వాళ్లకున్న వసతుల్లో మాకు 30 శాతం కూడా లేవు : పాకిస్తాన్ యువ క్రికెటర్ ఆవేదన

By Srinivas MFirst Published Jun 23, 2022, 5:48 PM IST
Highlights

Pakistan Cricket: నోరుతెరిస్తే భారత క్రికెట్, ఐపీఎల్ మీద పడి ఇష్టమొచ్చినట్టు వాగే పాకిస్తాన్ క్రికెటర్లు వారి దేశంలో క్రికెట్ గురించి ఆలోచించడం లేదు. తాజాగా ఓ యువ  పేసర్ ఇదే విషయమై ఆవేదన వ్యక్తం చేశాడు. 

నిత్యం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, ఐపీఎల్ మీద పడి ఏడ్చే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తో పాటు  ఆ జట్టు మాజీ  క్రికెటర్లు స్వదేశంలో ఆటగాళ్లకు  కనీస వసతులు కల్పించడం లేదు.  ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ యువ పేసర్ నసీం షా తెలిపాడు. ఈ 19 ఏండ్ల యువ పేసర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

నసీం షా మాట్లాడుతూ.. ‘ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ లలో ఆడుతున్న ఆటగాళ్లు పొందుతున్న వసతుల్లో  మాకు (పాకిస్తాన్) 30 శాతం కూడా లేవు. నేనెక్కడ్నుంచి వచ్చానో నాకు తెలుసు. నేను క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసినప్పుడు టేప్ బాల్ తో ఆడేవాడిని. కానీ ఇక్కడంతా వింతగా ఉంది. ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇక్కడి స్టేడియాలు, ఆటగాళ్లకు అందుతున్న వసతులు చూస్తే వీళ్లంతా చాలా అదృష్టవంతులని అనిపిస్తోంది...’ అని అన్నాడు. 

నసీం షా.. పాకిస్తాన్ లోని ఖైబర్ పక్తుంక్వా కు చెందిన  లోయ ప్రాంతానికి చెందిన ఆటగాడు. అతడు ఒక గిరిజన తెగకు చెందిన క్రికెటర్. నసీమ్ షా చిన్నతనంలో టేప్ బాల్ తో ప్రాక్టీస్ చేసి  ఆ తర్వాత అండర్-19 కు ఎంపికయ్యాక క్రికెట్ బాల్ తో ఆడాడు.  లాహోర్, కరాచీలలో  క్రికెటర్లకు మంచి సౌకర్యాలు లభ్యమవుతాయని కానీ ఇతర ప్రదేశాలలో మాత్రం కనీస వసతులు కూడా ఉండవని వాపోయాడు. 

వసతుల సంగతి పక్కనబెడితే తమ దేశంలో ఎంతో మంది క్రికెటర్లు అవన్నీ లేకుండానే గొప్ప ఆటగాళ్లుగా రాణించారని నసీం చెప్పాడు.‘మా దేశంలో చాలామంది క్రికెటర్లు గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్లే. లాహోర్, కరాచీలలో వసతులు బాగుంటాయి. కానీ నేను పెరిగిన ఊళ్లో కనీసం గ్రౌండ్ కూడా లేదు. అలాంటి ప్రాంతాల్లో క్రికెట్ బాల్ తో ప్రాక్టీస్ చేయడం కష్టం. ఇంగ్లాండ్ తో పోలిస్తే మాకు సదుపాయాలు తక్కువగా ఉన్నా  చాలా మంది గొప్ప క్రికెటర్లు మా దేశం నుంచి వచ్చారు..’ అని తెలిపాడు. 

 

Naseem Shah highlights massive difference in facilities provided to Pakistan cricketers and county cricketers in England 👀

Read more: https://t.co/ZKowwKQomk pic.twitter.com/oSWuO456Op

— Cricket Pakistan (@cricketpakcompk)

2019 లో తనకు 16 ఏండ్ల వయసులోనే టెస్టు క్రికెట్ ఆడిన నసీం షా.. ఇప్పటివరకు 11 టెస్టులలో 26 వికెట్లు తీశాడు. షా.. 16 ఏండ్ల 307 రోజుల్లోనే తన అరంగేట్ర టెస్టు (ఆస్ట్రేలియాతో) లో ఐదు వికెట్లు పడగొట్టి  ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా నిలిచాడు. ఇక 16 ఏండ్ల 359 రోజులలో బంగ్లాదేశ్ తరఫున మ్యాచ్ ఆడుతూ హ్యాట్రిక్ సాధించాడు. టెస్టులలో ఇంత చిన్న వయసులో హ్యాట్రిక్ పడగొట్టిన బౌలర్ గా నసీం రికార్డులకెక్కాడు. తన బౌలింగ్ ను మెరుగుపరుచుకోవడానికి అతడు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటీలు ఆడుతున్నాడు. 

click me!