ఈ ఇద్దరూ సూపర్ హీరోలే నన్ను కాపాడారు... ఆసుపత్రి బెడ్ మీద నుంచి రిషబ్ పంత్ ట్వీట్...

By Chinthakindhi RamuFirst Published Jan 17, 2023, 12:05 PM IST
Highlights

డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్... 18 రోజుల తర్వాత ట్విట్టర్ ద్వారా క్షేమ సమాచారాన్ని అభిమానులతో పంచుకున్న టీమిండియా వికెట్ కీపర్.. 

గత డిసెంబర్‌ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా యంగ్ సెన్సేషన్ రిషబ్ పంత్, వేగంగా కోలుకుంటున్నాడు. దాదాపు 18 రోజుల తర్వాత సోషల్ మీడియా ద్వారా తన క్షేమ సమాచారాన్ని తెలియచేశాడు రిషబ్ పంత్.  ఢిల్లీ డెహ్రాడూర్ రహదారిలో అతి వేగంగా దూసుకెళ్లిన రిషబ్ పంత్ కారు, డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌ మోకాళ్లకు, వీపు భాగంలో, నుదురు భాగంలో గాయాలయ్యాయి...

నుదురు భాగానికి కుట్లు వేసి, ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించిన వైద్యులు, మోకాళ్లకు జరిగిన గాయాలకు మూడు సార్లు శస్త్ర చికిత్స చేసినట్టు సమాచారం. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయ్యిందని, కోలుకుంటున్నానని ట్వీట్ ద్వారా తెలియచేసిన రిషబ్ పంత్, ప్రమాద సమయంలో తనను కాపాడిన ఇద్దరిని ప్రపంచానికి పరిచయం చేశాడు..

I may not have been able to thank everyone individually, but I must acknowledge these two heroes who helped me during my accident and ensured I got to the hospital safely. Rajat Kumar & Nishu Kumar, Thank you. I'll be forever grateful and indebted 🙏♥️ pic.twitter.com/iUcg2tazIS

— Rishabh Pant (@RishabhPant17)

‘నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నన్ను కాపాడిన ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోలు, యాక్సిడెంట్ సమయంలో నాకు ఎంతో సాయం చేశారు. హాస్పటిల్ దాకా సేఫ్‌గా తీసుకెళ్లేలా చూసుకున్నారు. రజత్ కుమార్, నిషు కూమార్.. థ్యాంక్యూ. జీవితాంతం మీకు రుణుపడి ఉంటాను...’ అంటూ తన తల్లితో పాటు ఆసుపత్రి బెడ్ దగ్గర ఉన్న ఇద్దరు కుర్రాళ్ల ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రిషబ్ పంత్.. 

కారు ప్రమాద సమయంలో రిషబ్ పంత్‌కి సాయం చేసిన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరమ్‌జీత్‌లకు ప్రభుత్వ సత్కరించి, రివార్డు కూడా ప్రకటించింది. అయితే రిషబ్ పంత్ వారి గురించి ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు...   

యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్‌ తల నుంచి రక్తం కారుతుండడంతో తన శాలువా కప్పిన బస్సు డ్రైవర్, అంబులెన్స్‌కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించానని మీడియాకి వెల్లడించారు.. మానవత్వం చాటుకున్న ఆ బస్సు డ్రైవర్ వివరాలను టీమిండియా మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ ఛీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు కూడా....

 
 ఇదిలా ఉంటే రిషబ్ పంత్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందని కొందరు, లేదు 9 నెలల వరకూ టైమ్ పడుతుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఇంకొందరైతే రిషబ్ పంత్ మరో 18 నెలల పాటు క్రికెట్‌కి దూరమైనట్టేనని తేల్చేశారు...

రిషబ్ పంత్‌ ఆరోగ్యం కుదుటపడడంతో రీఎంట్రీ ఇప్పుడిస్తాడనేదానిపై ఓ క్లారిటీ రానుంది. ఆరు నెలలు, లేదా 9 నెలల సమయం తీసుకున్నా పర్లేదు కానీ 18 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌‌కి దూరమైతే రిషబ్ పంత్ మళ్లీ టీమిండియాలోకి రావడం అసాధ్యమవుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు...

జనవరి 7న ముంబైలోని కోకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో రిషబ్ పంత్ మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. అతను మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నాడని సమాచారం...  

click me!