U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్: టాస్ గెలిచిన టీమిండియా... ఇంగ్లాండ్‌కి చెక్ పెట్టగలదా...

By Chinthakindhi RamuFirst Published Jan 29, 2023, 5:06 PM IST
Highlights

ఐసీసీ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్ 2023:  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... అపజయం లేకుండా ఫైనల్ చేరిన ఇంగ్లాండ్ జట్టు...

ఐసీసీ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ షెఫాలీ వర్మ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. మహిళల క్రికెట్ విభాగంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి అండర్19 టీ20 వరల్డ్ కప్‌ ఇదే కావడంతో తొలి టైటిల్ ఎవరు కైవసం చేసుకుంటారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

భారత మహిళా జట్టు, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓడినా నెట్ రన్ రేట్ ఆధారంగా ఫైనల్ చేరితే ఇంగ్లాండ్ జట్టు వరుస విజయాలతో అది కూడా భారీ విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చింది.

భారత జట్టు: షెఫాలీ వర్మ, శ్వేతా సెహ్రావత్, సౌమ్య తివారి, గొంగడి త్రిషా, రిచా ఘోష్, హృషితా బసు, తిదాస్ సదు, మన్నత్ కశ్యప్, అర్చనా దేవీ, పర్శవీ చోప్రా, సోనమ్ యాదవ్

ఇంగ్లాండ్ జట్టు: గ్రేస్ స్రీవెన్స్, లిబర్టీ హీప్, నియమ్ ఫీయోనా హోలాండ్, సెరెన్ స్మలే, రియానా మెక్‌డొనాల్డ్, చరీస్ పవెలీ, అలెక్సా స్టోన్‌హౌస్, సోఫియా స్మలే, జోసీ గ్రోవ్స్, ఎల్లీ అండర్సన్, హెన్నా బేకర్ 

షెఫాలీ వర్మ కెప్టెన్సీలోని భారత జట్టు, న్యూజిలాండ్‌ని సెమీ ఫైనల్‌లో ఓడించి ఫైనల్‌ చేరగా, ఇంగ్లాండ్ జట్టు, ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం, జనవరి 29న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది...

మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టు, గ్రూప్ స్టేజీలో వరుస విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరింది. అయితే సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది టీమిండియా...

అంతకుముందు మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2019 టీమిండియాని సెమీస్‌లో ఓడించిన న్యూజిలాండ్‌పై ఘన విజయం అందుకున్న భారత జట్టు, ఇప్పుడు అసలు సిసలైన ఛాలెంజ్‌ని ఫేస్ చేయనుంది. ఇప్పుడు 2022 మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాని ఓడించిన ఇంగ్లాండ్‌ని భారత జట్టు ఫైనల్‌లో ఎదుర్కోనుంది...

అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే, పాకిస్తాన్, వాండా, ఐర్లాండ్ జట్లపై భారీ విజయాలు అందుకుంది ఇంగ్లాండ్. జింబాబ్వేపై 174 పరుగుల తేడాతో, వాండా టీమ్‌పై 138 పరుగుల తేడాతో, ఐర్లాండ్‌పై 121 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్.. పాక్‌తో మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో గెలిచింది...

సూపర్ 6 రౌండ్‌లో వెస్టిండీస్‌ను 95 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్‌కి ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే హోరాహోరీ ఫైట్ ఇవ్వగలిగింది. సెమీస్‌పై ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 99 పరుగులకే ఆలౌట్ అయినా, ఆ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 96 పరుగులకే చాపచుట్టేసింది..

ఇంగ్లాండ్‌ని స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేశామని ఆనందించేలోపు, ఆస్ట్రేలియా 3 పరుగుల తేడాతో ఓడింది. అదీకాకుండా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ మొట్టమొదటి టోర్నీని (1973లో) గెలిచింది ఇంగ్లాండే...

ఆ తర్వాత మొట్టమొదటి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇంగ్లాండ్ మహిళా జట్టే (2009లో) విజేతగా నిలిచింది. దీంతో మొట్టమొదటి అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ విజేతగా కాకుండా టీమిండియా అడ్డుకోగలదా? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.. 

click me!