీ చేయలేం.. బీసీసీఐ చాలా పెద్ద బోర్డు...

ప్రపంచ క్రికెట్‌ని శాసించే శక్తి భారత క్రికెట్ బోర్డుకి ఉంది. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఉంటాయి. శత్రువులను పెంచుకోవాలని కాకుండా స్నేహితులను పెంచుకోవాలని ప్రయత్నించాలి... స్నేహితులు పెరిగే కొద్దీ, బీసీసీఐ శక్తి సామర్థ్యాలు మరింత బలంగా మారతాయి...

పాక్ క్రికెట్ బోర్డు వీక్ అని, బలహీనమైనదని నేను అనడం లేదు. అయితే పీసీబీకి కూడా బీసీసీఐ నుంచి నిధులు అందుతున్నాయనే విషయం మరిచిపోకూడదు. ఇద్దరి మధ్య రాజీ కుదరాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి...

భారత క్రికెట్ టీమ్‌లో నాకు ఇప్పటికీ స్నేహితులు ఉన్నారు. వాళ్లను నేను కలిసినప్పుడు ఇరు దేశాల క్రికెట్ గురించి చర్చించుకుంటాం. సురేష్ రైనాని కలిసినప్పుడు అతని బ్యాట్ అడిగాను. అతను వెంటనే తన బ్యాట్ ఇచ్చేశాడు...

పాకిస్తాన్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని బీసీసీఐ చెబుతోంది. ఈ మధ్యకాలంలోనే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మా దేశంలోకి వచ్చాయి, క్రికెట్ ఆడాయి. భారత జట్టుకి కూడా ఇదే రకమైన భద్రతా ఏర్పాట్లు చేస్తాం..

అయితే ఇరు దేశాల ప్రభుత్వాలు ఒప్పుకుంటేనే ఇండియా, పాక్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఆసియా కప్ కోసం ఇండియా, పాక్‌లో అడుగుపెట్టకపోతే... ఇక ఇరు దేశాల మధ్య క్రికెట్ జరగకూడదని అనుకునేవాళ్లు గెలిచినట్టు అవుతుంది...

ఏ గొడవ ముగిసిపోవాలన్నా కమ్యూనికేషన్ చాలా అవసరం. రాజకీయాల్లోనూ అంతే. నాయకులు మాట్లాడుకుంటే ఇండియా- పాకిస్తాన్ మధ్య వైరం ఇన్నినాళ్లు కొనసాగదు..  ఇండియా, పాక్‌లో అడుగుపెడితే చాలా మంచి జరుగుతుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ.. 

click me!