Wasim Akram: రిటైరై రెండు దశాబ్దాలైనా పదును తగ్గలే.. యార్కర్ తో మాజీ బ్యాటర్ ను బౌల్డ్ చేసిన అక్రమ్

Published : Jun 20, 2022, 05:15 PM IST
Wasim Akram: రిటైరై రెండు దశాబ్దాలైనా పదును తగ్గలే.. యార్కర్ తో మాజీ బ్యాటర్ ను బౌల్డ్ చేసిన అక్రమ్

సారాంశం

Wasim Akram: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న పాకిస్తాన్ మాజీ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై రెండు దశాబ్దాలు కావొస్తున్నది. 

ఎనభై, తొంబై దశకాలలో ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లందరికీ తన పేస్ ను రుచి చూపించిన పాకిస్తాన్ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్.. తన బౌలింగ్ లో ఇంకా పదును తగ్గలేదని మరోసారి నిరూపించాడు.  బ్యాటర్లను దాటుకుని వికెట్ల మీదకు చొచ్చుకొచ్చే ఇన్ స్వింగర్లతో పాటు యార్కర్లు వేయడంలో దిట్ట అయినా అక్రమ్.. చాలాకాలం తర్వాత అలాంటి బౌలింగ్ తోనే ఇంగ్లాండ్ కు చెందిన దిగ్గజ బ్యాటర్ ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ అథర్టన్ ను బోల్తా కొట్టించాడు. అక్రమ్ వేసిన యార్కర్ కు అథర్టన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  అసలు అక్రమ్, అథర్టన్ లు క్రికెట్ ఎందుకాడరనేగా మీ డౌటానుమానం..? 

అసలు విషయానికొస్తే.. ఇటీవలే మరణించిన ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ జ్ఞాప‌కార్థం నిర్వ‌హించిన ఛారిటీ మ్యాచ్‌లో ఈ సీన్  క‌నిపించింది. సాధారణంగా అక్రమ్ బౌలింగ్ చేసేప్పుడు వికెట్లకు చాలా దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి బాల్ విసురుతాడు. కానీ వయసు మీద పడటంతో  తక్కువ రనప్ తోనే వచ్చిన అక్రమ్.. క్రీజులో ఉన్న అథర్టన్ కు యార్కర్ విసిరాడు. 

ఆ బంతిని ఎదుర్కోవడంలో అథర్టన్ ఇబ్బందిపడ్డాడు. యార్కర్ గా దూసుకొచ్చిన బంతి  ఆఫ్ స్టంప్ ను తాకింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘క్రికెట్ డిస్ట్రిక్ట్’ ట్విటర్ లో షేర్ చేసింది. అథర్టన్ ఔటైన సమయంలో  నాన్ స్ట్రైకర్ ఎండ్ లో  విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఉండగా.. అదే దేశానికి చెందిన మరో దిగ్గజ ఆటగాడు క్లైవ్ లాయిడ్ అంపైరింగ్ చేస్తుండటం విశేషం. 

 

కాగా మ్యాచ్ అనంతరం  అక్రమ్ ట్విటర్ లో ‘క్రికెట్ డిస్ట్రిక్ట్’ వీడియో ను షేర్ చేస్తూ.. ‘సారీ అథర్టన్.. మనకు రాను రాను వయసు మీద పడుతుంది గానీ కొన్ని విషయాలు మాత్రం మారడం లేదు..’అని ఫన్నీగా కామెంట్ చేశాడు. గతంలో అథర్టన్ ను అక్రమ్ పలుసార్లు ఔట్ చేసిన దాన్ని ఉద్దేశిస్తూ ఆయన పై విధంగా స్పందించాడు. కాగా ఈ మ్యాచ్ లో అక్రమ్ బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ కూడా చేయడం విశేషం. 

1984 నుంచి 2003 వరకు పాక్ జట్టు తరఫున ఆడిన అక్రమ్.. 104 టెస్టులు, 356 వన్డేలు ఆడాడు. టెస్టులలో 414 వికెట్లు పడగొట్టగా.. వన్డేలలో 502 వికెట్లు తీశాడు.  బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేసే అక్రమ్.. టెస్టులలో 2,898 పరుగులు (ఇందులో 3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు), వన్డేలలో 3,717 (6 అర్థ సెంచరీలు) పరుగులు చేశాడు.  

ఇక అథర్టన్ విషయానికొస్తే.. 1989 నుంచి 2001 వరకు ఇంగ్లాండ్ తరఫున 115 టెస్టులు ఆడాడు. టెస్టులలో 7,728,  54 వన్డేలలో 1,791 పరుగులు సాధించాడు. 25 ఏండ్ల వయసులోనే ఇంగ్లాండ్ కు సారథిగా ఉన్న అథర్టన్.. 54 టెస్టులలో ఇంగ్లాండ్ కు కెప్టెన్ గా ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?