
తనకు ఇంటర్వ్యూ ఇవ్వకుంటే బాగుండదని ఓ జర్నలిస్టు తనను బెదిరించాడని ఆరోపిస్తూ టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన ఆరోపణలకు సంబంధించి మరో కీలక విషయం వెల్లడైంది. సదరు జర్నలిస్టు ఎవరు..? అని బీసీసీఐ, భారత క్రికెట్ అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న వేళ.. స్వయంగా ఆ జర్నలిస్టే మీడియా ముందుకు వచ్చాడు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సాహా చెప్పినవన్నీ అబద్ధాలే అని, అతడు తనతో చేసిన చాట్ ను తారుమారు చేశాడని ఆరోపించాడు. ఇంతకీ ఆ జర్నలిస్టు ఎవరనుకుంటున్నారా..? ప్రముఖ క్రీడా జర్నలిస్టు బొరియా మజుందార్.
సాహా-జర్నలిస్టు వివాదం గురించి బీసీసీఐ విచారణకు కూడా ఆదేశించిన నేపథ్యంలో మజుందార్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశాడు. సాహా ఇలా చేయడం బాధాకరమని, పబ్లిక్ డొమైన్ లో ఉన్న తనమీద ఇలాంటి ఆరోపణలు చేసినందుకు అతడిమీద పరువు నష్టం కేసు దాఖలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశాడు.
మజుందార్ స్పందిస్తూ.. ‘నాణేనికి ఎప్పుడూ రెండు వైపులు ఉంటాయి. సాహా నా వాట్సప్ చాట్స్ ను తారుమారు చేశాడు. ఇది నా పరువు, ప్రతిష్టను మంటగలిపేలా చేసింది. ఈ విషయంలో బీసీసీఐ నిష్పక్షపాతమైన విచారణ చేపట్టాలని కోరుతున్నాను. నా లాయర్లు సాహాకు పరువు నష్టానికి సంబంధించిన లీగల్ నోటీసులు పంపుతున్నారు..’ అని రాసుకొచ్చాడు.
ఇక వీడియోలో మజుందార్ మాట్లాడుతూ.. సాహాకు తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి వివరించాడు. సాహా.. తనతో చేసిన చాట్స్ లో టాంపరింగ్ చేశాడని, కేవలం తాను మాత్రమే టైప్ చేసిన చాట్స్ ను ఉంచాడని, మిగతావి డిలీట్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ న ట్విట్టర్ లో పోస్టు చేశాడని చెప్పుకొచ్చాడు. సాహా చేసిన ‘తారుమారు’ వ్యవహారాలకు సంబంధించిన కీలక విషయాలను మీడియాతో పంచుకున్నాడు. కాగా.. లంకతో టెస్టు సిరీస్ కు తనను పరిగణనలోకి తీసుకోవడం లేదని జట్టు ఎంపికకు ముందు బీసీసీఐ సెలక్టర్ల నుంచి సమాచారం రావడంతో ఖంగుతిన్న సాహా.. మరుసటి రోజు ట్విట్టర్ లో తనను ఓ జర్నలిస్టు బెదిరించాడని ఆరోపిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
గతనెలలో అతడిని టెస్టు జట్టు నుంచి తప్పించడం కంటే ఈ జర్నలిస్టు వ్యవహారమే ఎక్కువ చర్చనీయాంశమైంది. సాహా చేసిన ఈ ట్వీట్ కు సీనియర్ భారత క్రికెటర్లు మద్దతు కూడా ప్రకటించారు. కాగా ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మలను ఉద్దేశిస్తూ సాహా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న బీసీసీఐ.. మజుందార్ వీడియో నేపథ్యంలో ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.