కమ్మిన్స్ కంగారుతో ఖవాజాకి అన్యాయం... మొట్టమొదటి డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న ఉస్మాన్ ఖవాజా...

By Chinthakindhi RamuFirst Published Jan 7, 2023, 4:30 PM IST
Highlights

Australia vs South Africa 3rd Test: మూడో రోజు ఓవర్ నైట్‌ స్కోరు వద్దే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ప్యాట్ కమ్మిన్స్... 195 వద్ద నాటౌట్‌గా నిలిచిన ఉస్మాన్ ఖవాజా...

2004లో ముల్తాన్ టెస్టులో సచిన్ టెండూల్కర్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్... హడావుడిగా ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. రాహుల్ ద్రావిడ్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి దశాబ్దానికి పైగా చర్చ జరిగింది. సచిన్ టెండూల్కర్ మరో 6 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ అందుకునేవాడు, తన కెరీర్‌లో ఏడో టెస్టు ద్విశతకం నమోదయ్యేది. ‘మాస్టర్’ సచిన్ ఖాతాలో మరో రికార్డు చేరి ఉండేది...

తాజాగా ఇలాంటి హడావుడి నిర్ణయంతోనే  ఉస్మాన్ ఖవాజాకి డబుల్ సెంచరీ అందకుండా చేశాడు ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా సాగలేదు. రెండో రోజు ఉస్మాన్ ఖవాజా 195 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు...

మూడో రోజు నేరుగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు ప్యాట్ కమ్మిన్స్. దీంతో ఉస్మాన్ ఖవాజా కెరీర్‌లో మొట్టమొదటి డబుల్ సెంచరీ అవకాశాన్ని 5 పరుగుల తేడాతో మిస్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ 10 పరుగులు, మార్నస్ లబుషేన్ 79 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 192 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు...

స్టీవ్ స్మిత్‌కి ఇది టెస్టుల్లో 30వ సెంచరీ. ట్రావిడ్ హెడ్ 59 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 70 పరుగులు చేసి అవుట్ కాగా ఉస్మాన్ ఖవాజా 368 బంతుల్లో 19 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 195 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెరీర్‌లో మొట్టమొదటి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని డిక్లేరేషన్ కారణంగా కోల్పోయిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు ఉస్మాన్ ఖవాజా...

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది సౌతాఫ్రికా.  సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్ 15 పరుగులు చేయగా సరెల్ ఎర్వీ 18, హెన్రీచ్ క్లాసీన్ 2, తెంబ భవుమా 35 పరుగులు చేశాడు. ఖాయ జెండో 39, కెల్ వెరెన్నీ 19 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మార్కో జాన్సెన్ 10, సిమాన్ హార్మర్ 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.  

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 3 వికెట్లు తీయగా జోష్ హజల్‌వుడ్ 2 వికెట్లు తీశాడు.  సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 326 పరుగుల దూరంలో ఉంది. అయితే ఆటలో చివరి రోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు పూర్తి ఆట సజావుగా సాగినా సౌతాఫ్రికాని క్లీన్ స్వీప్ చేయాలంటే ఆస్ట్రేలియా బౌలర్లు 14 వికెట్లు తీయాల్సి ఉంటుంది.. 

click me!