డకౌట్ అవుతున్నప్పుడు అందుకే నవ్వుతున్నా.. కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు

Published : May 11, 2022, 05:54 PM IST
డకౌట్ అవుతున్నప్పుడు అందుకే నవ్వుతున్నా.. కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

Virat Kohli: గతంలో ఎన్నడూ లేనంతగా చెత్త ఫామ్ తో తీవ్ర విమర్శల పాలవుతున్నాడు ఆర్సీబీ  మాజీ సారథి విరాట్ కోహ్లి తాజాగా తన ఫామ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తంగా ఆరుసార్లు డకౌటయ్యాడు విరాట్ కోహ్లి. అయితే అందులో 3 సార్లు ఈ సీజన్ లోనే  చోటు చేసుకోవడం విశేషం. వరుసగా రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయిన  కోహ్లి.. అవుటైన ప్రతిసారి ముఖంలో ఒకరకమైన నవ్వుతో పెవిలియన్ చేరుతున్నాడు. అయితే కోహ్లి వైరాగ్యం తో అలా నవ్వుతున్నాడా..? నిస్సహాయతా..? అనేది అతడి అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేగాక ఆ నవ్వు వెనుక కారణాలేమున్నాయి..? కొంపదీసి  ఈ సీజన్ తర్వాత ఆటకు గుడ్ బై చెప్పేయడు కదా..? అనే టెన్షన్ లో కూడా ఉన్నారు విరాటియన్స్ (కోహ్లి అభిమానులు సోషల్ మీడియాలో ఇలాగే పిలుచుకుంటారు). అయితే ఈ విషయంపై కోహ్లి స్పష్టతనిచ్చాడు. 

తాజాగా ఆర్సీబీకి చెందిన ఆటగాళ్లను ఫన్నీ ఇంటర్వ్యూలు చేస్తూ నాగ్స్ గా పేరు తెచ్చుకున్న మిస్టర్ నాగ్ తో కోహ్లి  ముఖాముఖి లో మాట్లాడాడు.  ఆర్సీబీ ఈ వీడియోను తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పంచుకుంది. 

ఈ వీడియోలో నాగ్.. ‘విరాట్ మీకు పెట్స్ అంటే ఇష్టమా..?’అనగా కోహ్లి స్పందిస్తూ.. ‘నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం’ అని అంటాడు. ‘మీ ఇంట్లో ఏమైనా పెట్స్ ఉన్నాయా..?’ అని నాగ్ అడగ్గా ‘మాకు అంత టైమ్ లేదు’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ‘మరి ఇటీవల కాలంలో మీరు మూడు బాతు (డక్) లను పెంచుకున్నట్టు అందరూ చూశారు కదా..?’ అని ప్రశ్నించాడు. దీనికి పడీ పడీ నవ్విన కోహ్లి.. ‘నేను గోల్డెన్ డకౌట్ అయిన దాని గురించేగా మీరు మాట్లాడుతున్నది. ఓకే.  నా కెరీర్ లో ఇలా (వరుసగా రెండు సార్లు డకౌట్) ఎప్పుడూ జరుగలేదు. అందుకే నేను అప్పుడు నవ్వాను.  ఇప్పుడు నేను అన్నీ చూస్తున్నాను. నాకు సపోర్ట్ చేసేది ఎవరు.. విమర్శించేది ఎవరు..? అన్నీ తెలుస్తున్నాయి.. అన్నీ నా అనుభవంలోకి వస్తున్నాయి..’ అని చెప్పుకొచ్చాడు. 

 

గత కొంతకాలంగా కోహ్లిని ఇంత ఆనందంగా నవ్వుకుంటున్నట్టుగా చూడటం ఇదే తొలిసారి. నాగ్ అతడిని కీలక ప్రశ్నలు అడుగుతూనే.. కోహ్లి ముఖంలో నవ్వులు విరబూయించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

ఇక వీడియోలో తనపై, తన ఆటపై వస్తున్న విమర్శల గురించి కూడా కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ‘వాళ్లు (విమర్శకులు) నా పరిస్థితుల్లో లేరు. నేనేం భావిస్తున్నానో వాళ్లు అది భావించడం లేదు.  నేను ఔట్ అయినప్పుడు పడుతున్న బాధ, వేధన వాళ్లు పడటం లేదు..’ అని  ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఈ సీజన్ లో 12 మ్యాచులాడిన విరాట్ కోహ్లి.. 19.64 సగటుతో 216 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 58 కాగా.. మూడు సార్లు గోల్డెన్ డకౌట్ (మొదటి బంతికే  నిష్క్రమించడం)  అయ్యాడు. అంతేగాక 3 సార్లు పది కంటే తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరాడు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !