
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడి పై అతడు బాంబు పేల్చాడు. తనపై గతంలో గంగూలీ చేసిన వ్యాఖ్యలను ఖండించాడు. టీ20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకునే విషయమై తనతో ఎవరూ సంప్రదించలేదని కోహ్లీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే నాలుగైదు రోజుల క్రితం బీసీసీఐ చీఫ్ మాత్రం ఇదే విషయంపై మరో విధంగా స్పందించడం విశేషం.
గంగూలీ మాట్లాడుతూ... ‘విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ కి రాజీనామా చేయొద్దని మేం చెప్పాం. వ్యక్తిగతంగా నేను కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పాను. కానీ అతడు మా మాటను పట్టించుకోలేదు. ఆ ఫార్మాట్ కెప్టెన్ గా తప్పుకోవాలనే నిర్ణయించుకున్నాడు..’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
ఇక తాజాగా కోహ్లీ స్పందిస్తూ.. ‘టీ20 కెప్టెన్సీ వదిలేయాలని నాకు ఎవరూ చెప్పలేదు. పొట్టి ఫార్మాట్ బాధ్యతల నుంచి వైదొలగాలని నేను తీసుకున్న నిర్ణయానికి బీసీసీఐ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. దీనిని వాళ్లు ఓ విప్లవాత్మక మార్పుగా భావించారు.
అంతేగాక అవసరమైతే తాను వన్డే కెప్టెన్ గా కూడా దిగిపోతానని వాళ్లకు ఆప్షన్ ఇచ్చాను. ఈ విషయంలో గంగూలీ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. బీసీసీఐ, అధ్యక్షుడి నుంచి ఇలాంటివి ఊహించలేదు..’ అని కుండబద్దలు కొట్టాడు.
కోహ్లీ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో గంగూలీ పై విరాట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. కోహ్లీ మీడియా సమావేశం ముగిశాక విరాట్ తో పాటు గంగూలీ, బీసీసీఐ కూడా ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం. ఏదేమైనా ఒకవైపు బీసీసీఐ చీఫ్ చేసిన వ్యాఖ్యలు.. వాటిని ఖండిస్తూ విరాట్ ఇచ్చిన వివరణ నేపథ్యంలో తెరవెనుక మంత్రాంగం ఏదో నడుస్తుందని సగటు భారత క్రికెట్ అభిమాని ఆందోళన చెందుతున్నాడు. ఇందులో ఏది నిజం..? ఏది అబద్దమో తెలియక సతమతమవుతున్నారు.
ఇదిలాఉండగా.. మీడియా సమావేశంలో కోహ్లీ ఇంకా పలు విషయాలపై స్పష్టతనిచ్చాడు. తనకు రోహిత్ కు మధ్య అభిప్రాయ భేదాలేమీ లేవని, అవన్నీ మీడియా సృష్టించిన పుకార్లే అని తేల్చి చెప్పాడు. ఇదే విషయమై తాను రెండు సంవత్సరాలుగా చెప్పి చెప్పి అలసిపోయానని తెలిపాడు. భారత జట్టు ప్రతిష్టను దిగజార్చే విధంగా తాను ఎన్నడూ ప్రవర్తించబోనని కోహ్లీ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికా తో వన్డే సిరీస్ కు తాను అందుబాటులో ఉంటానని, రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ లకు 100 శాతం సహకారం అందిస్తానని చెప్పాడు.