
విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపు క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజా అందిస్తాడు. బాంగ్రా స్టెప్పులతో అభిమానులను అలరించే విరాట్ కోహ్లీ, ప్రత్యర్థుల ఏకాగ్రత రెచ్చగొట్టేలా సెడ్జింగ్ చేయడంలోనూ దిట్ట. ప్రస్తుతం టెస్టుల్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్న విరాట్ కోహ్లీ... మొదటి మూడు టెస్టుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు.
మూడేళ్లుగా టెస్టుల్లో విరాట్ కోహ్లీ సగటు కనీసం 30 కూడా దాటడం లేదు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ సేవలకు ఇక స్వస్తి పలికితే బెటర్ అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చాక్లెట్లు తింటూ కాలక్షేపం చేస్తుండడం టీవీ కెమెరాల్లో కనిపించింది...
టెస్టు మ్యాచులు సుదీర్ఘంగా రోజుకి 90 ఓవర్ల పాటు సాగుతాయి. కాబట్టి కొందరు ప్లేయర్లు చిరు తిండ్లు తినడం కెమెరాల్లో చాలాసార్లు కనిపించింది. అయితే వీలైనప్పుడుల్లా నోట్లు ఏదో ఇంత వేసుకోవడం బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నవారికి సెట్ అవుతుంది. బౌలింగ్ వేసిన తర్వాత బౌండరీ లైన్ దగ్గరికి వెళ్లి ఫీల్డింగ్ చేసే మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా అండ్ కో... మ్యాచ్‌ని గమనిస్తూ అరటి పండ్లు లాగించడం చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది...
అయితే స్లిప్‌లో ఫీల్డింగ్ చేసే ప్లేయర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. కాస్త ఆలస్యం చేసినా, మిల్లీ సెకన్ తేడాలో క్యాచ్ జారిపోతుంది. అలాంటి ప్లేస్‌లో ఫీల్డింగ్ చేసే విరాట్ కోహ్లీ, ఇలా మ్యాచ్ సమయంలో చాక్లెట్ తింటూ కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అహ్మదాబాద్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, భారీ స్కోరు దిశగా సాగుతోంది. శ్రీకర్ భరత్ క్యాచ్ డ్రాప్ చేయడంతో మ్యాచ్ ఆరంభంలోనే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్లు, తొలి వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం అందించారు..
44 బంతుల్లో 7 ఫోర్లతో 32 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ని రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేయగా మార్నస్ లబుషేన్ 20 బంతుల్లో 3 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 72 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఈ దశలో స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా కలిసి 41 ఓవర్లు బ్యాటింగ్ చేసి మూడో వికెట్‌కి 79 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
135 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్టీవ్ స్మిత్, జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడం ఇది నాలుగోసారి. 27 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన పీటర్ హ్యాండ్స్‌కోంబ్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. 78 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది ఆస్ట్రేలియా..