ప్రపంచ కప్ లో నేనే చీఫ్ కోచ్ గా వుంటే టీమిండియా గెలిచేది: రాబిస్ సింగ్

By Arun Kumar PFirst Published Jul 27, 2019, 8:14 PM IST
Highlights

టీమిండియా చీఫ్ కోచ్ రేసులోకి మరో కొత్త పేరు చేరింది. మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ ఈ పదవికోసం దరఖాస్తు  చేసుకున్నట్లు తాజాగా ప్రకటించింది.  

టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవికాలం ముగియడంతో బిసిసిఐ కొత్త కోచ్ వేటను ప్రారంభించింది. ఈ పదవికోసం అర్హత, ఆసక్తి కలిగిన వారినుండి  దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే బిసిసిఐ నుండి ఇలా కొత్త కోచ్ కోసం ప్రకటన వెలువడినప్పటికి రోజుకో కొత్త పేరు ఈ జాబితాలో చేరుతోంది. తాజాగా ఈ రేసులో కొత్తగా టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ పేరు చేరింది. ఈ పదవికోసం తాను దరఖాస్తు చేసుకున్నట్లు స్వయంగా రాబిస్ సింగే ప్రకటించాడు. 

ఈ సందర్భంగా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రిపై ఆయన విమర్శలకు దిగారు. ప్రపంచ కప్ టోర్నీలో భారత  ఓటమికి రవిశాస్త్రి  కూడా ఓ కారణమని  ఆరోపించాడు. ఇలా ఐసిసి నిర్వహించిన చాలా టోర్నీల్లో  టీమిండియా రవిశాస్త్రి పర్యవేక్షలోనే ఓటమిపాలయ్యిందని గుర్తుచేశాడు. కాబట్టి తిరిగి మళ్లీ అతన్నే చీఫ్ కోచ్ గా బిసిసిఐ కొనసాగించబోదని...ఆ నమ్మకంతోనే తాను దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నాడు. 

ప్రపంచ కప్ కు ముందే బిసిసిఐ భారత జట్టు కోచింగ్ టీంలో మార్పులు చేపట్టివుంటే ఇంకా బావుండేదన్నాడు. ఒకవేళ తానే వరల్డ్ కప్ లో టీమిండియా చీఫ్  కోచ్ గా వ్యవహరించి వుంటే సెమీఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి ఫైనల్ చేరేవారిమన్నాడు. ''మొదటి సెమీఫైనల్లో రెండో రోజు భారత్ బ్యాంటింగ్ కు దిగే సమయానికి పిచ్ బాగా చిత్తడిగా వుంది. కాబట్టి  బంతి బాగా స్వింగ్ అవుతూ సీమర్లకు అనుకూలించింది. ఈ విషయం రోహిత్ ఔటవగానే తెలిసింది. 

ఇలాంటి క్లిష్ట సమయంలో కోహ్లీని కాకుండా వేరే ఆటగాన్ని 3వ స్థానంలో  పంపించేవాన్ని. ఇక నాలుగో స్థానంలో కోహ్లీ, ఐదో స్థానంలో ధోనిని ఆడించేవాడిని. దీంతో వారిద్దరి మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడి టీమిండియా గెలిచేది.''  అంటూ  రాబిన్ సింగ్ తన ప్రపంచ కప్ వ్యూహాన్ని బయటపెట్టాడు.

click me!