ఓటమి బాధ్యత నాదే.. వార్నర్

By telugu news teamFirst Published Apr 29, 2021, 1:48 PM IST
Highlights

చెన్నై చేతిలో ఘోర  ఓటమిపాలైంది. అయితే.. ఈ ఓటమికి తామే బాధ్యత వహిస్తున్నట్లు వార్నర్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2021 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. వరస ఓటములు సన్ రైజర్స్ జట్టుని చుట్టుముట్టేస్తున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్ లోనూ ఓటమే ఎదురైంది. చెన్నై చేతిలో ఘోర  ఓటమిపాలైంది. అయితే.. ఈ ఓటమికి తామే బాధ్యత వహిస్తున్నట్లు వార్నర్ పేర్కొన్నాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (7: 5 బంతుల్లో 1x4) తక్కువ స్కోరుకే ఔటవడంతో అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్ 55 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కేవలం 57 పరుగులే చేయగలిగాడు. మరో ఎండ్‌లో మనీశ్ పాండే (61: 46 బంతుల్లో 5x4 1x6) దూకుడు పెంచినా.. వార్నర్ మాత్రం బౌండరీలు కొట్టలేక సింగిల్స్, డబుల్స్‌తో సరిపెట్టాడు.

కానీ.. ఆఖర్లో కేన్ విలియమ్సన్ (26 నాటౌట్: 10 బంతుల్లో 4x4, 1x6), కేదార్ జాదవ్ (12 నాటౌట్: 4 బంతుల్లో 1x4, 1x6) ఎడాపెడా బౌండరీలు బాదడంతో హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది. కానీ.. 172 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (75: 44 బంతుల్లో 12x4), డుప్లెసిస్ (56: 38 బంతుల్లో 6x4, 1x6) మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఐదింట్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ ‘‘ఓటమికి నాదే పూర్తి బాధ్యత. నేనే నెమ్మదిగా బ్యాటింగ్ చేశా. చాలా బంతుల్ని నేరుగా ఫీల్డర్ల చేతుల్లోకి హిట్ చేశాను. కానీ.. మనీశ్ పాండే చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అలానే కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్ కూడా చివర్లో టీమ్‌కి గౌరవప్రదమైన స్కోరుని అందించారు. నేను కొట్టిన ఓ 15 షాట్లు నేరుగా ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లడంతో.. సింగిల్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలానే చాలా బంతుల్ని నేనే ఆడేశాను. మొత్తంగా మ్యాచ్‌ ఓటమికి నేనే బాధ్యత తీసుకుంటున్నా’’ అని ఎమోషనల్ అయిపోయాడు.
 

click me!