
ఫ్రాంఛైజీ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్‌ని మెల్లిమెల్లిగా మింగేస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ప్లేయర్లు చాలా మంది ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని, ఫ్రాంఛైజీ క్రికెట్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఇప్పుడీ లిస్టులో శ్రీలంక యంగ్ ఆల్‌రౌండర్, మణికట్టు స్పిన్నర్ వానిందు హసరంగ కూడా చేరిపోయాడు..
ఆగస్టు 15న టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు వానిందు హసరంగ. 26 ఏళ్ల వానిందు హసరంగ ఇప్పటిదాకా 4 టెస్టులు ఆడి 4 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటుతో 196 పరుగులు చేశాడు, ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. 2020లో సౌతాఫ్రికాపై టెస్టు ఆరంగ్రేటం చేసిన వానిందు హసరంగ, 2021 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌పై ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు..
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్న వానిందు హసరంగ, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, అబుదాబీ టీ10, ఐఎల్‌టీ టీ20, బిగ్‌బాష్ లీగ్ వంటి టోర్నీల్లో ఆడుతున్నాడు.
‘వైట్ బాల్ క్రికెట్‌కి పూర్తిగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వానిందు హసరంగ, టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. మేం అతని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..’ అంటూ తెలిపాడు శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో అష్లే డి సిల్వ...
ఇప్పటిదాకా 48 వన్డేలు ఆడిన వానిందు హసరంగ, 67 వికెట్లు తీశాడు. 58 టీ20 మ్యాచుల్లో 91 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ 1300లకు పైగా పరుగులు చేసిన హసరంగ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 8 మ్యాచుల్లో 15 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు..
అలాగే వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో 22 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ టాప్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో 3 సార్లు ఐదేసి వికెట్లు తీసిన హసరంగ, శ్రీలంక జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించడానికి కారణమయ్యాడు..
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.10 కోట్ల 75 లక్షలు పెట్టి వానిందు హసరంగను కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచులు ఆడి 26 వికెట్లు తీసిన వానిందు హసరంగ, 2023 సీజన్‌లో 8 మ్యాచులు ఆడి 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. గత సీజన్‌లో ఆశించిన పర్ఫామెన్స్ రాకపోవడంతో వానిందు హసరంగను ఆర్‌సీబీ, ఐపీఎల్ 2024 వేలానికి విడుదల చేసే అవకాశం ఉంది.